– ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భావితరాలకు పరిచయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు. సోమవారం హుస్నాబాద్‌లోని ఆల్ఫోర్స్ హైస్కూల్‌లో బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆషాఢ మాసంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బోనాల పండుగ తెలంగాణ ప్రజల సంస్కృతికి ప్రతీక అని తెలిపారు.
గ్రామదేవతలకు బోనం సమర్పించడం ఆనవాయితీ అని, ఇటువంటి పండుగలు కుటుంబ బంధాలను బలోపేతం చేయడంతో పాటు యువతకు మన సంస్కృతిని చేరువ చేస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఆల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఈసారి కూడా బోనాల వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు, భవిష్యవాణి కార్యక్రమం ఆకట్టుకున్నాయి. పాఠశాల హౌస్ ఎన్నికల్లో ఎన్నికైన నాయకులు, ఉపనాయకులతో ప్రతిజ్ఞ చేయించి బ్యాడ్జీలను అందజేశారు. అలాగే వివిధ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.



