ఇటీవల దేశాన్ని కుదిపే సిన విద్యార్థుల తిరుగుబాటు జెన్ జి (యువతరం) ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఎల్లెడలా వ్యాపించిన నిరుద్యోగ సమస్య, తీవ్రస్థాయిలో సాగుతున్న అవినీతి, దానిలో భాగంగా జరుగుతున్న ప్రశ్నా పత్రాల లీక్ లు, వాటి కారణంగా పరిమితం గానైనా ఉన్న అవకాశాలు దూరం కావడం ఈ ఆగ్రహానికి కారణా లుగా అందరూ విశ్లేషి స్తున్నారు. ఈ విశ్లేషణ సరైనదే అయినా, అది మాత్రమే చాలదు. ఒక పదిహేను సంవత్సరాల అమ్మాయి తాను ఇంటిదగ్గర తల్లికి అబద్ధం చెప్పి జంతర్‌మంతర్‌కు వచ్చానని ఒప్పుకుంది. అంత చిన్న వయస్సులో ఆమెను కలవరపరచినది కేవలం తన భవిష్యత్తు అవకాశాల లేమి మాత్రమేనా? కాదు. అంతకన్నా లోతైన అంశాలు ఉన్నాయి. ఈ జెన్ జి ఆందోళన దేశ వ్యాప్తంగా అనేక నగరాలకు, పట్టణాలకు దానంతట అదే విస్తరించిందంటే అందుకు ప్రేరేపించిన అంశాలు లోతైనవి ఉన్నాయి. పాలకపార్టీ గాని, ప్రభుత్వం గాని వాటిని కనీసం గ్రహించగలిగే పరిస్థితి లేదు.
ఇది ‘రాజకీయ’ ఆందోళన కాదన్నది స్పష్టమే. దానికి ‘నాయకులు’ లేరన్నదీ స్పష్టమే. ‘నాయకులే’ నడిపిన ఉద్యమం అయివుంటే భారతీయ జనతా పార్టీ అటువంటి ‘నాయకుల’తో వ్యవహరించడం లో ఆరితేరింది. వాళ్ల మధ్య చీలికలు తేవడం, వారిని అప్రదిష్టపాలు చేయడం, ప్రలోభాలకు గురిచేసి వాళ్లని అవినీతిపరులుగా దిగ జార్చడం, కొనివేయడం, అవినీతి నిరోధక శాఖ పేరుతోనో, విదేశీ నిధులను అక్రమంగా కలిగివున్నారనో వాళ్ళ ని బెదిరించడం వంటి పద్ధతులు బీజేపీకి కొట్టిన పిండి. ఈ ఉద్యమానికి ‘నాయకులు’ లేకపోవడంతో బీజేపీకి ఆ పద్ధతులేవీ పారలేదు. అధికార పక్షంగా వాళ్ళ దగ్గర ఉన్న అన్ని అస్త్రాలనూ ప్రయోగించారు కాని అవన్నీ ఘోరంగా విఫలమయ్యాయి. సోనమ్ వాంగ్‌చుక్ తన నిరవధిక దీక్షను విరమించుకున్నా, అదేమీ ఉద్యమం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపలేదు. మంత్రి జె.పి.నడ్డా ఇంటికి ‘కాక్రోచ్’ జనతాపార్టీ నాయకులు ఇద్దరు వెళ్లి చర్చలు జరపడం కూడా విద్యార్థులకు ఆమోదయోగ్యంగా అనిపించలేదు. ముందస్తు షరతులు నిర్దేశించకుం డా చర్చలు జరపడాన్ని విద్యార్థులు అంగీకరించ లేదు.సాధారణంగా జరిగే ఉద్యమాల్లో ‘నాయకులు’ తమ ‘అనుయాయుల’ తరఫున చర్చల్లో పాల్గొంటూ వుంటారు. కాని ఇక్కడ అలా జరగలేదు. ఇక్కడ విద్యార్థులు ‘నాయకుల’ వెనక కాకుండా కొన్ని షరతుల ప్రాతిపదికన (డిమాండ్ల) ఐక్యమయ్యారు. వాటి విషయంలో ఎటువంటి రాజీకీ వారు సుముఖంగా లేరు.
ప్రస్తుత ప్రభుత్వపు నైతిక డొల్లతనం పట్ల విద్యార్థులలో, యువతలో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. ఈ ఉద్యమం ఇంత సర్వవ్యాప్తంగా, ఎక్కడికక్కడ విస్తరించి చాలా స్వల్ప కాలంలోనే ఇంత మద్దతు పొందగలిగిందంటే దాని వెనుక ఉన్న లోతైన కారణం ఇదే. ఉద్యోగావకాశాలు సన్నగిల్లి పోవడమో, వరుసగా ప్రశ్నాపత్రాలు లీక్ కావడమో మాత్రమే ఇంత భారీ సంఖ్యలో జనాన్ని జంతర్‌మంతర్ దగ్గరికి చేర్చలేదు. వ్యవస్థలో ‘జవాబుదారీతనం’ అన్నది లేకపోవడం వారిని కదిలించింది. వ్యవస్థలో ఇన్నిన్ని ఘోరమైన వైఫల్యాలు జరుగుతూవున్నా, వాటికి ఎవరూ బాధ్యత వహించడానికి సంసిద్ధం కాకపోవడంతో పాలకుల నైతిక డొల్లతనం పట్ల యువత ఆగ్రహించింది.
విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ వెనుక ఆ రాజీనామాతోటే ప్రశ్నాపత్రాల లీకేజి సమస్య పరిష్కరించబడుతుందనో, లేక దెబ్బ తిన్న విద్యా వ్యవస్థ చక్కబడుతుందనో ఎవరూ భ్రమపడలేదు. జంతర్ మంతర్ దగ్గర చేరినవారెవ్వరికీ అటువంటి భ్రమలు లేవు. కాని అతగాడి రాజీనామా విషయంలో వెనక్కి తగ్గేదే లేదన్న వైఖరి వాళ్లు తీసుకు న్నారు. వ్యవస్థలో ఏర్పడిన నైతిక డొల్లత నాన్ని అధిగమించడం కోసమే వారీ నిర్ణయం తీసుకున్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహా రంలో ఎవరో కొంతమంది ఉన్నతాధికారు లనో, ఆ దిగువస్థాయి ఉద్యోగులనో బాధ్యు లుగా చూపించి అక్కడికి సరిపెట్టేయడాన్ని వాళ్లు ఆమోదించలేదు. రాజకీయ వ్యవస్థలో ఎవరో ఒకరు దీనికి బాధ్యత వహించా ల్సిందేనని పట్టుబట్టారు. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి బాధ్యులమీద చర్యల తీసుకుంటాం అని మోడీ ఇచ్చిన హామీ పని చేయలేదు. ప్రభుత్వం నైతికంగా బాధ్యత వహించాలన్న డిమాండ్ విద్యార్థుల్ని, యువతని ఇంట్లో చెప్పకుండా పారిపోయి వచ్చిన ఆ 15 ఏండ్ల అమ్మాయితో సహా, పెల్లెట్ గన్నులను ఎదుర్కొన్న ధైర్యవంతులైన యువతీయువకులతో సహా, అందరినీ ఐక్యం చేసింది.
ఈ నైతిక డొల్లతనం అనేది ప్రస్తుత ప్రభుత్వం నరనరాల్లోకీ ప్రవేశించింది. అది రాజకీయ వ్యవస్థ అంతటికీ ఒక అంటువ్యాధి మాదిరిగా విస్తరించింది. తమ పార్టీకి ఓటు వేయరేమో అన్న అనుమానంతో కోట్లాదిమంది పౌరులకు ఓట్లు లేకుండా చేయడం, అందుకోసం ఎన్నికల కమిషన్ ను వాడుకోవడం, అసలు ఆ ఎన్నికల కమిషన్‌ను ఏర్పరచడానికే అనైతిక పద్ధతులను ఉపయోగించడం ( ప్రధానమంత్రి, అతడు నామినేట్ చేసిన మరో వ్యక్తి ఎన్నికల కమిషన్ ను ప్రధానంగా నిర్ణయిస్తారు) ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా, వాటిని తారుమారు చేసేలా ప్రతిపక్ష సభ్యులను కొనివేయడం లేదా బెదిరించి వారిని తమవైపు తిప్పుకోవడం – ఈ పనులన్నీ ప్రజాస్వామ్యం ముసుగులోనే జరుగుతున్నాయి. ఈ నాటకాన్నంతటినీ విద్యార్థులు, యువజనులు చూస్తూనే వున్నారు, తమ వ్యతిరేకతను తెలియజేస్తూనే వున్నారు. ఒక పక్క పాలకవర్గ పెంపుడు జంతువు మాదిరిగా వ్యవహరిస్తూ ‘గోడీ మీడియా’ ఈ నాటకాన్ని ఆకాశానికి ఎత్తేస్తూంటే, మరోవైపు ఈ బండారాన్ని ప్రశ్నించకుండా ఉండేట్టు చాలామంది ప్రజానీకాన్ని భయభ్రాంతుల్ని చేస్తూ వచ్చారు. అటువంటి సమ యంలో విద్యార్థులు ఈ దుర్మార్గాన్ని బహిరంగంగా ప్రశ్నించే దమ్ము చూపించారు. మోడీ భజన నంతటినీ అవహేళన చేస్తూ ప్రదర్శించిన పోస్టర్లు, కార్టూన్లు ఈ వ్యతిరేకతనే బహిర్గతం చేశాయి. దాంతోబాటు భయంతో చచ్చుబడిపోయిన అనేకమందిలో మళ్ళీ చలనాన్ని కలిగించాయి.
నిజానికి ఈ ప్రభుత్వం దేనికీ చలించదు, వెనకడుగు వేయదు , దేనికైనా వెనకాడదు అన్న భయాన్ని ప్రజల్లో నిల బెట్టడానికే పోలీసులు ఆందోళనకారులపట్ల అంత కర్కశంగా వ్యవహరించారు. పెల్లెట్ గన్నులు, మేకులు దిగ్గొట్టిన లాఠీలను ప్రయోగించారు. బాష్పవాయువు ప్రయోగించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరించింది. ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయడంతోబాటు వాళ్లు ఎవరికి వారుగా విడి విడి వ్యక్తులుగా, ఏకాకులుగా భావించేట్టు ప్రభావితం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. ఎవరికి వారు తమకేమీ చేతకాదని, తామేమీ చేయలేని అశక్తులమని భావిస్తూ, ప్రభుత్వం తిరుగులేని మద్దతుతో, బలంతో కొనసాగుతోందని భ్రమ పడుతూ చెదిరిపోతారని ఆశించింది.
ఈ విధమైన నైతిక డొల్లతనం అన్ని ఫాసిస్టు ప్రభుత్వాలకూ ఉండే ఒక లక్షణం. 1930 దశకంలో జర్మనీలో ముందుకొచ్చిన నాజీ ఉద్యమం గుత్త పెట్టుబడి మీద కారాలు మిరియాలు నూరడంతో మొదలుపెట్టింది. కానీ ఆ ఉద్యమం వెనుక ఉన్నది కొంతమంది గుత్తపెట్టుబడిదారులే. అధికారంలోకి వచ్చాక అదే గుత్త పెట్టుబడిదారులతో ఒడంబడిక కుదుర్చుకుంది. అటువంటి ఒప్పందం కుదరడానికి వీలుగా తన సొంత అనుయాయులలో సైతం అనేకమందిని అది ఊచకోత కోయడానికి వెనుకాడలేదు. ఎర్నెస్ట్ రోమ్ నాయకత్వంలో గుత్త పెట్టుబడికి వ్యతిరేకంగా నిలిచిన తమ సహచరులను ‘‘విచ్చుకత్తుల విషమ రాత్రి’’ (నైట్ ఆఫ్ లాంగ్ నైవ్స్)లో బలి తీసుకుంది. గుత్త పెట్టుబడితో కూటమి కట్టడానికి సిద్ధపడింది. అది దాని నైతిక డొల్లతనానికి నిదర్శనంగా నిలిచింది. నేటి నయా ఫాసిస్టులు కూడా గుత్త పెట్టుబడితో, ముఖ్యంగా అందులో కొత్తగా బలపడుతున్న ఒక భాగంతో అధికారంలోకి రావడానికి ముందే ఒడంబడిక కుదుర్చుకున్నారు. యథేచ్ఛగా దేశాన్ని దోచుకోడానికి గుత్తపెట్టుబడిదారులకు అవకాశం కల్పించే అటువంటి ఒడంబడికలతో నైతికత కాస్తా అదృశ్యం అవుతుంది. ఎటువంటి నైతికతా లేకుండా పోయింది కనుకనే ఫాసిస్టులకి ఇప్పుడు గోబెల్స్ తరహా ప్రచారం అవసరమైంది. మన దేశంలో బాలీవుడ్ నటులు ‘‘మోడీతో ఇది సాధ్యమే’’ ( మోడీ హై తో ముమ్కిన్ హై) అంటూ భజనలు చేసేలా వారిని ఒత్తిడి చేస్తున్నది ప్రభుత్వానికి నైతికత కొరవడినందువల్లనే.
ఈ నైతిక డొల్లతనాన్ని సవాలు చేయగల సరైన స్థానంలో ఉన్న ఒక సామాజిక తరగతి మన విద్యార్థులు. వాళ్లు కపటం లేనివారు. ఆదర్శ భావాలతో ఉంటారు. చాలా విషయాలను తెలుసుకుంటూ వుంటారు. ఆలోచిస్తారు. భయమన్నది ఎరుగరు. నైతిక విలువలను గౌరవిస్తారు. ఈ లక్షణాలన్నీ కలిసి ఈ ప్రభుత్వ నైతిక డొల్లతనాన్ని సవాలు చేయగల సామర్థ్యాన్ని వాళ్ళకి కలిగించాయి. ఆ ప్రభుత్వ గోబెల్స్ తరహా ప్రచారాన్ని తిప్పికొట్టగల నైపుణ్యం వారికి ఉంది. విద్యార్థులు సాధించిన విజయం నైతికమైనదే అయినా, రాజకీయాల్లో నైతిక విలువల ప్రాధాన్యతను ఎత్తి చూపగలిగినదే అయినా, దానితో మాత్రమే ఈ వ్యవస్థ మారిపోయిందని అనుకోరాదు. ఒక చిరుతపులిని బోనులో బంధించినంత మాత్రాన దాని వంటి మీద మచ్చలు పోవు కదా!
విద్యార్థులు ముందుకు తెచ్చిన డిమాండ్లు ఈ వ్యవస్థలో ఎటువంటి మార్పునూ తెచ్చేవి కావు. పాలనా వ్యవస్థలలోనూ మార్పులు తీసుకురావు. అటువంటి డిమాండ్లనే గనుక ముందుకు తెచ్చివున్నట్టైతే అప్పుడు వాటిమీద చర్చ చాలా జరిగివుండేది కాని ఉద్యమం ఇంత వేగంగా, ఇంత అప్రయత్నంగా దేశవ్యాప్తంగా విస్తరించి వుండేది కాదు. రైతాంగ ఉద్యమానికి, విద్యార్థి ఉద్యమానికి మధ్య తేడా ఒక్కటే కొట్టవచ్చినట్టు మనకి కనిపిస్తుంది. రైతు ఉద్యమం ప్రధానంగా వర్గ ఉద్యమం. ఒక ప్రధాన వర్గం ప్రయోజనాల పరిరక్షణ కోసం నడిచిన ఉద్యమం అది. ప్రభుత్వం నైతిక బాధ్యతను వహించాలన్న డిమాండ్ తో విద్యార్థి ఉద్యమం నడిచింది. అదే రైతు ఉద్యమం చూస్తే ప్రభుత్వం తెచ్చిన వ్యవస్థాగత మార్పులను వెనక్కి తిప్పికొట్టడం కోసం అది నడిచింది. నయా ఉదారవాద వ్యవస్థలో సామ్రాజ్యవాదుల ప్రయోజనాల కోసం, ఆ సామ్రాజ్యవాదులతో సమీకృతమైన గుత్తపెట్టుబడిదారీ వర్గం ఒత్తిడితో తీసుకువచ్చిన మార్పులను రైతు ఉద్యమం వ్యతిరేకించి పోరాడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవస్థీకృతమైన మార్పులను వేటినీ ఈ ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా తీసుకువచ్చే పరిస్థితి లేదు. అందుచేత ఈ నయా ఫాసిస్టు ప్రభుత్వం, తన ప్రతిష్ట మసకబారిన్పటికీ, ప్రజల్లో సృష్టించిన భయెత్పాత వాతావరణం చెదిరిపోయినప్పటికీ, మళ్ళీ వాటిని పునః ప్రతిష్టించేందుకు తన సర్వశక్తులనూ ఒడ్డుతుంది.
రాబోయే రోజుల్లో మెజారిటీ ప్రజా సమూహాన్ని మతతత్వ భావోద్వేగాలకు మరింత ఎక్కువగా లోనయ్యేట్టు చేయడం, మత ఘర్షణలను సృష్టించడం, పొరుగు దేశాలతో సరిహద్దు వివాదాలను రెచ్చగొట్టడం (ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ దక్షిణాసియా దేశాల వ్యవహారాలన్నీ తన కనుసన్నల్లోనే జరగాలని పట్టుబడుతున్న నేపథ్యంలో ఇది కొంత కష్టసాధ్యం కావచ్చు) ఉద్యమాల ‘‘నాయకత్వాన్ని’’ లోబర్చుకోవడం కోసం ప్రయత్నించడం వంటివి ఈ ప్రభుత్వం వైపు నుండి జరుగుతాయి. ఈ నయా ఫాసిస్టుల మోసాన్ని, కాపట్యాన్ని, అన్నింటినీ మించి దాని విద్వేష రాజకీయాలని ఎండగట్టడంలో విద్యార్థి ఉద్యమం అమోఘమైన పాత్ర పోషించింది. ‘‘అధినాయకుడికి’’ తిరుగే లేదన్న ఒక భ్రమను పటాపంచలు చేసింది. కొన్నేండ్లుగా దేశాన్ని ఆవరించిన భయోత్పాత వాతావర ణాన్ని అది చెదరగొట్టింది. ఈ నయా ఫాసిస్టు పాలన రాజకీయంగా సవాలు చేయగల దారిని అది చూపించింది.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్
నైతిక డొల్లతనం మీద విద్యార్థుల తిరుగుబాటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



