Tuesday, August 4, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిరాజీనామా చేసిన మంత్రికి సన్మానాలా!

రాజీనామా చేసిన మంత్రికి సన్మానాలా!

- Advertisement -

విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత పార్లమెంట్ సమావేశాలకు తొలిసారి వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్‌కు స్వాగతం పలుకుతూ తోటి బీజేపీ ఎంపీలు ‘ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్’ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పార్లమెంట్ ముఖద్వారమైన మకర ద్వార వద్ద ఆయనకు సంప్రదాయ టోపీ ధరింపజేసి, ఆయనకు ఇరువైపులా ఉండి లోపలికి సాదరంగా తోడుకొని వెళ్లారు. అదే సమయంలో మకర ద్వారం వద్ద కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేస్తున్న ప్రతిపక్ష ఎంపీలు ‘చోర్ చోర్.. పేపర్ చోర్’ అంటూ నినాదాలు కూడా చేశారు. రాజీనామా చేసిన కేంద్ర మంత్రి సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి ఏదో సాధించినట్లు పార్లమెంటు లోపలికి వందిమాగధుల పొగడ్తల మధ్య తలెత్తుకు రావటం చూసి ‘రాజీనామా పదం’ సిగ్గుతో తల్లడిల్లిపోవడం నిజం కాదా!

2022 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం పేరిట జైలు నుంచి నాడు గుజరాత్ రాష్ట్రానికి చెందిన బిల్కిస్‌‌బానోపై లైంగికదాడికి పాల్పడిన కేసులో యావజ్జీవ కారాకార శిక్ష పడిన పదకొండు మంది నేరస్తులను జైలు నుండి మోడీ ప్రభుత్వం విడుదల చేసింది. మరోవైపు ఈ కేసు గురించి సాక్ష్యాలు చెప్పిన పోలీసు ఉన్నతాధికారి సంజీవ బట్‌ను ఇతర కేసులలో ఇరికించి జైలు పాలు చేశారు. ఈ కేసు గురించి న్యాయస్థానాలలో పోరాడిన తీస్తా ‌సెతల్వాద్‌ లాంటి న్యాయవాదిని బెయిల్ లభించ కుండా అరెస్టు చేసి జైలుకు పంపారు. స్వాతంత్ర దినోత్సవం పేరుతో కీచక నిందితులను విడుదల చేసిన సందర్భంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు మొదలుకొని కార్యకర్తలు వరకు జైలు నుంచి విడుదలైన నేరస్తులను ఊరేగించి గౌరవ సత్కారాలు చేశారు. ఈ అనాగరిక చర్య పై యావత్ ప్రపంచం ‘పాలకులకు సిగ్గుందా?’ అని ప్రశ్నించింది. ఇప్పుడు మరో రూపంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా సందర్భంగా సిగ్గు విడిచి బీజేపీ మంత్రులు సన్మానాలు చేయడానికి పాల్పడ్డారు.
ఇప్పుడు విద్యావ్యవస్థను చెరబట్టిన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ కుంభకోణంపై కాక్రోచ్ జనతా పార్టీ యువనాయకత్వాన నెల రోజుల పైగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అలుపెరగని పోరాటం చేస్తేనే గాని, అది దేశవ్యాప్త ఉద్యమంగా మారిపోవడంతో మోడీ పరివారానికి ఊపిరాడక రాజీనామా చేయించడానికి దిగిరాక తప్పలేదు. రాజీనామా చేయించకపోతే మరెన్ని పరిణామాలు వస్తాయోనన్న భయంతోనే మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చిది. ఊహించని పరిణామాల నేపథ్యంలో తప్పని స్థితిలో రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ కు బీజేపీ ఎంపీలు పార్లమెంటులో సన్మానాలు చేయడం ఏమిటి? అంటే విద్యామంత్రి తప్పు చేయలేదన్న సంకేతాలను బయట ప్రపంచానికి పంపడమే కదా! ఆ విధంగా రాజీనామాను అవమా నించటమే కదా! సనాతన ఆచారాలకు, ధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిపించే విధానాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రచారం చేసుకుంటున్న సంఘపరివార శక్తులకు విద్యామంత్రి పదవికి రాజీనామా చేసిన, అంటే నేరాన్ని అంగీకరించిన ధర్మేంద్ర ప్రధాన్ కు పార్లమెంటులో సత్కారాలు చేయటం సమ్మతమే కదా! అంటే ఇప్పుడు సిగ్గుపడాల్సింది ఎవరు? రాజ్యాంగం సాక్షిగా పార్లమెంటరీ రాజకీయాలకు సాక్షిగా ఉన్న పార్లమెంటును అవమానించడమే కదా! అంటే తమ ఓటు ద్వారా పార్లమెంటును నిలబెట్టిన ఓటర్లను అంటే దేశ ప్రజానీకాన్ని అవమానించటమే కదా! బిల్కిన్ భానో కేసులో నిందితులకి, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కి తేడా చూపించలేని స్థితికి సంఘపరివార్‌ శక్తులు చేరటం నిజంగానే సిగ్గుపడాల్సి వస్తుంది కదా! అంతేకాదు కొత్తగా నియమించిన విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రేపిస్టులను బలపరిచిన ‌బీజేపీ నాయకుడుగా పేరుగాంచటం మోడీ ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. అధికారంలో ఉన్నవారు ఎన్ని అరాచకాలు చేసినా, కుంభకోణాలకు పాల్పడినా దొంగలుగా ముద్రపడాల్సిన వారు దొరలుగా చలామణి కావడం నేటి వ్యవస్థ దుస్థితిని తెలియజేస్తోంది. అందుకే కాక్రోచ్ జనతా పార్టీ లాంటి యువ శివంగులు పాలకుల సింహాసనాలను కుదిపివేసేలా దూసుకు వస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త!
ముప్పాళ్ల భార్గవ శ్రీ, 98481 20105

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -