Tuesday, August 4, 2026
E-PAPER
Homeఆటలునబికి పిలుపొచ్చింది

నబికి పిలుపొచ్చింది

- Advertisement -

భారత జట్టులో జమ్మూ కశ్మీర్‌ పేసర్‌
శ్రీలంకతో టెస్టు సిరీస్‌‌కు ఎంపిక
నవతెలంగాణ-ముంబయి :
దేశవాళీ ప్రతిభకు పట్టం. ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో గత రెండు సీజన్లుగా అత్యంత నిలకడగా రాణించిన జమ్మూ కశ్మీర్‌ ‌పేసర్‌ అకిబ్‌ ‌నబి (29) తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఈ నెల 15 నుంచి ఆరంభం కానున్న శ్రీలంకతో టెస్టు సిరీస్‌‌లో పోటీపడనున్న భారత జట్టులో అకిబ్‌ ‌నబి భాగం కానున్నాడు. ఈ మేరకు బీసీసీఐ సీనియర్‌ ‌సెలక్షన్‌ కమిటీ అకిబ్‌ ‌నబిని టెస్టు జట్టులోకి ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. భారత పేస్‌ ‌దళపతి జశ్‌‌ప్రీత్‌ ‌బుమ్రా గాయంతో శ్రీలంక సిరీస్‌‌కు దూరం కాగా.. సెలక్షన్‌ ‌కమిటీ అకిబ్‌ ‌నబిని జట్టులోకి తీసుకుంది. గత రెండు రంజీ సీజన్లలో 104 వికెట్లు పడగొట్టిన అకిబ్‌ ‌నబి.. 2025-26 సీజన్‌లోనే ఏకంగా 60 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. జమ్మూ కశ్మీర్‌ ‌తొలిసారి రంజీ విజేతగా నిలువటం అకిబ్‌ నబి ముఖ్య భూమిక పోషించాడు. ఇటీవల శ్రీలంక పర్యటనలో భారత్‌-ఏ తరఫున రెండు ఫస్ట్‌ ‌క్లాస్‌ ‌మ్యాచ్‌‌ల్లో ఆడిన నబి ఆరు వికెట్లతో ఆకట్టుకున్నాడు. నాణ్యమైన పేస్‌, వికెట్ల వేటలో నిలకడ అకిబ్‌ ‌నబి ఎంపికకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. భారత టెస్టు జట్టులో మహ్మద్ సిరాజ్‌, ప్రసిద్‌ ‌కృష్ణ, గుర్నూర్‌ ‌బరార్‌ ‌పేసర్లుగా ఉండగా.. వారితో కలిసి అవకాశం దక్కితే నబి పేస్‌ ‌బాధ్యతలు పంచుకోనున్నాడు. హర్షిత్ రానా, నితీశ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, వాషింగ్టన్‌ ‌సుందర్‌ ‌గాయాలతో శ్రీలంక పర్యటనకు దూరమైన సంగతి తెలిసిందే. శ్రీలంక పర్యటనలో నబికి తుది జట్టులో చోటు దక్కితే.. జమ్మూ కశ్మీర్‌ ‌నుంచి భారత్‌‌కు ప్రాతినిథ్యం వహించిన తొలి టెస్టు క్రికెటర్‌‌గా నబి చరిత్ర సృష్టించనున్నాడు.
​నేడు శ్రీలంకకు పయనం
భారత జట్టు నేడు శ్రీలంకకు బయల్దేరనుంది. శ్రీలంక పర్యటనలో టీమ్‌ ఇండియా రెండు టెస్టులు ఆడనుంది. ఆగస్టు 15 నుంచి గాలెలో తొలి టెస్టు షురూ కానుండగా.. ఆగస్టు 7 నుంచి కొలంబోలో శుభ్‌‌మన్‌ ‌సేన మూడు రోజుల ప్రాక్టీస్‌‌ మ్యాచ్‌ ఆడనుంది. రెండో టెస్టు ఈ నెల 23 నుంచి 27 వరకు కొలంబోలో జరుగనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -