ఆయన ఆదర్శంతో ప్రజా ఉద్యమాలను
బలోపేతం చేయాలి : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు
భద్రాచలంలో సున్నం రాజయ్య 6వ వర్ధంతి సభ
నవతెలంగాణ-భద్రాచలం
ప్రజల కోసం నిరంతరం పోరాడుతూ నిజాయితీతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య అని సీపీఐ(ఎం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు అన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలనీ, అదే ఆయనకు మనమిచ్చే నిజమైన ఘన నివాళి అని తెలిపారు. సోమవారం సున్నం రాజయ్య ఆరో వర్థంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం అంబేద్కర్ సెంటర్లోని రాజయ్య, కుంజా బొజ్జి స్తూపాల వద్ద సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన సభ నిర్వహించారు. ముందుగా పార్టీ సీనియర్ నాయకులు జీఎస్ శంకర్ రావు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మచ్చ వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, ఏజే.రమేష్.. సున్నం రాజయ్య స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సున్నం రాజయ్య అవినీతి, మచ్చలేని నాయకునిగా ప్రజలను అంటిపెట్టుకొని భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధి కోసం జీవితాంతం పోరాడారని కొనియాడారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో సైతం తన మాతృభాషలోనే గళమెత్తి ప్రభుత్వాన్ని నిలదీసిన నాయకుడు రాజయ్య అని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించి ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను దెబ్బతీసే విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని ఆరోపించారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సభలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు, గ్రామపంచాయతీ ఫ్లోర్ లీడర్ బండారు శరత్ బాబు, జిల్లా కమిటీ సభ్యులు సున్నం గంగ, పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు వై. వెంకట రామారావు, సీనియర్ నాయకులు బీబీజీ తిలక్, ఎం.రేణుక, 20వ వార్డు మెంబర్ ఇర్ప అనసూయ, పట్టణ కమిటీ సభ్యులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
మచ్చలేని మహానాయకుడు సున్నం రాజయ్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



