మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు
గుజరాత్‌లో కమలంకు తగ్గిన మెజార్టీ
కాషాయ కంచుకోటలో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం
బంకిపూర్ : జెన్ జీ ఉద్యమంతో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించిన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడి స్థానాన్ని ఆ పార్టీ కోల్పోయింది. మధ్యప్రదేశ్‌లోని దాతియా నియోజకవర్గం లో కాంగ్రెస్ గెలుపొందగా, గుజరాత్‌లోని మంజల్‌పుర్ నియోజకవర్గాన్ని బీజేపీ నిలబెట్టుకుంది. ఇక బీజేపీకి కంచుకోట అయిన బంకిపూర్ నియోజకవర్గంలో ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ (జేఎస్పీ) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్ధి నీరజ్ కుమార్ సిన్హాపై ప్రశాంత్ కిషోర్ 18,953 ఓట్ల తేడాతో గెలుపొందారు. తొలి రౌండ్ నుంచే బీజేపీపై ఆధిక్యత కనబరుస్తూ వచ్చిన కిషోర్‌కు మొత్తంగా 63,203 ఓట్లు రాగా, సిన్హాకు 44,250 ఓట్లు లభించాయి. ఆర్జేడీ అభ్యర్ధి రేఖా కుమారి 14,085 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఈ వార్త తెలియగానే జన్ సురాజ్ పార్టీ ప్రధాన కార్యాలయంలో, ఓట్ల లెక్కింపు కేంద్రం వెలుపల సంబురాలు మిన్నంటాయి. పార్టీ అభిమానులు, మద్దతుదారులు డ్యాన్స్‌లు చేస్తూ, మిఠాయిలు పంచుతూ కనిపించారు. మాజీ ఎన్నికల వ్యూహకర్త అయిన కిషోర్ కొన్నేండ్ల క్రితమే పార్టీని స్థాపించారు. మొదటిసారిగా ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. 1995 నుంచి ఈ సీటులో బీజేపీ ఎన్నడూ ఓడిపోలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో రాజ్యసభకు ఎన్నిక కావడంతో బంకిపూర్ సీటుకు ఉప ఎన్నికలు జరిగాయి. జులై 30న ఉప ఎన్నికల్లో 34.30శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 26 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఈ అసెంబ్లీ సీటు నుంచి నబిన్ వరుసగా ఐదు సార్లు విజయం సాధించారు. అంతకుముందు ఆయన తండ్రి ప్రాతినిధ్యం వహించారు.
బీజేపీ నాయకత్వాన్ని బీహార్ ప్రజలు తిరస్కరించారు : ప్రశాంత్ కిషోర్
బీహార్ ప్రజలు బీజేపీ నాయకత్వాన్ని తిరస్కరించారని ప్రశాంత్ కిషోర్ అన్నారు. గెలుపు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నిక కేవలం ఒక ఎమ్మెల్యేను ఎన్నుకునేందుకు మాత్రమే జరిగినది కాదన్నారు. బీహార్ నాయకత్వంపై ప్రజలు ఇచ్చిన స్పష్టమైన సందేశమని, బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని తెలిపారు. నేరపూరిత ధోరణులు, వివాదాస్పద ప్రవర్తన ఉన్న వ్యక్తికి బీజేపీ నాయకత్వాన్ని అప్పగించిందని, ఇలాంటి నాయకత్వాన్ని బీహార్ ప్రజలు అంగీకరించరని చెప్పారు. ప్రజలిచ్చిన తీర్పును బీజేపీ గౌరవంగా స్వీకరిస్తుందని ఆ పార్టీ బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సరగోయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజా తీర్పు అన్నింటికంటే అతీతమైనదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీల్లా రాజ్యాంగ వ్యవస్థలను లేదా ఈవీఎంలను, ఎన్నికల కమిషన్‌ను తాము విమర్శించబోమని అన్నారు.
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, గుజరాత్‌లో బీజేపీ అభ్యర్థుల గెలుపు
మధ్యప్రదేశ్‌లోని దాతియా నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఘన్‌శ్యామ్ సింగ్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి ఆశుతోష్ తివారిపై 6,016 ఓట్ల తేడాతో ఘన్‌శ్యామ్ గెలుపొందారు. ఆయనకు 66,757 ఓట్లు పోలయ్యాయి. ఆజాద్ సమాజ్‌పార్టీకి చెందిన దామోదర్ యాదవ్‌కు సుమారు 22 వేల ఓట్లు పోలయ్యాయి. గుజరాత్‌లోని మంజల్‌పుర్ నియోజకవర్గాన్ని బీజేపీ నిలబెట్టుకుంది. వడోదర జిల్లాలో ఉన్న ఆ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి సతీశ్ పటేల్ గెలుపొందారు. మాజీ మంత్రి యోగేశ్ పటేల్ జూన్ 2న మృతిచెందడంతో ఆ సీటుకు ఉప ఎన్నిక నిర్వహించారు. మంజల్‌పుర్ ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ మాత్రమే పోటీలో నిలిచాయి. గతం కంటే బీజేపీకి ఈ ఉపఎన్నికల్లో ఓట్లు తగ్గటం గమనార్హం.
బీజేపీకి ఎదురుగాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



