ప్రశ్నించిన అభిజిత్ దీప్కే
స్కాలర్‌షిప్‌తో, రుణంతో చదువుకున్నానని వెల్లడి
సీజేపీ సామాజిక ఉద్యమంగానే కొనసాగుతుందని స్పష్టీకరణ
న్యూఢిల్లీ : నీట్ పేపర్ లీక్ వ్యవహారం లో దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే లక్ష్యం గా బీజేపీ సర్కార్ పావులు కదుపుతుంది. దీప్కే అమెరికా చదువుకునేందుకు డబ్బులు ఎలా వచ్చాయంటూ బీజేపీ నాయకులు ఆర్‌టీఐ దరఖాస్తును దాఖలు చేశారు. దీనిపై అభిజిత్ స్పందిస్తూ తన డిగ్రీని, విద్యా రుణాలకు సంబంధించి పత్రాలను బహిరంగంగా చూపించడానికి తాను సిద్ధమని, మరి బీజేపీ నేతలు కూడా తమ విద్యార్హతలను వెల్లడిస్తారా? అంటూ ఆయన సోమవారం ప్రశ్నించారు. ‘‘నాకు వచ్చిన స్కాలర్‌షిప్ లేఖను, విద్యా రుణం తీసుకున్న లేఖను చూపించడానికి నేను సిద్ధమే, మరీ మీ చక్రవర్తి కూడా తన డిగ్రీ చూపిస్తారా?’ అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. బోస్టన్‌లో పబ్లిక్ రిలేషన్స్‌లో కోర్సు పూర్తి చేసిన దీప్కే కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి నేతృత్వం వహించేందుకు జూన్‌లో భారత్‌కు తిరిగి వచ్చారు. నీట్ పేపర్ లీకేజీపై విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 6వ తేదీన జంతర్ మంతర్ వద్ద ఆయన ఆందోళన ప్రారంభించారు. తొలుత నిరాహార దీక్షగా ప్రారంభమైన ఈ ఉద్యమం దాదాపు రెండు మాసాల వ్యవధిలోనే జాతీయస్థాయిలో ఉద్యమంగా రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే.
ఏ దర్యాప్తుకైనా సిద్ధమే..
ప్రభుత్వం తనపై ఏ దర్యాప్తు నిర్వహించాలనుకున్నా అందుకు తాను సిద్ధమేనంటూ దీప్కే ప్రభుత్వాన్ని సవాలు చేశారు. ‘‘ఏ వ్యక్తి అయినా ఈ ప్రభుత్వాన్ని సవాలు చేస్తే వెంటనే ఆ వ్యక్తిని వేధించేందుకు ఈడీ, సీబీఐ, ఇతర సంస్థలను పంపిస్తుంది. ఒకవేళ ప్రధాని నా వద్దకు ఈడీని పంపించాలనుకుంటే, ప్రధాని తన డిగ్రీ సర్టిఫికెట్ కాపీని కూడా పంపించాలి. అప్పడు నేను కూడా నా విద్యా రుణం, స్కాలర్‌షిప్ వివరాలు, డిగ్రీ సర్టిఫికెట్‌ను బహిరంగపరుస్తాను.’’ అని ఆయన ఛత్రపతి శంభాజినగర్‌లో విలేకర్లతో మాట్లాడుతూ స్పష్టం చేశారు.
రాజకీయాలపై ప్రజలకు నమ్మకం పోతోంది
రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే ఉద్దేశం ఉందా అంటూ విలేకర్లు అడిగిన ప్రశ్నపై దీప్కే స్పందిస్తూ, రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు మా కంటే కూడా మీడియా చాలా ఆత్రంగా వుందని వ్యాఖ్యానించారు. ‘‘ప్రస్తుతం ఈ దేశంలో వున్న రాజకీయ పార్టీల సంఖ్యను చూసినట్లైతే, మీరు కూడా నిరాశపడి వుంటారని అనిపిస్తోంది. అయినా దీన్ని ఒక సామాజిక ఉద్యమంలా కొనసాగించాలన్నదే మా అభిమతం. దేశంలో ప్రస్తుతమున్న రాజకీయ స్థితిగతులను చూస్తున్నాం కదా, మరో పార్టీని ఏర్పాటు చేసి ఏం లాభం.’’ అని ఆయన వివరించారు. ‘‘రాజకీయాల పట్ల ప్రజలకు నమ్మకం కనుమరుగు అవుతోంది. ఉదయానికి ప్రజలు ఒక పార్టీకి ఓటు వేస్తారు. సాయంత్రమయ్యేసరికి మరో పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఉదయం ఒకరు ఎంపి లేదా ఎంఎల్‌ఏ అవుతారు, సాయంత్రానికి వారు మరో పార్టీకి మారతారు.’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
జార్ఖండ్‌లోని విద్యార్ధుల ఆందోళనలకు కాక్రోచ్ జనతా పార్టీ మద్దతు వుంటుందని దీప్కే ప్రకటించారు. వారితో తాను మాట్లాడానని చెప్పారు. ఇటీవల నిర్వహించిన ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో అవకతవకలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ఆ డిమాండ్లు పరిష్కారమయ్యేవరకు వెనక్కి తగ్గవద్దని వారిని కోరానని చెప్పారు.
చక్రవర్తి తన డిగ్రీ చూపిస్తారా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



