పేపర్ లీక్‌లో కేంద్రం తీరుపై ప్రతి ఐదుగురిలో ఇద్దరిది ఇదే వైఖరి!
పోలీసు దౌర్జన్యంపై
విచారణ జరగాలని 62 శాతం మంది అభిప్రాయం
సీజేపీ ఉద్యమాలకు భవిష్యత్తులో మద్దతిస్తామన్న సగం మంది
యువత ఆగ్రహమే అసలు సవాలు : సీ ఓటర్ స్నాప్ పోల్
న్యూఢిల్లీ : దేశంలో పేపర్ లీక్‌ల విషయంలో మోడీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై జెన్ జీ విద్యార్థులతో పాటు యావత్ ప్రజానీకం నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ ఆగ్రహం, అంసంతృప్తులు అనేవి దేశ ప్రజల్లోనే కావు.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు మద్దతిచ్చే ఓటర్లలోనూ పేరుకుపోయాయి. చాలా మంది మోడీ సర్కారు
తీరుపై అసంతృప్తితో ఉన్నారు. తాజా సీఓటర్ స్నాప్ పోల్ ఈ విషయాన్ని వెల్లడించింది. విద్యార్థుల ఆగ్రహం, ఉపాధి అవకాశాల కొరత, యువతలో పెరుగుతున్న నిరాశే కేంద్ర ప్రభుత్వానికి అసలు రాజకీయ సవాలని సర్వే విశ్లేషించింది. పేపర్ లీకుల వివాదం, దానిపై దేశవ్యాప్తంగా జరిగిన విద్యార్థుల నిరసనలు మోడీ సర్కారు ప్రతిష్ఠకు రాజకీయంగా నష్టం కలిగించాయని సీఓటర్ నిర్వహించిన తాజా స్నాప్ పోల్ పేర్కొంది. అయితే ప్రభుత్వానికి అతిపెద్ద సవాలు ఈ వివాదం కాదనీ, పెరుగుతున్న ఆశయాలకు తగ్గ ఉద్యోగ అవకాశాలు లేక యువతలో పెరుగుతున్న అసంతృప్తేనని సర్వే స్పష్టం చేసింది. గతనెల 29, 30 తేదీల్లో దేశవ్యాప్తంగా 18 ఏండ్లు దాటిన 1,349 మందిని కంప్యూటర్ అసిస్టెడ్ టెలిఫోన్ ఇంటర్వ్యూల (సీఏటీఐ) ద్వారా ఈ సర్వే నిర్వహించినట్టు సీఓటర్ వెల్లడించింది. జనాభా, ఎన్నికల గణాంకాలకు అనుగుణంగా ఫలితాలను విశ్లేషించినట్టు వివరించింది.
సగం మందికి పైగా ప్రజల అసంతృప్తి
పేపర్ లీక్‌ల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ పనితీరుపై సగం మందికి పైగా ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సర్వే పేర్కొంది. ముఖ్యంగా ఎన్డీఏకు మద్దతిచ్చే ఓటర్లలోనే 40 శాతం మంది మోడీ సర్కారు వ్యవహరించిన తీరుతో సంతృప్తి చెందలేదని వివరించింది. అంటే అధికార కూటమికి చెందిన ఓటర్లలో ప్రతి ఐదుగురిలో ఇద్దరు కేంద్రంపై అసంతృప్తితో ఉన్నారని సర్వే సూచించింది. దేశ యువతలో ప్రభుత్వ వ్యతిరేక భావన క్రమంగా పెరుగుతోందని కూడా హెచ్చరించింది.
కఠిన చట్టాలే కీలకం
సర్వేలో భాగంగా పేపర్ లీకుల కేసుల్లో ప్రభుత్వం ఏ చర్యకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందని అడగగా… 31.7 శాతం మంది కఠిన చట్టాలే మొదటి ప్రాధాన్యమని చెప్పారు. 27 శాతం మంది కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. మరో 17 శాతం మంది మాత్రం నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాల్సిందని సూచించారు. పేపర్ లీకుల అంశంపై పార్లమెంట్‌లో జరిగిన చర్చపై 35 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా.. 39 శాతం మంది అసంతృప్తి తెలపడం గమనార్హం.
‘కాక్రోచ్’ పోరాటానికి గణనీయమైన మద్దతు
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన విద్యార్థి ఉద్యమాలకు కూడా ప్రజల్లో గణనీయమైన మద్దతు కనిపించింది. సీజేపీ యువత గొంతుకగా మారిందని 12 శాతం మంది అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఇతర ప్రజా సమస్యలపైనా సీజేపీ చేసే ఉద్యమాలకు మద్దతు ఇస్తామని దాదాపు 50 శాతం మంది తెలిపారు. ఎన్డీఏ ఓటర్లలోనూ 38 శాతం మంది భవిష్యత్తులో సీజేపీ చేపట్టే ఉద్యమాలకు మద్దతు ప్రకటించడం గమనార్హం.
అన్ని ఎఫ్‌ఐఆర్‌లూ ఉపసంహరించుకోవాలి
పేపర్ లీక్ వ్యవహారంపై నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల విషయంలో ప్రజాభిప్రాయం భిన్నంగా కనిపించింది. 35.5 శాతం మంది అన్ని ఎఫ్‌ఐఆర్‌లనూ ఉపసంహరించుకోవాలని తెలిపారు. మరో వర్గం శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై నమోదైన కేసులనే ఎత్తివేయాలని అభిప్రాయపడింది.
పోలీసులు తీరుపై స్వతంత్ర విచారణ జరగాలి
నిరసనల సందర్భంగా పోలీసులు అతిగా వ్యవహరించారనే ఆరోపణలపై 62.7 శాతం మంది స్వతంత్ర విచారణ జరగాలని అభిప్రాయపడ్డారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటింటే.. ఎన్డీఏ మద్దతుదారులో కూడా దాదాపు 58 శాతం మంది పోలీసు దౌర్జన్య ఆరోపణలపై విచారణ జరపాలని కోరినట్టు సర్వే వెల్లడించింది. అలాగే నిరసనల్లో అసభ్య పదజాలం ఉపయోగించినవారు, సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర కంటెంట్ పోస్టు చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని 54.2 శాతం మంది అభిప్రాయపడ్డారు. ‘ఇండియా’ బ్లాక్ మద్దతుదారుల్లో కూడా 45 శాతం మంది ఈ విషయంలో పోలీసు చర్యలను సమర్థించారు. మొత్తంగా దేశంలో పేపర్ లీకుల వివాదం, సీజేపీ పోరాటాలు, విద్యార్థి ఉద్యమాలు కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెట్టినప్పటికీ.. యువతలో పెరుగుతున్న నిరాశ, ఉపాధి అవకాశాల కొరత, ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తే రాబోయే రోజుల్లో మరింత పెద్ద సవాలుగా మారే అవకాశముందని సీఓటర్ సర్వే విశ్లేషించింది.
ఎన్డీఏ ఓటర్లలోనూ అసంతృప్తి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



