– ఉప ముఖ్యమంత్రికి పీఆర్టీయూ తెలంగాణ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను చెల్లించాలని పీఆర్టీయూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను శుక్రవారం హైదరాబాద్‌లో ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి, అధ్యక్షులు గార్లపాటి ఉమాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పర్వతి సత్యనారాయణ, కోశాధికారి ఎన్ చంద్రశేఖర్‌రావు కలిసి వినతిపత్రం సమర్పించారు. జీపీఎఫ్, సరెండర్ లీవులు, మెడికల్ బిల్లులు, ఇతర ఆర్థిక చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు.
పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల బిల్లులను ఉద్యోగులకు వెంటనే చెల్లించాలని కోరారు. మూడు డీఏలను తక్షణమే మంజూరు చేయాలని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. అంతకుముందు వారు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంను కలిశారు. ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.