హామీల అమలుపై అయోమయంలో కాంగ్రెస్‌

– అసంబద్ధంగా 6 గ్యారంటీల దరఖాస్తు ఫారాలు
–  పత్రాల డ్రామాలు ఎక్కువ కాలం సాగవ్‌.. :మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్‌ ప్రజలను మోసం చేస్తుందని, హామీల అమలు చేతగాక అయోమయం లో పడిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరు ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చేసిన ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఏ అప్లికేషన్‌ లేకుండా లబ్దిదారులను ఎంపిక చేశామని చెప్పారు. తమ హయాంలో దళారీ వ్యవస్థ లేకుండా ఆన్‌లైన్‌ సిస్టం పెట్టామని తెలి పారు. ఇప్పుడు 6 గ్యారంటీల దరఖాస్తు ఫారాలు అసంబద్ధంగా ఉన్నాయని, కౌలు రైతులను పాస్‌ పుస్తకం నెంబర్లు అడుగుతున్నారని, ఉద్యమకారుల ను కేసుల వివరాలు అడుగుతున్నారని చెప్పారు. గతంలో కాంగ్రెస్‌ హయాంలో ఎఫ్‌ఐఆర్‌ వివరాలు లేకుండా, రికార్డులు లేకుండా చేసి ఇప్పుడు వివరాల డగడం హాస్యాస్పదమన్నారు. పరిపాలన చేయాలని అధికారమిస్తే శ్వేతపత్రాలంటూ తప్పించుకుంటున్నా రని విమర్శించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధిలో 10 శాతమైనా చేయాలని సవాల్‌ విసిరారు. తమ హయాంలో సాగులోకి తెచ్చిన భూమిని కొనసాగిస్తే చాలన్నారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. 9న రుణ మాఫీ, 4న రైతుబంధు అని కోతలు కోసిన కాంగ్రెస్‌ నేతలు.. ఎక్కడ అమలు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. పత్రాల పేరుతో తప్పించుకుని.. బీఆర్‌ఎస్‌పై తప్పు వేసే పని చేస్తున్నారని అన్నారు. అప్పుల్లేకుండా అన్నీ చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని, అలా చేస్తే మీ నాయకత్వాన్ని అంగీకరిస్తామని తెలిపారు.

Spread the love