కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఆత్మహత్యలపై విచారణ జరపాలి

– యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి : పీడీఎస్‌యూ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో జరుగుతున్న ఆత్మహత్యల ఘటనపై విచారణ జరపాలని పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యవర్గం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మామిడికాయల పరశురాం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యావ్యాపారం చేస్తూ ఆత్మహత్యలకు నిలయాలుగా మారిన కార్పొరేట్‌ విద్యాసంస్థలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మేడిపల్లి పరిధిలో పీర్జాదిగూడ శ్రీచైతన్య జూనియర్‌ కాలేజీలో వనపర్తి జిల్లాకు చెందిన వర్ష ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నారని తెలిపారు. బాత్రూమ్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ర్యాంకుల వేటలో విద్యార్థులను బలి చేస్తున్న కార్పొరేట్‌ కాలేజీల వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరారు. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఫీజుల నియంత్రణ చట్టాన్ని తేవాలని సూచించారు. విద్యార్థి సంఘాలు, మేధావులు, విద్యావేత్తలతో కమిటీ వేయాలని పేర్కొన్నారు. కార్పొరేట్‌ విద్యాసంస్థల ఫీజు దోపిడీ, ఆత్మహత్యల ఘటనకు వ్యతిరేకంగా త్వరలో రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

Spread the love