నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ కాటేదాన్ పరిధిలో హెచ్-ఫాస్ట్ (H-FAST) అధికారులు భారీ మొత్తంలో సోదాలు చేపట్టారు. అత్యంత ప్రమాదకరమైన రీతిలో నకిలీ, కల్తీ మసాలా దినుసులను తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఈ దాడుల్లో అధికారులు 25 టన్నుల నకిలీ మసాలా దినుసులతో పాటు, తయారీకి సిద్ధంగా ఉంచిన మరో 89 టన్నుల కల్తీ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. నిత్యం వాడే జీలకర్ర, లవంగాలు, షాజీరా, ఆవాలు, మెంతులు, సోంపు మరియు చిన్న ఆవాలను ఈ ముఠా రసాయనాలతో కల్తీ చేస్తోంది. ముఖ్యంగా బట్టలకు రంగులు అద్దేందుకు వాడే అత్యంత ప్రమాదకరమైన ఫ్యాబ్రిక్ డై (Fabric Dye)లను ఈ మసాలాల తయారీకి ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
లవంగాల నుంచి నూనె తీసేసిన తర్వాత మిగిలే నాసిరకం చెత్తను సేకరించి, దానికి హానికర కేమికల్స్ కలిపి ప్రాసెస్ చేస్తున్నారు. అనంతరం వాటిపై ప్రముఖ బ్రాండెడ్ ముద్రలు వేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఈ కల్తీ ప్రాసెసింగ్ కోసం ఇండోర్ నుంచి ప్రత్యేకమైన యంత్రాలు, పరికరాలను తెప్పించి మరీ వ్యాపారం సాగిస్తున్నట్లు తేలింది. తక్కువ ధరలకే లభిస్తున్నాయనే ఆశతో స్థానిక మార్కెట్ల ద్వారా వీటిని విక్రయిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ ముఠాపై అధికారులు తీవ్ర స్థాయిలో చర్యలకు ఉపక్రమించారు.



