ఎనిమిది శాతం పడిపోయిన షేర్ విలువ
ముంబయి : దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లో 6 శాతం వాటాల విక్రయ ప్రక్రియ మొదలయ్యింది. మంగళవారం నుంచి ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా ఈ వాటాలను అమ్మడం ద్వారా రూ.31,000 కోట్లు పైగా రాబట్టుకోవాలని మోడీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఎల్ఐసీ షేర్లను 10 శాతం తక్కువకు విక్రయించాలని నిర్ణయించింది. ఈ దెబ్బతో మంగళవారం ఎల్ఐసీ షేర్లు 8.66 శాతం పతనమై రూ.391.40 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఏకంగా 9.26 శాతం పడిపోయాయి. ఇది గడిచిన నాలుగు నెలల కాలంలోనే అత్యంత కనిష్ట స్థాయి కావడం గమనార్హం. 2022లో తొలిసారిగా వాటాలను విక్రయించింది. తాజాగా సోమవారం 2 శాతం వాటాను విక్రయించనున్నట్టు ప్రకటించగా.. అదనంగా మరో 4.5 శాతం వాటాను ఉపసంహరించుకునే (గ్రీన్‌షూ ఆప్షన్) అవకాశాన్ని కూడా కల్పించింది. ఒక్కో షేరు ధరను రూ. 382 చొప్పున భారీ డిస్కౌంట్‌తో నిర్ణయించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ వాటా విక్రయం ద్వారా ఎల్ఐసీలో 10 శాతం వాటాలు ప్రయివేటు శక్తుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌యూల్లో రూ.80 వేల కోట్ల విలువ చేసే వాటాలను విక్రయించాలని మోడీ సర్కార్ బడ్జెట్లో లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఈ ఏడాది వివిధ పీఎస్‌యూ వాటా విక్రయాల ద్వారా ప్రభుత్వం సుమారు రూ.21,200 కోట్లను సమీకరించింది. ఎల్ఐసీ వాటా విక్రయం ద్వారా రూ. 31,400 కోట్లు కేంద్ర ఖజానాకు చేరే అవకాశం ఉంది.
ఎల్ఐసీలో 6 శాతం వాటాల విక్రయం షురూ
- Advertisement -
- Advertisement -



