78 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి ?
ఈనెల10 వరకు దరఖాస్తు ఫారాలు అందజేతకు గడువు
17న ముసాయిదా ఓటరు జాబితా విడుదల
సెప్టెంబరు 9 వరకు అభ్యంతరాలు, సవరణలకు అవకాశం
మృతి చెందిన, డబుల్ ఓట్లపై ప్రత్యేక దృష్టి
బీఎల్‌వోల ఇంటింటి పరిశీలన ముమ్మరం
నవతెలంగాణ–
నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ తుది దశకు చేరుకుంది. బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు) సేకరించిన ఓటర్ల ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ శరవేగంగా జరుగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 78 శాతం పైగా డిజిటలైజేషన్ పూర్తయినట్టు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. బీఎల్‌ఓలకు ఓటర్లు ఫారాలు ఇచ్చేందుకు గడువును ఆగస్టు 10 వరకు ఎన్నికల కమిషన్ పొడిగించిన విషయం తెలిసిందే. అప్పటిలోగా డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి కావాలి. రాష్ట్రంలో ఓటర్లు 3,38,26,441 మంది ఉన్నారు. ఇప్పటివరకు 2,60,91,334 ఫారాల డిజిటలైజేషన్ పూర్తయినట్లు అధికార వర్గాల సమాచారం. ఇంకా 77,36,114 ఫారాలు డిజిటలైజేషన్ కావాల్సి ఉంది. ఫారాలు ఇవ్వనివారిలో ఎక్కువమంది ఇండ్లు మారిన వారు, ఇండ్లు మారినచోట ఓటు నమోదు చేయించుకున్న వారు ఉన్నారు. చనిపోయిన ఓటర్ల సంఖ్య దాదాపు 5 లక్షల వరకు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.
పట్టణ ప్రాంతాల కంటే సొంత ఊర్లలో ఓటు ఉంచుకునేందుకే చాలామంది ఇష్టపడ్డారు. ఆయా రాష్ట్రాలకు చెందినవారు ఇక్కడ నివసించినా పుట్టిన రాష్ట్రాలలో ఓటు ఉంచుకునేందుకు చాలామంది మొగ్గుచూపారని హైదరాబాద్, మేడ్చెల్, రంగారెడ్డి జిల్లాలో అయిన ఫారాల డిజిటలైజేషన్ శాతాన్ని పరిశీలిస్తే తెలుస్తోంది. చివరి వరకు సమయం ఉన్నందున వేచి చూడాలని ఎన్నికల అధికారులు అంటున్నారు. జిల్లాల వారీగా పరిశీలించినప్పుడు సూర్యాపేటలో 98.77 శాతం(హుజుర్‌నగర్ నియోజకవర్గంలో 100 శాతం) పూర్తయింది. నల్లగొండలో 85 శాతం, యాదాద్రిలో 90 శాతం, రంగారెడ్డిలో 63.43 శాతం, మేడ్చెల్‌లో 61.37 శాతం, హైదరాబాద్‌లో 56.31 శాతం, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ తదితర జిల్లాలో 80 నుంచి 90 శాతం డిజిటలైజేషన్ పూర్తయింది. కొత్త ఓటర్ల నమోదు ఎంత అనేది ఓటర్ల తుదిజాబితా విడుదల చేసినప్పుడే తెలిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
సూర్యాపేట జిల్లాలో 98.77 శాతం పూర్తి
సూర్యాపేట జిల్లాలో మొత్తం 10,08,252 మంది ఓటర్లు ఉండగా, 9,95,834 ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజ్ చేసి 98.77 శాతం ప్రక్రియ పూర్తి చేశారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో డిజిటలైజేషన్ 100 శాతం పూర్తికాగా, సూర్యాపేట, కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గాల్లో 98 శాతానికి పైగా పూర్తయ్యింది. పరిశీలనలో 25,685 మంది మృతి చెందిన ఓటర్లు, 44,411 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓటర్లను అధికారులు గుర్తించారు.
నల్లగొండ జిల్లాలో 85 శాతం దాటిన డిజిటలైజేషన్
నల్లగొండ జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1,812 పోలింగ్ స్టేషన్లు, 15,16,253 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలో ఎన్యూమరేషన్ వివరాల డిజిటలైజేషన్ 85 శాతానికి పైగా పూర్తయ్యింది. ఇప్పటికే 179కిపైగా పోలింగ్ స్టేషన్లలో 100 శాతం డిజిటలైజేషన్ పూర్తైనట్టు అధికారులు తెలిపారు.
యాదాద్రి జిల్లాలో 90 శాతం పూర్తి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి సేకరించిన వివరాలను డిజిటల్ పోర్టల్‌లో నమోదు చేసే ప్రక్రియ దాదాపు 90 శాతం పూర్తయ్యింది. మిగిలిన వివరాలను కూడా వేగంగా పూర్తి చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
చనిపోయిన, డబుల్ ఓట్లపై ప్రత్యేక దృష్టి
డిజిటలైజేషన్ అనంతరం ఎన్నికల యంత్రాంగం ఇప్పుడు చనిపోయిన ఓటర్ల పేర్ల తొలగింపు, ఒకే వ్యక్తికి రెండు చోట్ల నమోదైన (డబుల్) ఓట్ల గుర్తింపు, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిన వారి వివరాల పరిశీలనపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి దరఖాస్తునూ బీఎల్‌వోలు క్షేత్రస్థాయిలో ధ్రువీకరించి నివేదికలు సమర్పించనున్నారు.
గ్రామాల్లో వేగం.. పట్టణాల్లో జాప్యం
గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు ఇండ్ల వద్ద అందుబాటులో ఉండటంతో ఎన్యూమరేషన్, డిజిటలైజేషన్ వేగంగా పూర్తయింది. అయితే పట్టణ ప్రాంతాల్లో వలసలు, నివాస మార్పుల కారణంగా ప్రక్రియ కొంత నెమ్మదిగా సాగిందని అధికారులు చెబుతున్నారు.
రాజకీయ పార్టీల దృష్టి
ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు మిగతా జిల్లాల్లోనూ సర్ ప్రక్రియను అన్ని రాజకీయ పార్టీలూ నిశితంగా పరిశీలిస్తున్నాయి. తుది ఓటరు జాబితాలో చోటుచేసుకునే మార్పులు రానున్న ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అధికారులు కూడా పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు. ముసాయిదా జాబితా విడుదల, అభ్యంతరాల పరిష్కారం, క్షేత్రస్థాయి ధ్రువీకరణ అనంతరం వెలువడే తుది ఓటరు జాబితాపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
17న ముసాయిదా జాబితా
ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ తుదిదశకు చేరడంతో ఎన్నికల యంత్రాంగం ఇప్పుడు ముసాయిదా ఓటరు జాబితా విడుదల, దావాలు–అభ్యంతరాల పరిష్కారంపై దృష్టి సారించింది. డిజిటలైజేషన్ ఆధారంగా రూపొందించిన ముసాయిదా ఓటరు జాబితాను ఆగస్టు 17న విడుదల చేయనున్నారు. 10 నుంచి సెప్టెంబరు 9 వరకు పేర్లు, చిరునామా, ఇంటిపేరు, ఇతర వివరాల్లోని తప్పులను సరిచేసుకునేందుకు, కొత్తగా అభ్యంతరాలు తెలియజేయడానికి అవకాశం కల్పించనున్నారు. అక్టోబర్ 19న ఓటర్ల తుది జాబితా విడుదల అవుతుంది.



