జైల్‌భరోకు సన్నద్ధం కండి..జిల్లా, మున్సిపల్, మండల కేంద్రాల్లో నిరసనలు
సంపద సృష్టికర్తల కష్టానికి విలువ లేదా?
పోరాడి సాధించుకున్న చట్టాలను నిర్వీర్యం చేస్తే ఊరుకోం
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పోరాటాలకు శ్రీకారం
కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ లో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈ నెల 10న నిర్వహించ తలపెట్టిన జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. అదే రోజు నిర్వహించతలపెట్టిన ‘చలో లోక్‌భవన్’ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశాయి. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఐఎన్టీయూసీ,ఏఐటీయూసీ,హెచ్ఎంఎస్, సీఐటీయూ, టీయూసీఐ,ఐఎఫ్టీయూ,
టీఎన్టీయూసీ, బీఆర్టీయూ, ఏఐయూటీయూసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ కేంద్రంలోని
బీజేపీ ప్రభుత్వం కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీల
పట్ల అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఇటీవల కాలంలో రూపొందించిన చట్టాలు, తీసుకొస్తున్న బిల్లులే అందుకు సాక్ష్యమని చెప్పారు. సులభతర వ్యాపారం పేరుతో పెట్టుబడిదారుల గరిష్ట లాభాల కోసం కార్మిక చట్టాలను ప్రభుత్వం రద్దు చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ జీడీపీని పెంచేందుకు నిరంతరం రెక్కలు ముక్కలు చేసుకుంటున్న శ్రమజీవుల పట్ల మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించటం తగదని హితవు పలికారు. సంపద సృష్టికర్తలకు వ్యతిరేకంగా పనిచేస్తూ..కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా క్షేత్ర స్థాయిలో కార్మిక, కర్షక, కూలీల ఐక్య ఉద్యమాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. మోడీ ప్రభుత్వం కార్మిక, రైతు, వ్యవసాయ కూలీలకు వ్యతిరేకంగా మరింత దూకుడుగా పాలన సాగిస్తున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో రైతాంగ పోరాట స్ఫూర్తితో ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక విధానాలను నిలవరించాలంటే సమర శీల పోరాటాలే మార్గమని స్పష్టం చేశారు. ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్ర కార్మిక సంఘాల సూచన మేరకు ఐక్య పోరాటాలను బలోపేతం చేయాలని తెలిపారు. జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రెబ్బ రామారావు మాట్లాడుతూ లేబర్ కోడ్లు అమలైతే తరతరాలుగా పోరాడి సాధించుకున్న హక్కులను కార్మిక వర్గం కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ కోడ్లు రద్దయేంత వరకు ఐక్య పోరాటాలు నిర్వహించాలన్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ కార్మిక కోడ్ల సవరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం రోజువారీ పనిదినాన్ని 8 గంటల నుంచి 12గంటలకు పెంచుకునేందుకు యాజమాన్యాలకు పూర్తి స్వేచ్చనిచ్చిందని చెప్పారు. సమ్మె హక్కును కాలరాస్తూ ఆంక్షలు విధించిందనీ, పైగా కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పని చేస్తున్నదంటూ అబద్దాలను ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు.. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను అమలు చేసేందుకు పావులు కదుపుతున్నదని చెప్పారు.
కేరళలోని గత వామపక్ష ప్రభుత్వం ఆ లేబర్ కోడ్లను అమలు చేయబోమంటూ అసెంబ్లీలో తీర్మానించిందని గుర్తు చేశారు. ఆ రకంగా రేవంత్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించాలని డిమాండ్ చేశారు. కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టాలన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కలెక్టరేట్లు, మున్సిపల్, మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలనీ, స్వచ్ఛంద అరెస్టులకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు కె సూర్యం మాట్లాడుతూ మోడీ ప్రభుత్వంహక్కులను హరిస్తున్నదని చెప్పారు. దేశాన్ని నియంతృత్వంగా పాలిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు జి రాంబాబు, ఏఐయూటీయూసీ నాయకులు భరత్ మాట్లాడుతూ 2025 విద్యుత్ సవరణ బిల్లు ద్వారా రైతాంగానికి తీవ్ర నష్టాలు ఏర్పడతాయని హెచ్చరించారు. అందువల్ల గత విద్యుత్ పోరాటం తరహాలో బలమైన ఉద్యమాలు నిర్మించాలని కోరారు. కార్మిక వ్యతిరేక మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన ఐక్య ఉద్యమాలను నిర్మించాల్సిన అవశ్యకత ఏర్పడిందన్నారు. ఐఎఫ్టీయూ నాయకులు శివబాబు, ఈశ్వర్ ఐక్య పోరాటాల అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు వీఎస్ రావు, కె ఈశ్వర్రావు, రాష్ట్ర నాయకులు వై సోమన్న, టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎల్ పద్మ, సీఐటీయూ నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం దశరథ్, జె కుమారస్వామి, జి నరేశ్ పాల్గొన్నారు.



