ఏఐసీటీఈ అప్పీలుపై హైకోర్టు
నవతెలంగాణ -హైదరాబాద్
సుల్తాన్ ఉలూం ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలోని ముఫకంజా ఇంజినీరింగ్ కాలేజీలో సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వుల ఆధారంగా జరిగిన అడ్మిషన్లు తుది తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. అనుమతులకు సంబంధించిన ప్రధాన రిట్ పిటిషన్‌ను వీలైనంత త్వరగా విచారించి పరిష్కరించాలని సింగిల్ జడ్జికి సూచించింది. కౌన్సెలింగ్‌కు అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ కాలేజీ దాఖలు చేసిన పిటిషన్‌పై సింగిల్ జడ్జి కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. వాటిని సవాలు చేస్తూ ఏఐసీటీఈ అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌పై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. కాలేజీ తరఫు న్యాయవాది ఇప్పటికే అడ్మిషన్లు పూర్తయ్యాయనీ, ఏఐసీటీఈ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఏఐసీటీఈ తరఫు న్యాయవాది అవసరమైన పత్రాలు సమర్పించక పోవడంతో అనుమతి పొడిగించలేదని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ఏఐసీటీఈని ఆదేశిస్తూ, ప్రధాన పిటిషన్‌ను త్వరగా పరిష్కరించాలని సింగిల్ జడ్జికి సూచించి అప్పీల్‌ను ముగించింది.
యాదాద్రి ట్రస్ట్‌బోర్డుపై హైకోర్టు నోటీసులు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ట్రస్ట్‌బోర్డు ఏర్పాటుకు సంబంధించిన చట్టసవరణలు, ప్రభుత్వ ఉత్తర్వుల చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వంతో పాటు ట్రస్ట్‌బోర్డు చైర్మెన్, సభ్యులు, దేవాదాయశాఖ అధికారులు, యాదాద్రి ఆలయ ఈవో, జిల్లా కలెక్టర్, వైటీడీఏ అధికారులు, ప్రధాన అర్చకులకు నోటీసులు జారీ చేసి పూర్తి వివరాలతో కౌంటర్లు సమర్పించాలని ఆదేశించింది.పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ ట్రస్ట్‌బోర్డు ఏర్పాటుకు వీలుగా దేవాదాయ చట్టంలో చేర్చిన సెక్షన్లు 96, 97 రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. రూ.100 కోట్లకు పైగా ఆదాయం ఉన్న ఆలయాలకు ట్రస్ట్‌బోర్డు ఏర్పాటు చేసే నిబంధనతో పాటు, వంశపారంపర్య ధర్మకర్తకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా సాధారణ సభ్యుడిగా నియమించడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని వాదించారు. ఆలయాల మతపరమైన వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం రాజ్యాంగ పరిరక్షణకు విరుద్ధమని కూడా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.
కనీస వేతనాల సవరణపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
కనీస వేతనాల సవరణ ప్రక్రియలో కొత్త వేజ్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా పాత చట్టం ప్రకారం నోటిఫికేషన్‌లు జారీ చేయడం చట్టబద్ధమేనా అనే అంశంపై పూర్తి వివరణతో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.కార్మిక సంఘాలు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది, రెండు దశాబ్దాలుగా కనీస వేతనాల సవరణ సక్రమంగా జరగక కార్మికులు నష్టపో తున్నారని వాదించారు. ప్రభుత్వ తరఫు న్యాయవాది స్పందిస్తూ, కొత్త విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చే వరకు పాత విధానంలోనే వేతనాలు, వేరియబుల్ డీఏ చెల్లిస్తున్నామని తెలిపారు. దీనిపై చట్టపరమైన స్పష్టత అవసరమని భావించిన ధర్మాసనం ప్రభుత్వం సమగ్ర అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది.
పన్ను మినహాయింపులో ఉదార దృక్పథం అవసరం: హైకోర్టు
డెవలపర్ ఆలస్యంతో నివాస గృహం రిజిస్ట్రేషన్ పూర్తికాలేదనే కారణంతో ఆదాయపు పన్ను మినహాయింపును నిరాకరించడం సమంజసం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. మూలధన లాభాలను కొత్త గృహ నిర్మాణంలో పెట్టుబడి పెట్టిన పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 54ఎఫ్‌ను ఉదారంగా వర్తింపజేయాలని సూచించింది. ఎన్ఆర్ఐ ఎం. సుధాకర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం, డెవలపర్ ఆలస్యానికి కొనుగోలుదారుడిని బాధ్యుడిని చేయలేమని పేర్కొంది. కేవలం రిజిస్ట్రేషన్ ఆలస్యమైందన్న కారణంతో మినహాయింపు తిరస్కరించడం చట్ట ఉద్దేశానికి విరుద్ధమని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రైబ్యునల్ ఉత్తర్వులను రద్దు చేస్తూ పిటిషనర్‌కు సెక్షన్ 54ఎఫ్ ప్రయోజనం కల్పించాలని ఆదాయపు పన్ను శాఖను ఆదేశించింది.
కేటీఆర్ ఎన్నిక చెల్లుబాటే.. పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన రెండు ఎన్నికల పిటిషన్లను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఆరోపణలకు తగిన ఆధారాలు సమర్పించడంలో పిటిషనర్లు విఫలమ య్యారని కోర్టు స్పష్టం చేసింది.కేటీఆర్ పై పోటీ చేసిన కె.కె. మహేందర్‌రెడ్డి, లగిశెట్టి శ్రీనివాస్‌లు కేటీఆర్ నామినేషన్‌లో పూర్తి వివరాలు వెల్లడించలేదనీ, ఆయన కుమారుడు కొనుగోలు చేసిన ఆస్తులకు సంబంధించిన అంశాలపై అనుమానాలున్నాయని పిటిషన్లు దాఖలు చేశారు. కేవలం ఊహాగానాలు, సాధారణ ఆరోపణల ఆధారంగా ఎన్నికను రద్దు చేయలేమని జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు స్పష్టం చేశారు. అవినీతి ఆరోపణలు చేస్తే వాటికి స్పష్టమైన ఆధారాలు సమర్పించాల్సిన బాధ్యత పిటిషనర్లదేనని పేర్కొంటూ రెండు పిటిషన్లను కొట్టివేశారు.
తుదితీర్పునకు లోబడే ముఫకంజా కాలేజీ అడ్మిషన్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



