Thursday, August 6, 2026
E-PAPER
Homeఆటలుస్పిన్‌ పైనే కసరత్తు

స్పిన్‌ పైనే కసరత్తు

- Advertisement -

నెట్‌ బౌలర్లుగా నలుగురు
ఇద్దరు స్పిన్నర్లు, మరో ఇద్దరు పేసర్లు
శ్రీలంక చేరిన టీమిండియా ఆటగాళ్లు

కొలంబో: శ్రీలంకతో రెండు టెస్ట్‌ ‌మ్యాచ్‌‌ల సిరీస్‌ ఆడేందుకు బయల్దేరిన టీమిండియా క్రికెటర్లు కొలంబో చేరుకున్నారు. శుభ్‌‌మన్‌ ‌గిల్‌ ‌సారథ్యంలోని టీమిండియా… శ్రీలంకతో రెండు టెస్ట్‌ ‌మ్యాచ్‌‌ల సిరీస్‌లో భాగంగా ఆగస్టు 15నుంచి గాలే వేదికగా తొలి టెస్ట్‌ ‌ప్రారంభం కానుంది. ఈ టెస్ట్‌ ‌ప్రారంభానికి ముందు టీమిండియా ఆటగాళ్లతో కలిసి నలుగురు నెట్‌ ‌బౌలర్లు శ్రీలంకకు వెళ్లారు. హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, తనుష్ కోటియన్ మరియు విప్‌‌రాజ్ నిగమ్‌ నెట్ బౌలర్ల కోటాలో శ్రీలంకకు జట్టు ఆటగాళ్లతో కలిసి వెళ్లారు. ఈ నలుగురి బృందంలో ఇద్దరు స్పిన్నర్లు, మరో ఇద్దరు బౌలింగ్ ఆల్-రౌండర్లు ఉన్నారు. లెగ్-స్పిన్నర్ విప్రజ్, లెఫ్ట్-ఆర్మ్ రిస్ట్-స్పిన్నర్ శివాంగ్‌లు, ఆఫ్-స్పిన్నర్ కోటియన్, లెఫ్ట్-ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్-రౌండర్ దుబేలతో కలిసి ప్రాక్టీస్ బౌలర్లుగా టీమిండియాతో కలిసారు. విప్‌‌రాజ్ సమర్ధవంతమైన లెగ్-స్పిన్నింగ్ బౌలర్‌ మరియు బ్యాట్‌తో విలువైన పరుగులు చేయగల సమర్ధుడు. ఇటీవల శ్రీలంకలో జరిగిన ముక్కోణపు సిరీస్ కోసం భారత ‘ఎ’కు ఆడాడు. అలాగే 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో శివాంగ్ సంచలనం సృష్టించిన యువ ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు.

ముంబైకి చెందిన కోటియన్ లిస్ట్‌-‘ఎ’ పర్యటనలలో పాల్గొని, కొంతకాలంగా భారత జట్టులో సుపరిచితమైన ఆటగాడిగా ఉన్నాడు. ఇక హర్స్‌ దుబే గత రెండు సీజన్లుగా రంజీ ట్రోఫీలో నిలకడగా వికెట్లు తీస్తున్నాడు. జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టు కోసం భారత జట్టులో అతనికి కూడా చోటు దక్కింది. ఆ జట్టు మంగళవారం సాయంత్రం కొలంబో చేరుకుంది; మొదటి టెస్టుకు ముందు, ఆగస్టు 7 నుంచి మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌లో భాగంగా జరిగే ఈ రెండు టెస్టుల సిరీస్, ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభం కానుంది; రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరగాల్సి ఉంది.

స్పిన్‌పైనే ఫోకస్‌…
శ్రీలంక పర్యటనకు బయల్దేరేముందు భారత టెస్టు ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, యశస్వి జైస్వాల్‌ స్పిన్‌పైనే ప్రధానంగా ఫోకపస్‌ ‌పెట్టారు. శ్రీలంకకు పయనమయ్యే ముందు ముంబయి బాంద్రాలోని ఓ స్పోర్ట్స్‌ సెంటర్‌లో స్పిన్‌ను మెరుగ్గా ఆడేందుకు తీవ్రంగా శ్రమించారు. లంకతో సిరీస్‌కు జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ముంబయి స్పిన్నర్‌ తనుష్‌ కొటియాన్‌తో పాటు మరికొంతమంది లోకల్‌ స్పిన్నర్లతో ఓపెనింగ్‌ ద్వయం నెట్స్‌లో చెమటోడ్చింది. గతంలో స్పిన్‌ను అలవోకగా ఎదుర్కొనే భారత బ్యాటర్లు.. రెండేండ్లుగా స్వదేశంలో పర్యాటక జట్ల స్పిన్‌ ఉచ్చులో చిక్కుకుని విలవిల్లాడుతూ వికెట్లు సమర్పించుకుంటున్నారు. రాబోయే లంక సిరీస్‌ సైతం టీమిండియాకు కఠిన సవాలే. ఆ జట్టులో ప్రభాత్‌ జయసూర్య తన స్పిన్‌ మాయాజాలంతో ముప్పుతిప్పలు పెట్టగల సమర్థుడు. దీంతో భారత ఓపెనర్లు అతడిని నిలువరించేందుకు ప్రత్యేకంగా స్పిన్‌పైనే ఫోకస్‌ పెట్టారు.

ఆకిబ్‌ ‌నబీపైనే అందరి దృష్టి…
జమ్ముకాశ్మీర్‌ ‌పేసర్‌ ఆకిబ్‌ నబీ పైనే అందరి దృష్టి నెలకొంది. స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా గైర్హాజరీలో శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు ఆకిబ్‌ ఎంపికయ్యాడు. తన పదునైన సీమ్‌, స్వింగ్‌ బౌలింగ్‌తో ఇతర రాష్ర్టాల బ్యాటర్లను బెంబేలెత్తించిన నబీ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. జమ్మూ నుంచి ఇప్పటికే పర్వేజ్‌ రసూల్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ టీమిండియా గడపతొక్కగా.. ఇప్పుడు ఆకిబ్‌ మరో అడుగు ముందుకేసి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న ఆ రాష్ట్ర తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -