తెలంగాణ-మహారాష్ట్రల మధ్య సమావేశం ఏర్పాటు చేయండి
జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం రేవంత్ రెడ్డి వినతి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం ఎత్తు పెంచేందుకు మహారాష్ట్ర నుంచి అనుమతులు ఇప్పించాలని జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బ్యారేజీ ఎత్తు పెంపుతో మహారాష్ట్రలో ముంపు ప్రభావం పెద్దగా ఉండదని తెలిపారు. బుధవారం నాడిక్కడ శ్రమశక్తి భవన్లో జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను ఆయన ఛాంబర్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కలిసి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాధాన్యత, ప్రాజెక్టుకు అనుమతుల మంజూరు కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాసిన లేఖ, ప్రధానమంత్రి కార్యాలయం స్పందించి జల్ శక్తికి పంపిన లేఖ విషయాన్ని సీఎం మంత్రితో ప్రస్తావించారు. తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి గతంలోనే రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరిన విషయాన్ని గుర్తు చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల నుంచి 152 మీటర్ల వరకు ఎత్తుతో బ్యారేజీ నిర్మించే అంశంపై పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ (సీడబ్ల్యూపీ ఆర్ఎస్) అధ్యయనం నిర్వహించిందని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. సీడబ్ల్యూపీ ఆర్ఎస్ అధ్యయనం ప్రకారం… 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించినా, 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించినా ముంపులో పెద్దగా బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించాలని కేంద్ర మంత్రి పాటిల్‌ను కోరారు.
అందువల్ల ఎత్తును 152 మీటర్లకు పెంచి బ్యారేజీ నిర్మాణం చేపడితే గ్రావిటీ ద్వారానే నీటి సరఫరాకు అవకాశం ఉంటుందని తెలిపారు. గ్రావిటీ ద్వారా నీటి సరఫరాతో విద్యుత్ వినియోగం భారం ఉండదని, ఈ నేపథ్యంలో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించాలని అభ్యర్థించారు. ఈ అంశంపై సాధ్యమైనంత త్వరగా తెలంగాణ, మహారాష్ట్రల మధ్య సమావేశం ఏర్పాటు చేయాలని జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే పూర్తిగా వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగు నీటి వసతి ఏర్పడుతుందని సీఎం వివరించారు.ఈ సమావేశంలో ఎంపీలు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ, రామసహాయం రఘురాంరెడ్డి, పోరిక బలరాం నాయక్, ఎం.అనిల్ యాదవ్, కడియం కావ్య, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్ పాల్గొన్నారు.
తొలుత సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో అధికారులతో చర్చలు
ప్రధానమంత్రి కార్యాలయం నుంచి లేఖ అందిందని జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు. ఈ అంశంపై మొదట కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి తొలుత తెలంగాణ, మహారాష్ట్ర స్థాయి అధికారులతో చర్చల ప్రక్రియ ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఆ తర్వాత తెలంగాణ, మహారాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రుల సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కాగా కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్, కేంద్ర జలశక్తి శాఖ సెక్రెటరీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపు 10 నిమిషాలకు పైగా సాగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలతో పాటు, రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల అనుమతులు, ఇతర అంశాలపై చర్చించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్,
డిండిలకు పర్యావరణ అనుమతులు ఇవ్వండి.
కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి వినతి
పాలమూరు-రంగారెడ్డి, గౌరవెల్లి, సీతమ్మ సాగర్, డిండి ప్రాజెక్టులకు సత్వరమే పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఉదయం పార్లమెంట్ ఎనెక్స్ లో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌తో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాలకు పైగా సాగిన ఈ భేటీలో ఎంపీలు డాక్టర్ మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ, రామసహాయం రఘురాంరెడ్డి, పోరిక బలరాం నాయక్, ఎం.అనిల్ యాదవ్, కడియం కావ్య, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాధ్ దాస్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టుపై రూ.36,437 కోట్లు, డిండి ఎత్తిపోతలపై రూ.3,187 కోట్లు, సీతమ్మ సాగర్‌పై రూ.1,835 కోట్లు, గౌరవెల్లి ప్రాజెక్టుపై రూ.1,350 కోట్ల నిధుల ఖర్చు చేసిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనుమతులు ఇవ్వకపోవడంతో పనులు నిలిచిపోయాయనీ, ఫలితంగా ప్రాజెక్టుల వ్యయం పెరుగుతోందని వివరించారు. సుప్రీంకోర్టు తీర్పు సానుకూలత నేపథ్యంలో ప్రాజెక్టులకు తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.



