అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం ఖండన
మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం ఎల్‌ఐసీలో మరిన్ని పెట్టుబడులను ఉపసంహరించడం సరైందికాదని అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం (ఏఐఐఈఏ) పేర్కొంది. ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఏఐఐఈఏ పిలుపుమేరకు బుధవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం 2026 ఆగస్టు 3న ప్రకటించిన ‘ఆఫర్ ఫర్ సేల్’ ద్వారా ఎల్‌ఐసీలో తన వాటాను మరింత తగ్గించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఈ ఆఫర్‌లో ఎల్‌ఐసీ చెల్లించిన ఈక్విటీ మూలధనంలో 2.5 శాతం ప్రాథమిక విక్రయంతోపాటు అదనంగా నాలుగు శాతం గ్రీన్‌షూ ఆప్షన్ కూడా ఉందని తెలిపింది. దీంతో మొత్తం పెట్టుబడి ఉపసంహరణ 6.5 శాతానికి చేరే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. 2027 మే నాటికి కనీసం 10 శాతం ప్రజావాటా ఉండాలనే సెబీ నిబంధనను ప్రభుత్వం ఈ నిర్ణయానికి కారణంగా చూపుతోందని గుర్తు చేసింది. ఈ సాంకేతిక కారణం వెనుక అసలు వాస్తవం ఏమిటంటే, దేశంలోని అత్యంత ముఖ్యమైన ఆర్థిక సంస్థల్లో ఒకటైన ఎల్‌ఐసీలో ప్రభుత్వ యాజమాన్యాన్ని మరోసారి మార్కెట్‌కు అప్పగించడం జరుగుతోందని పేర్కొంది.
2022 మేలో ఎల్‌ఐసీ ఐపీఓ ద్వారా ఇప్పటికే 3.5 శాతం వాటాను తగ్గించిన ప్రభుత్వం, ఇప్పుడు మరోసారి అదే దిశగా అడుగులు వేయడం ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయాలన్న తన నిబద్ధత నుంచి వెనక్కి తగ్గుతున్నట్టు స్పష్టమవుతోందని వివరించింది. ఈ తాజా పెట్టుబడి ఉపసంహరణ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణలో ఎదుర్కొంటున్న తీవ్రమైన సంక్షోభాన్ని కూడా బయటపెడుతోందని విమర్శించింది. పెట్టుబడులను ప్రోత్సహించడంలో, నాణ్యమైన ఉపాధిని సృష్టించడంలో, స్థిరమైన మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచడంలో విఫలమైన ప్రభుత్వం, ఇప్పుడు తన ఆర్థిక లోటును భర్తీ చేసుకునేందుకు ప్రభుత్వ ఆస్తులను విక్రయించడంపైనే అధికంగా ఆధారపడుతోందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఏడు ప్రభుత్వ రంగ సంస్థలలో వాటాలను విక్రయించడం ద్వారా రూ.21,000 కోట్లకు పైగా సమీకరించిందని తెలిపింది. ఇది ప్రభుత్వ ఆర్థిక విధానాల వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు దేశ సంపదను విక్రయించడం తప్ప మరొకటి కాదని పేర్కొంది. ‘ఎల్‌ఐసీ కేవలం లాభదాయక సంస్థ మాత్రమే కాదు, కోట్లాది పాలసీదారుల విశ్వాసం, పొదుపులతో నిర్మితమైన ఒక విశిష్ట జాతీయ సంస్థ. గృహ పొదుపులను సమీకరించడం, దేశ నిర్మాణానికి నిధులు సమకూర్చడం, దేశంలోని ప్రతి మూలకు జీవిత బీమా సేవలను విస్తరించడం వంటి అంశాల్లో ఎల్‌ఐసీ అపూర్వమైన పాత్ర పోషించింది.
ఇటువంటి సంస్థలో ప్రభుత్వ యాజమాన్యాన్ని బలహీనపరచడం పాలసీదారుల, దేశ ఆర్థిక వ్యవస్థ, దేశ ప్రయోజనాలకు దీర్ఘకాలంలో హానికరం. ఎల్‌ఐసీ భారత ప్రజల ఆస్తి, స్టాక్ మార్కెట్‌ది కాదని ఏఐఐఈఏ మరోసారి స్పష్టం చేసింది.ఈ ప్రతిపాదన ఓఎఫ్‌ఎస్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వ ఆస్తులను విడతల వారీగా ప్రయివేటీకరించే విధానాన్ని కేంద్రం విరమించుకోవాలి’ అని డిమాండ్ చేసింది. ఎల్‌ఐసీతో పాటు ప్రభుత్వ రంగాన్ని రక్షించేందుకు ప్రజాస్వామ్య శక్తులు, కార్మిక సంఘాలు, పాలసీదారులు, ప్రజలందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చింది.
ఎల్‌ఐసీలో మరింత పెట్టుబడి ఉపసంహరణ సరికాదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



