Thursday, August 6, 2026
E-PAPER
Homeజాతీయంమహిళా రిజర్వేషన్లను త‌క్ష‌ణ‌మే అమలు చేయండి

మహిళా రిజర్వేషన్లను త‌క్ష‌ణ‌మే అమలు చేయండి

- Advertisement -


13వ రోజు కొన‌సాగిన మ‌హిళా సంఘాల ఆందోళ‌న‌
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో

మహిళా రిజర్వేషన్లను త‌క్ష‌ణ‌మే అమలు చేయాల‌ని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నేషనల్ కోయిలిషన్ ఫర్ ఉమెన్స్ రిజర్వేషన్ (ఎన్సీడ‌బ్ల్యూఆర్‌) ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఉమ్మడి ఆందోళ‌న బుధ‌వారం 13వ రోజుకు చేరుకుంది. ఢిల్లీ, పొరుగు రాష్ట్రాల నుండి, ముఖ్యంగా రాజస్థాన్ నుండి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని నినాదాల హోరెత్తించారు. భారీ వర్షాలు, ఇతర ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, రాజస్థాన్‌లోని జైపూర్, కోటా, బుండి, చిత్తోర్‌గఢ్ జిల్లాల నుండి ఐద్వా మహిళలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఐద్వా జాతీయ అధ్య‌క్ష, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు పికె శ్రీమతి, క‌నినిక ఘోష్ మాట్లాడుతూ మహిళలకు సమాన రాజకీయ ప్రాతినిధ్యాన్ని నిరంతరం నిరాకరించడం ప్రజాస్వామ్య సూత్రాలకు, రాజ్యాంగబద్ధమైన సమానత్వానికి ద్రోహం చేయడమేనని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ అనేది కేవలం మహిళలకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, ఇది ప్రాతినిధ్య సంస్థలను బలోపేతం చేసే, సమానత్వం, న్యాయం వంటి విలువలను పెంపొందించే కీలకమైన ప్రజాస్వామ్య అవసరమని నొక్కి చెప్పారు. మహిళల రాజకీయ భాగస్వామ్యం పెరగడం దేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధిపై విప్లవాత్మక ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. జీవితంలోని ప్రతి రంగంలోనూ మహిళలు అద్భుతమైన విజయాలు సాధిస్తున్నప్పటికీ, వారిని సమాన పౌరులుగా లేదా నిర్ణయాధికార సంస్థలలో సమాన భాగస్వాములుగా కాకుండా, కేవలం ‘ఓటు బ్యాంకులు’గా మాత్రమే పరిగణించడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో ఐద్వా ఉపాధ్యక్షులు ఎస్. పుణ్యవతి, జ‌గ్మ‌తి సాంగ్వాన్, కార్యదర్శి ఆశా శర్మ, ఐద్వా కేంద్ర క‌మిటీ స‌భ్యులు మంజీత్ రాఠీ, సర్బాని సర్కార్, ఢిల్లీ అధ్యక్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు ఆశా యాదవ్, ప్రధాన కార్యదర్శి కవితా శర్మ, రాజస్థాన్ ప్రధాన కార్యదర్శి సీమా జైన్, ఢిల్లీ ఉపాధ్యక్షులు మైమూనా మొల్లా, అంజు, ఎన్ఎఫ్ఐడ‌బ్ల్యు ప్రధాన కార్యదర్శి నిషా సిధు, ఇండియన్ క్రిస్టియన్ ఉమెన్స్ మూవ్‌మెంట్‌కు చెందిన దీప్తి, జ్యోసియా థోరట్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -