రోలర్ లేకుండానే చెరువు కట్ట పనులా..?
అధికారుల పర్యవేక్షణ ఎక్కడ..?
లక్షల నిధులు.. నాసిరకం పనులా..?
నవతెలంగాణ – కుభీర్
రైతులకు సాగునీరు అందించి వ్యవసాయాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో మండల పరిధిలోని హంపొలి గ్రామ చెరువు మరమత్తు పనులకు ప్రభుత్వం రూ.39 లక్షల నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పనులు నాణ్యత ప్రమాణాలకు విరుద్ధంగా సాగుతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా పనులు చేపడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామస్థుల కథనం ప్రకారం.. చెరువు కట్టపై మట్టిని వేసిన తర్వాత అది భవిష్యత్తులో కుంగిపోకుండా ఉండేందుకు తప్పనిసరిగా రోలర్‌తో తొక్కించాలి. దీంతో కట్టకు బలం చేకూరడంతో పాటు వర్షాకాలంలో మట్టి కొట్టుకుపోయే ప్రమాదం తగ్గుతుంది. కానీ హంపొలి చెరువులో మాత్రం ఈ ప్రక్రియను పూర్తిగా విస్మరించి కేవలం మట్టి పోసి పనులు ముగిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
రోలర్‌ను ఉపయోగించకుండా తూతూ మంత్రంగా పనులు నిర్వహించడం వల్ల లక్షల ప్రభుత్వ నిధులు వృథా అవుతాయని, పనుల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించిన దాఖలాలు లేవని, దీంతో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా పనుల చేపడుతున్నారని విమర్శించారు. పై విషయాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఇరిగేషన్ అధికారిని వివరణ కోరగా.. పనులను పూర్తిగా పరిశీలించిన తర్వాతే బిల్లులు మంజూరు చేస్తామని తెలిపారు. నాణ్యత లోపాలు గుర్తిస్తే కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించబోమని, అవసరమైతే సరిదిద్దే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే పనులు పూర్తయ్యే వరకు అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టి ప్రభుత్వ నిధులు సద్వినియోగం అయ్యేలా చూడాలని గ్రామస్థులు కోరుతున్నారు.



