శుభ్‌మన్, రాహుల్, జైస్వాల్‌పై ఫోకస్
నేటి నుంచి 3 రోజుల వార్మప్ మ్యాచ్
2017 తర్వాత తొలిసారి టీమ్ ఇండియా ద్వీప దేశంలో టెస్టు సవాల్‌కు సిద్ధమవుతోంది. శుభ్‌మన్‌సేన బలంగా కనిపిస్తున్నా.. జట్టులో ఎక్కువ మందికి శ్రీలంకలో టెస్టు సిరస్ ఆడిన అనుభవం లేదు. ఇటీవల స్వదేశంలోనే స్పిన్‌కు దాసోహమైన భారత్.. శ్రీలంక నాణ్యమైన స్పిన్ సవాల్‌ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. శ్రీలంక ఎలెవన్‌తో భారత్ 3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ నేటి నుంచి ఆరంభం.
నవతెలంగాణ-కొలంబో
భారత్, శ్రీలంక టెస్టు సిరీస్ ఈ నెల 15 నుంచి ఆరంభం కానుండగా.. అసలు సవాల్‌కు ముందే స్పిన్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు టీమ్ ఇండియా సన్నద్ధం అవుతోంది. భారత్, శ్రీలంక ఎలెవన్ మూడు రోజుల వార్మప్ మ్యాచ్ కొలంబోలోని ఎన్సీసీ గ్రౌండ్లో నేటి నుంచి ఆరంభం కానుంది. బలమైన భారత్ స్వదేశంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో టెస్టుల్లో స్పిన్‌ను ఆడేందుకు ఆపసోపాలు పడింది. శ్రీలంక శిబిరంలో నాణ్యమైన స్పిన్నర్లకు కొదవ లేదు. దీంతో రానున్న సిరీస్‌లో టీమ్ ఇండియా బలహీనత మరోసారి విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం చూపించే వీలుంది. సొంతగడ్డపై శ్రీలంక స్పిన్నర్లకు మంచి రికార్డుంది. టెస్టు మ్యాచ్ వేదికలు గాలె, కొలంబో సైతం స్పిన్‌కు అనుకూలం. దీంతో స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధమవటమే శుభ్‌మన్‌సేన ముందున్న ఏకైక పరిష్కారం!.
ఆ ముగ్గురిపై ఫోకస్
బ్యాటింగ్ లైనప్‌లో కీలక ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ శ్రీలంక పర్యటనకు బయల్దేరడానికి ముందే స్వదేశంలో స్పిన్‌ను ఎదుర్కొన్నారు. కానీ శ్రీలంక పరీక్ష ముంగిట నిలిచేందుకు ఆ మాత్రం కసరత్తు సరిపోదు. వార్మప్ మ్యాచ్ వేదిక ఎన్సీసీ గ్రౌండ్లో గాలె, కొలంబో పిచ్ స్వభావంపై ఓ అవగాహన వచ్చేందుకు దోహదం చేయనుంది. ఇక్కడి పరిస్థితులపై వార్మప్ మ్యాచ్‌లో బ్యాటర్లకు స్పష్టమైన అవగాహన రానుంది!. భారత జట్టులో కెఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా మినహా ఇతర ఆటగాళ్లకు ఇక్కడ ఆడిన అనుభవం లేదు. దీంతో వార్మప్ మ్యాచ్‌ను వంద శాతం సద్వనియోగం చేసుకునేందుకు భారత్ ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా, శ్రీలంక ఎలెవన్ జట్టులోని స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు శుభ్‌మన్ గిల్, రాహుల్, యశస్వి జైస్వాల్ ఎదురుచూస్తున్నారు. ఆఫ్ స్పిన్నర్ రమేశ్ మెండిస్, లెగ్ స్పిన్నర్ దిలుమ్ సుదీర, స్లో స్పిన్నర్ అశంక మనోజ్, లెఫ్టార్ట్ స్పిన్నర్ అంజల బండారలు శ్రీలంక ఎలెవన్‌లో ఉన్నారు. కెప్టెన్ సోనల్ దినుశ సైతం స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్.
దీంతో వైవిధ్య స్పిన్ బౌలింగ్‌ను ఆడేందుకు భారత్‌కు వార్మప్ మ్యాచ్‌తో సాధ్యపడనుంది. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో తలెత్తిన లోపాలు, బలహీనతలను వీలైనంత వేగంగా సరిదిద్దుకుని గాలె టెస్టుకు సిద్ధం కావాలనే వ్యూహంతోనే శుభ్‌మన్‌సేన ముందుకెళ్లనుంది. బౌలింగ్ విభాగానికి మహ్మద్ సిరాజ్ సారథ్యం వహించనున్నాడు. శ్రీలంకపై సిరాజ్‌కు అద్భుత గణాంకాలు ఉన్నాయి. ప్రసిద్ కృష్ణ, గుర్నూర్ బరార్, అకిబ్ నబి, మానవ్ సుథర్, సరాంశు జైన్ నుంచి సిరాజ్‌కు మద్దతు ఉండనుంది. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు.
దేనికైనా సిద్ధమే!
శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో మాపై సంధించబోయే ప్రతి ప్రశ్నకు సమాధానంతోనే సిద్ధమవుతున్నామని చీఫ్ కోచ్ గౌతం గంభీర్ అన్నారు. ‘మా ముందున్న సవాల్ గురించి మాకు తెలుసు. తొల టెస్టు నాటికి మా ముందున్న సవాళ్లను అధిగమించేందుకు శ్రమిస్తున్నాం. తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చినా, తొలుత బౌలింగ్ చేయాల్సి వచ్చినా.. మేము ప్రతిదానికి సిద్ధంగానే ఉన్నామని’ బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో గంభీర్ అన్నాడు. ఇదిలా ఉండగా, మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే ప్రమాదం కనిపిస్తోంది. శుక్రవారం నుంచి కొలంబోలో వర్షం సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. భారత్, శ్రీలంక ఎలెవన్ వార్మప్ మ్యాచ్ ఉదయం 10 గంటలకు ఆరంభం.



