Friday, August 7, 2026
E-PAPER
Homeజాతీయంలావాదేవీలపై వడ్డన వద్దు

లావాదేవీలపై వడ్డన వద్దు

- Advertisement -

ప్రభుత్వం ఆదాయ వనరుగా మార్చుకోవాలనుకుంటోంది
ఇది ఉచితంగా, సార్వత్రికంగా ఉండాలి
కేంద్రం ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించిన సీపీఐ(ఎం)


న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా యూపీఐ లావాదేవీలపై చార్జీలు విధించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను సీపీఐ(ఎం) తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. డిజిటల్‌ ఇండియా పేరుతో ‌డిజిటల్‌ ‌చెల్లింపులు, యూపీఐ (యునిఫైడ్‌‌ పేమెంట్స్‌ ఇంటర్‌‌ఫేస్‌)ని ఉచితంగా ప్రజలకు అందించే సేవగా పెంచి పోషించడానికి మోడీ ప్రభుత్వం దూకుడుగా ప్రయత్నించింది. నగదు చెల్లింపులు నిలిపివేసి, డిజిటల్‌ ‌లావాదేవీలను ఉపయోగించాలంటూ ప్రధాని మోడీ ప్రజలకు, చిన్న వ్యాపారులకు, వ్యాపారవేత్తలకు పదే పదే పిలుపిచ్చారు. అభ్యర్ధించారు. యూపీఐని ప్రోత్సహించే ప్రయివేట్‌ ‌పేమెంట్స్‌ ‌కంపెనీతో సహా పలు వాణిజ్య ప్రకటనల్లో స్వయంగా ప్రధానే కనిపించారు. వాస్తవానికి, ఈ ప్రచారాన్ని పెద్ద నోట్ల రద్దుకు ఒక సమర్ధనగా కూడా చూపించారని పొలిట్‌‌బ్యూరో ఆ ప్రకటనలో పేర్కొంది. ఇప్పడు సామాన్య పౌరులు కూడా చెల్లింపులు, లావాదేవీలకు దీన్నొక సాధనంగా స్వీకరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ మౌలిక సదుపాయంగా ఉన్న ఈ డిజిటల్‌ చెల్లింపులపై లావాదేవీల చార్జీలను విధించాలని ప్రతిపాదించడం ద్వారా ఒక ఆదాయ వనరుగా మార్చుకోవాలని ప్రభుత్వం కోరుకుంటోందని పొలిట్‌‌బ్యూరో విమర్శించింది.

యూపీఐ ఎప్పటికీ ఉచితంగానే ఉంటుందంటూ ఇప్పటివరకు చెప్పకుంటూ వచ్చిన ప్రభుత్వం ఇప్పడిలా వ్యవహరించడం ప్రజా విశ్వాస ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంది. ‘‘ఈ చర్యనొక్కదాన్ని వేరుగా చేసి చూడలేం, గత దశాబ్ద కాలంగా, ప్రజలపై అనేక బ్యాంకింగ్‌ ‌సంబంధిత చార్జీలను నెమ్మదిగా పెంచుతూ వచ్చారు. కనీస బ్యాలెన్స్‌‌లు కొనసాగించకపోతే పెనాల్టీలు విధించడం, నిర్దేశిత పరిమితులకు మించి ఏటీఎం లావాదేవీలు జరిపితే అధిక చార్జీలు మోపడం, డెబిట్‌ ‌కార్డుల నిర్వహణా ఫీజులు, ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌ ‌చార్జిలు ఇలా అనేకం ప్రజలపై మోపారు. ఇవన్నీ కలుపుకుంటే అత్యంత ముఖ్యమైన బ్యాంకింగ్‌ ‌సేవలను పొందడం మరింత ఖరీదైనవిగా చేశాయి’’ అని పొలిట్‌‌బ్యూరో ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతిపాదిత బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేసింది. యూపీఐని ఉచితంగా, సార్వత్రికంగానే కొనసాగించాలని, అందరికీ అందుబాటులో ఉండే, ప్రజలకు జవాబుదారీగా ఉండే చెల్లింపుల వ్యవస్థగానే ఉంచాలని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -