Friday, August 7, 2026
E-PAPER
Homeజాతీయంప్రజాధనానికి లెక్కలేవి?

ప్రజాధనానికి లెక్కలేవి?

- Advertisement -

సరిపోలని బడ్జెట్‌ ‌హామీలు…వాస్తవ ఖర్చులు
మోడీ సర్కారు ఆర్థిక నిర్వహణపై ఆక్ష‍ేపణలు
రూ.54 వేల కోట్ల ఖర్చుపై కేంద్రం అంకెల గారడీ
రక్షణ పెన్షన్ల ఖర్చును పొదుపుగా చూపిన వైనం
నీరు, ఇండ్లు, విద్య, అడవుల పేరుతో కేటాయించిన నిధులు ఖర్చు కాలేదు
కొన్ని సందర్భాల్లో అసలు లక్ష్యాలనూ చేరలేదు
లోపించిన పారదర్శకత, జవాబుదారీతనం
కాగ్‌ ‌నివేదికలో షాకింగ్‌ ‌విషయాలు

బడ్జెట్‌లో వేల కోట్ల రూపాయల కేటాయింపులు చేసి గొప్పలు చెప్పుకోవడం.. రాజకీయ, ఎన్నికల సభల్లో పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకోవడం.. ఇదీ మోడీ సర్కారు వ్యవహరించే విధానం. కానీ ఆ డబ్బు ఎక్కడ ఖర్చయిందో చెప్పే ఆధారాలు మాత్రం కేంద్రం వద్ద లేవు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులు ప్రకటించిన లక్ష్యాలకు చేరకపోవడం, ఖర్చులను లెక్కల్లో దాచడం, కేటాయించిన నిధులను వినియోగించకపోవడం వంటి అంశాలతో మోడీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణపై కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ ‌జనరల్‌ (కాగ్) తీవ్ర ప్రశ్నలు లేవనెత్తింది. రూ.54వేల కోట్ల ఖర్చు విషయంలో కేంద్రం అంకెల గారడీని బయటపెట్టింది. ప్రజల పన్నుల నుంచి వచ్చిన ప్రతి రూపాయి గమ్యాన్నీ ప్రభుత్వం స్పష్టంగా చూపించగలుగుతోందా? పార్లమెంట్ ఆమోదించిన నిధులు ప్రజలకు చేరుతున్నాయా? అనే ప్రశ్నలను కాగ్ దేశం ముందుంచింది.

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తరచూ ‘రికార్డుస్థాయి అభివృద్ధి’, ‘క్రమశిక్షణతో కూడిన ఆర్థిక నిర్వహణ’ అని చెప్పుకుంటున్నప్పటికీ.. వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయని కాగ్‌ ‌నివేదిక స్పష్టం చేసింది. కేంద్రం చేసిన రూ.54,282 కోట్ల ఖర్చుకు సంబంధించి అనేక ప్రశ్నలు లేవనెత్తింది. ఈ మొత్తం ఖర్చు ఎలా జరిగిందని తెలిపే 33వేలకు పైగా వినియోగ ధ్రువీకరణ పత్రాలు (యుటిలైజేషన్‌ ‌సర్టిఫికెట్స్‌) కూడా ‌పెండింగ్‌‌లో ఉన్నాయని వివరించింది. పార్లమెంటు ఆమోదించిన ఖర్చులను లెక్కల్లో దాచడం, ప్రజల నుంచి ప్రత్యేక లక్ష్యాల కోసం వసూలు చేసిన సెస్‌‌లను ఆయా రంగాలకు బదిలీ చేయకపోవడం, కేటాయించిన వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయకుండా ‘పొదుపు’గా చూపించటం వంటి అంశాలను కాగ్‌ ‌తీవ్రంగా ప్రశ్నించింది. ప్రజాధనం వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం తీవ్రంగా దెబ్బతిన్నాయని నివేదిక స్పష్టం చేసింది. భారత ప్రభుత్వ 2024-25 ఆర్థిక వ్యయాలపై కాగ్‌ ఈ నివేదికను రూపొందించింది.

​వాస్తవ మొత్తం ఇంకా ఎక్కువే!
కాగ్‌ ‌నివేదికలో ఎక్కువగా చర్చకు వచ్చిన అంశం రూ.54,282.32 కోట్ల ఖర్చుకు సంబంధించిన వినియోగ ధ్రువీకరణ పత్రాలు ఇప్పటికీ పెండింగ్‌‌లో ఉండటమే. అయితే దీని అర్థం ఆ డబ్బు దొంగిలించబడిందని కాదు. కానీ ఆ నిధులు పార్లమెంటు ఆమోదించిన ప్రయోజనాలకే ఖర్చయ్యాయని నిరూపించే అధికారిక ఆధారాలను ప్రభుత్వం సమర్పించలేకపోయిందన్నదే ప్రధాన అభ్యంతరం. ఇంకా ఆందోళనకరమైన విషయం ఏమిటంటే… మొత్తం 54 కేంద్ర మంత్రిత్వ శాఖల్లో కేవలం 15 శాఖల వివరాల ఆధారంగానే ఈ లెక్క వెలుగులోకి వచ్చింది. మిగిలిన 39 శాఖలు పూర్తి వివరాలు ఇవ్వలేదు. దీంతో వాస్తవంగా లెక్కలు చూపని నిధుల మొత్తం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కాగ్‌ ‌సూచించింది.

​రక్షణ పెన్షన్లలో లెక్కల గారడీ
కాగ్‌ ‌గుర్తించిన అత్యంత కీలక అంశం.. రక్షణ పెన్షన్లకు సంబంధించింది. 2024-25లో రూ.3,042.32 కోట్ల పెన్షన్‌ ‌చెల్లింపులను సంబంధిత ఖాతాలో నమోదు చేయకుండా.. ‘సస్పెన్స్‌ ‌హెడ్‌’ అనే మధ్యంతర ఖాతాలో ఉంచారు. దీని ఫలితంగా వాస్తవానికి రూ.3,014.97 కోట్ల అదనపు ఖర్చు కనిపించాల్సిన చోట ప్రభుత్వం రూ.27.35 కోట్ల ‘పొదుపు’ జరిగినట్టు చూపింది. అయితే ఇది ఒక్కసారి జరిగిన తప్పిదం కాదని కాగ్‌ ‌పేర్కొంది. 2022-23లో రూ.5,195.56 కోట్లు, 2023-24లో రూ.2,441.74 కోట్ల పెన్షన్‌ ‌ఖర్చును కూడా ఇదే పద్ధతిలో తదుపరి ఆర్థిక సంవత్సరానికి నెట్టివేసినట్టు వివరించింది. అంటే ప్రజలకు పెన్షన్లు చెల్లించినప్పటికీ.. ఆ ఖర్చు జరిగిన సంవత్సరంలోనే లెక్కల్లో చూపకుండా వేరే సంవత్సరానికి మార్చడం ద్వారా అసలు వ్యయాన్ని తగ్గించి చూపినట్టయిందని నివేదిక పేర్కొంది.

ప్రత్యేక పన్నులు వసూలు… 
ఇతర అవసరాలకు వినియోగం
ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాల పేరుతో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల నుంచి సెస్‌లు, సర్‌చార్జీలు వసూలు చేస్తోంది. ఒక్క 2024-25లోనే ఈ మార్గం ద్వారా రూ.5.29 లక్షల కోట్లు వసూలయ్యాయి. కానీ కాగ్‌ ‌పరిశీలనలో మాత్రం ఆందోళనకరమైన విషయాలు వెల్లడయ్యాయి. ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్షా నిధికి వెళ్లాల్సిన రూ.6,646 కోట్లు బదిలీ కాలేదు. పాఠశాల విద్య కోసం ఉద్దేశించిన ప్రారంభిక్‌ ‌శిక్షా కోశ్‌‌కు రూ.1270 కోట్ల లోటు ఉంది. ఇన్వెస్టర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ‌ప్రొటెక్షన్‌ ‌ఫండ్‌‌కు రావాల్సిన రూ.1135 కోట్లలో రూ.30 కోట్లు మాత్రమే చేరాయి. ప్రజలు ఒక లక్ష్యం కోసం పన్ను చెల్లిస్తే.. ఆ డబ్బు అదే ప్రయోజనానికి కాకుండా ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగిస్తోందన్న అనుమానాన్ని ఈ వివరాలు బలపరుస్తున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

​అడవుల కోసం వసూలు చేసి నిలిచిపోయాయి!
అటవీకరణ పరిహారం కోసం వసూలు చేసిన రూ.10,380 కోట్లకు పైగా మొత్తం.. రాష్ట్రాలకు బదిలీ కాలేదు. మరో రూ.2,193 కోట్లు నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకు ఖాతాల్లోనే నిలిచిపోయాయి. అడవుల నరికివేతకు అనుమతులు ఇవ్వడం జరుగుతున్నప్పటికీ.. వాటికి బదులుగా చేపట్టాల్సిన అటవీకరణ కార్యక్రమాలకు నిధులు సమయానికి చేరకపోవడంతో పర్యావరణ పరిరక్షణ పైనా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

​జవాబుదారీతనమే అసలు ప్రశ్న
కాగ్‌ ఎక్కడా రూ.54 వేల కోట్లు దొంగిలించబడ్డాయని చెప్పలేదు. కానీ ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులు.. ప్రకటించిన లక్ష్యాలకు చేరకపోవడం, పార్లమెంట్ ఆమోదించిన నిధులు ఖర్చు కాకపోవడం, ఖర్చు చేసిన మొత్తాలను సరైన లెక్కల్లో నమోదు చేయకపోవడం, వేల కోట్ల రూపాయల వినియోగానికి సంబంధించి ఆధారాలు సమర్పించకపోవడం వంటి అంశాలు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణలో తీవ్రమైన లోపాలను బయటపెట్టాయని స్పష్టం చేసింది. బడ్జెట్ సమయంలో భారీ ప్రకటనలు, ప్రచార కార్యక్రమాలతో ప్రజల దృష్టిని ఆకర్షించే మోడీ ప్రభుత్వం.. ఆ హామీల అమలుపై వచ్చిన కాగ్‌ వంటి రాజ్యాంగబద్ధ సంస్థల నివేదికలకు మాత్రం సరైన సమాధానాలు ఇవ్వలేకపోతోందన్న విమర్శలు బలపడుతున్నాయి. ప్రజల పన్నుల రూపంలో వచ్చిన ప్రతి రూపాయీ ఎక్కడికి వెళ్లింది? ఏ లక్ష్యానికి వినియోగమైంది? దానికి ఆధారాలు ఎక్కడ? అనే ప్రాథమిక ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వడంలో మోడీ సర్కారు విఫలమవుతోందని తాజా కాగ్‌ నివేదిక సూచిస్తోంది. ఆర్థిక లోటు తగ్గిందనే గణాంకాల కంటే.. ప్రజాధనంపై పార్లమెంట్ పర్యవేక్షణ, ప్రభుత్వ జవాబుదారీతనం, పారదర్శకత దెబ్బతింటున్నాయనే హెచ్చరికే ఈ నివేదిక అసలు సారాంశమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఖర్చు చేసిన విధానంలోనూ గందరగోళం
రూ.12,754 కోట్లకు పైగా ఆదాయం, వ్యయాలను తప్పు ఖాతాల్లో నమోదు చేసినట్టు కాగ్‌ గుర్తించింది. ఉదాహరణకు అణుశక్తి శాఖ రోజువారీ నిర్వహణ ఖర్చును మూలధన వ్యయంగా చూపింది. దీంతో ప్రభుత్వ మూలధన పెట్టుబడులు ఎక్కువగా ఉన్నట్టు కనిపించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.

ఎస్సీ, ఎస్టీల నిధులూ మళ్లింపు
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కోసం కేటాయించిన రూ.457 కోట్లకు పైగా నిధులను ఇతర ఖాతాలకు మళ్లించిందని కాగ్‌ పేర్కొంది. ‌కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించిన సామాజిక న్యాయ హామీలకే ఇది విరుద్ధమని నివేదిక సూచించింది. ఈ విధంగా ఇలాంటి నిధుల మళ్లింపులు అనేవి అసలు లక్ష్యాలు చేరకుండా అడ్డుపడేలా చేస్తున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

పొదుపు పేరుతో అభివృద్ధికి బ్రేక్‌
పార్లమెంట్ 2024-25లో రూ.47.07 లక్షల కోట్ల ఖర్చుకు అనుమతి ఇచ్చింది. కానీ ప్రభుత్వం రూ.42.85 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మిగిలిన రూ.4.22 లక్షల కోట్లను ‘పొదుపు’గా చూపించింది. అయితే కాగ్‌ అభిప్రాయం ప్రకారం.. ఇవి నిజమైన పొదుపులు కావు. ప్రణాళికలను అమలు చేయలేకపోవడం, సామర్థ్య లోపం, ప్రాజెక్టులు ఆలస్యం కావడం వల్ల ఖర్చు చేయలేకపోయిన నిధులే. జల్ జీవన్ మిషన్ కింద తాగునీటి పథకాల కోసం కేటాయించిన రూ.63,146 కోట్లలో రూ.40,531 కోట్లు ఖర్చు కాలేదు. పీఎం ఆవాస్ యోజన (పట్టణ) కింద వేల కోట్ల రూపాయలు వినియోగం కాకుండానే మిగిలిపోయాయి. కాలుష్య నియంత్రణ కోసం పర్యావరణ శాఖకు కేటాయించిన రూ.622 కోట్లలో రూ.16.20 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ప్రపంచంలో అత్యధిక కాలుష్య నగరాలు ఉన్న దేశంగా భారత్ నిలుస్తున్న పరిస్థితుల్లో ఈ నిర్లక్ష్యాన్ని కాగ్‌ పరోక్షంగా ప్రశ్నించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -