Friday, March 27, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలునేడు శ్రీ సీతారాముల కళ్యాణానికి సీఎం

నేడు శ్రీ సీతారాముల కళ్యాణానికి సీఎం

- Advertisement -

ముఖ్యమంత్రిగా రెండోసారి భద్రాద్రి వేడుకలకు రేవంత్‌రెడ్డి
రూ.351 కోట్ల ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన
సీఎంతో పాటు హాజరుకానున్న ఏడుగురు మంత్రులు
2000 మంది పోలీసులతో భారీ భద్రత

నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
భద్రాచలంలో శుక్రవారం నిర్వహించే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దంపతులు హాజరవుతున్నారు. హైదరాబాద్‌ నుంచి వాయు మార్గంలో ముఖ్యమంత్రి ఉదయం 10:15 గంటలకు స్థానిక సారపాక ఐటీసీ గెస్ట్‌ హౌస్‌లో హెలికాప్టర్‌ దిగుతారు. పదిన్నర గంటలకు రామాలయ ప్రాంగణానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రితో పాటు ఏడుగురు మంత్రులు వస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రభుత్వం తరపున మిథిలా స్టేడియంలో జరిగే కల్యాణ వేడుకలో పాల్గొని సీతారాములకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.

2వేల మంది పోలీసులతో భారీ భద్రత
ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని భద్రాచలం పట్టణం ఆధ్యాత్మిక శోభతో పాటు కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి వెళ్లింది. నేడు ముఖ్యమంత్రితో పాటు ఏడుగురు మంత్రులు హాజరవుతున్న దృష్ట్యా ఎస్పీ రోహిత్‌ రాజ్‌ ఆధ్వర్యంలో 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ పరిసరాల్లో ఎక్కడా ఇబ్బందులు కలగకుండా తలంబ్రాలు, ప్రసాదాల కౌంటర్లను భారీగా ఏర్పాటు చేశారు. పట్టణమంతా డ్రోన్‌ కెమెరాలు, సీసీటీవీల నిరంతర పర్యవేక్షణలో ఉండేలా చర్యలు చేపట్టారు.

రూ. 351 కోట్లతో ఆలయ ముఖచిత్రం మార్పు
భద్రాచలం క్షేత్రాన్ని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 351 కోట్ల భారీ అభివృద్ధి పనులకు నేడు ముఖ్యమంత్రి భూమిపూజ చేయనున్నారు. కల్యాణోత్సవం ముగిసిన వెంటనే ఈ చారిత్రక ఘట్టానికి అంకురార్పణ జరగనుంది. గోదావరి కరకట్టల ఎత్తు పెంపు, సుందరమైన ఘాట్ల నిర్మాణం, భక్తుల కోసం మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ఈ నిధులను ప్రభుత్వం కేటాయించింది. రహదారి, రైల్వే మార్గాల విస్తరణ ద్వారా భవిష్యత్తులో భక్తుల రాకను మరింత సులభతరం చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లా కలెక్టర్‌ అంకిత్‌, ఎస్పీ రోహిత్‌ రాజు నేతృత్వంలో గురువారం సీఎం పర్యటించే మార్గాల్లో ట్రయల్‌ రన్‌ నిర్వహించి భద్రతను క్షుణ్ణంగా సమీక్షించారు. హెలిపాడ్‌ నుంచి ఐటీసీ గెస్ట్‌ హౌస్‌ వరకు, అక్కడి నుంచి ఆలయం, మిథిలా స్టేడియం వరకు ప్రతి అంగుళాన్ని భద్రతా సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -