Friday, August 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం10న ‘జైల్ భరో’ ను జయప్రదం చేద్దాం!

10న ‘జైల్ భరో’ ను జయప్రదం చేద్దాం!

- Advertisement -

సీఐటీయూ, ఏఐకేఎస్‌,ఏఐఏడబ్ల్యూయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జైల్ భరోను జయప్రదం చేయాలని సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్ర కమిటీలు కోరాయి. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌‌లోని రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆయా సంఘాల నాయకులు విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ మాట్లాడుతూ… అన్ని కార్మిక, రైతు సంఘాలతో కలిసి ఐక్యంగా, బీజేపీ ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. దానిలో భాగంగా హైదరాబాద్ లో , జిల్లా కలెక్టరేట్ల, మండల కార్యాలయాల వద్ద కార్మికులు, ప్రజలు, వ్యవసాయ కార్మికులు, రైతులు జైల్ భరోలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఉదారవాద సంస్కరణల అమలులో భాగంగా లేబర్ కోడ్‌‌ల అమలుకు నిబంధనలు నోటిఫై చేయడం, విద్యుత్ సవరణ బిల్లు-2025, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి విబి గ్రామ్ జీ పథకాన్ని తీసుకురావడం కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల వ్యతిరేక చర్య అని విమర్శించారు. విత్తన చట్టానికి సవరణలు ప్రతిపాదించడంతో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో పెట్టుబడిదారులకు గరిష్ట లాభాల కోసం కార్మిక చట్టాలను రద్దు చేయటం దుర్మార్గమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కార్మికుల రోజువారీ పని గంటలను 8 నుండి 10 గంటలకు పెంచుకునేందుకు యాజమాన్యాలకు స్వేచ్ఛనివ్వడం కార్పొరేట్ల అనుకూల విధానంలో భాగమని విమర్శించారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరిగే జైల్ భరో కార్యక్రమంలో రాష్ట్రంలోని జిల్లా , నియోజకవర్గ , మండల కేంద్రాల్లో 10న జరిగే జైల్ భరోలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం కోశాధికారి మూడ్ శోభన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. పద్మ, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ హరిబండి ప్రసాదరావు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -