నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఫిడెల్ కాస్ట్రో శత జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న సదస్సులో (కొలోక్వియం) పాల్గొనేందుకు ఏఐకేఎస్, ఏఐఎడబ్ల్యూయూ సభ్యులతో కూడిన ప్రతినిధి బృందం క్యూబా పర్యటనకు వెళ్లింది. ఈ ప్రతినిధి బృందంలో ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్, ఏఐఎడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, సహాయ కార్యదర్శి ఎన్. చంద్రన్ ఉన్నారు. ఈ పర్యటన కేవలం ఫిడెల్ కాస్ట్రో శత జయంతి కార్యక్రమంలో పాల్గొనడానికే కాకుండా, భారత రైతాంగం, వ్యవసాయ కార్మిక ఉద్యమం తరపున క్యూబా ప్రజలకు తెలియజేస్తున్న సంఘీభావానికి కొనసాగింపుగా సాగుతోందని నేతలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నాడిక్కడ హరికిషన్ సింగ్ సుర్జీత్ భవన్లోని ఏఐఎడబ్ల్యూయూ కేంద్ర కార్యాలయంలో ఈ ప్రతినిధి బృందానికి వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. క్యూబా రాయబార కార్యాలయ డిప్యూటీ రాయబారి లూప్ ఫార్మెటా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతినిధి బృందాన్ని అభినందించారు. వారి క్యూబా పర్యటన విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా సామ్రాజ్యవాద దాడులకు వ్యతిరేకంగా క్యూబా ప్రజలు చేస్తున్న పోరాటానికి సంఘీభావం, మద్దతుకు ప్రతీకగా ఈ ప్రతినిధి బృందం పెద్ద మొత్తంలో మందులను కూడా తీసుకెళ్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎడబ్ల్యూయూ సహాయ కార్యదర్శి విక్రమ్ సింగ్, రాజ్యసభ సభ్యుడు, ఏఐఎడబ్ల్యూయూ సహాయ కార్యదర్శి వి. శివదాసన్, డీవైఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడు హిమాగ్నరాజ్ భట్టాచార్య తదితరులు పాల్గొన్నారు.
క్యూబాకు ఏఐకేఎస్, ఏఐఎడబ్ల్యూయూ బృందం
- Advertisement -
- Advertisement -



