అందరికీ ఉచిత విద్య వైద్యం అందివ్వాలి

అందరికీ ఉచిత విద్య వైద్యం అందివ్వాలి– ప్రజా సంక్షేమాన్ని కోరే ప్రభుత్వాలుంటేనే పెన్షన్‌కు గ్యారంటీ
– తప్రా డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దేశంలో అందరికీ ఉచిత విద్య, వైద్యం అందించేలా పాలకులపై కొట్లాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి నొక్కి చెప్పారు. దేశంలోగానీ, రాష్ట్రంలోగానీ ప్రజా సంక్షేమాన్ని కోరే ప్రభుత్వాలుంటేనే రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్లకు గ్యారంటీ ఉంటుందన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో గల తపాల ఉద్యోగుల కార్యాలయంలో తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌పర్సన్స్‌ అసోసియేషన్‌(తప్రా) డైరీ, క్యాలెండర్‌, ప్యాకెట్‌ క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ.. ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పదేండ్ల కాలంలో కార్పొరేట్లకు రూ.19 లక్షల కోట్ల అప్పులను పాలకులు మాఫీ చేశారని విమర్శించారు. వాటిని గనుక ప్రభుత్వం డిపాజిట్‌ చేస్తే ఈపీఎఫ్‌, రిటైర్డ్‌ బెనిఫిట్స్‌, పెన్షన్లు ఇవ్వడానికి మంచి స్కీమ్‌ను అమలు చేయొచ్చన్నారు. కానీ, మోడీ సర్కారు అలా చేయకుండా ప్రజలకు ఉపయోగపడే స్కీమ్‌లన్నింటినీ నిర్వీర్యం చేస్తూ పోతున్నదని విమర్శించారు. దేశంలో నాలుగు లక్షల మందికి మేలు చేసే ధోరణిని విడనాడి 142 కోట్ల మందికి అభివృద్ధి ఫలాలు అందేలా నిర్ణయాలు తీసుకోవాలని కేంద్రప్రభుత్వాన్ని కోరారు. దేశంలో మతప్రమేయం లేని రాజకీయాలు రావాలని ఆకాంక్షించారు. నేడు విద్యారంగం సంక్షోభంలో ఉందనీ, పాలకులనే ప్రభుత్వవిద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆందోళన వెలిబుచ్చారు. దీంతో చిరుద్యోగులు, కూలినాలి చేసుకునేవాళ్లు తమ పిల్లలకైనా మంచి చదువు చెప్పించాలని ప్రయివేటు స్కూళ్లవైపు చూస్తున్నారన్నారు. చదువు అంతరాలను తగ్గించేందుకు దోహదపడాలిగానీ..నేడు ఎన్నిక లక్షల రూపాయలు పెడితే అంత మంచి చదువు అన్నట్టుగా వ్యవస్థ తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. యూఎస్‌లో నూటికి 91 శాతం మంది ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదువుకుంటున్న తీరును వివరించారు. విద్యారంగంలో అంతరాలను పూడ్చకుంటే దేశంలోని మిగతా అంతరాలను తగ్గించలేమన్నారు. మన దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రభుత్వ స్కూళ్లను పెంచాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. పెన్షనర్లు తమ హక్కుల కోసం అవసరమైనపుడు స్వచ్ఛందంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. తప్రా గౌరవాధ్యక్షులు ఎంఎన్‌ రెడ్డి మాట్లాడుతూ సుప్రీం కోర్టు డియస్‌ నకారా కేసు విషయంలో పెన్షనర్ల సంక్షేమం ప్రభుత్వాల బాధ్యత అని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. పాలకులు పెన్షనర్ల హక్కులను భారంగా కాకుండా బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. తప్రా వ్యవస్థాపక సభ్యులు ప్రభాకర్‌ నాయర్‌ మాట్లాడుతూ.. సర్వీసులోని ఉద్యోగులకు ఇస్తున్న వేతనాలకన్నా, రిటైర్డ్‌ ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్‌ ఎక్కువ అవుతోందని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం కొందరు చేయడం సరిగాదన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉండాలనే విషయంగా ఇప్పటి నుంచే ప్రజలకు అర్థం అయ్యేలా పెన్షనర్లు వివరించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పోతుల నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు మోతుకూరి నరహరి, అరుణ, కోశాధికారి నాగేశ్వర్‌రావు, జనార్ధన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love