ఆరోజు శుక్రవారం. సాయంత్రం కాస్త ఊరట, వారాంతం వచ్చింది అనే సంతోషం కిషోర్ మొహంలో అస్సలు కనిపించట్లేదు. అప్పటివరకు లాప్టాప్‌లో తల పెట్టి పనిలో మునిగిపోయిన కిషోర్ గోడకు తగిలించిన గడియారం వంక చూసాడు. సాయంత్రం ఐదు గంటలు అయినట్టు చూయించింది గడియారం. లాప్టాప్ షట్ డౌన్ చేసి ఆఫీస్‌లో లాగ్ అవుట్ అయిపోయి ఎప్పటిలాగే రూంకి బయలుదేరాడు.
కిషోర్ హైదరాబాద్‌లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కాలేజీ ప్లేస్మెంట్‌లో జాబ్ రాకపోవడంతో చివరికి ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో చేరాడు. నెల ఖర్చులు అన్నీ పోను తన సంతోషాలకు మిగలకుండా మళ్ళీ వచ్చే నెల జీతం కోసం ఎదురుచూసేంత చిన్న ఉద్యోగం అది. కానీ అతను ఎప్పుడూ నామూషి ఫీల్ అవ్వలేదు. మొదట్లో హాస్టల్లో ఉండేవాడు. తెలిసిన స్నేహితుని ద్వారా వేరే రూంకి షిఫ్ట్ అయ్యాడు.
కిషోర్ ఉండే అపార్ట్మెంట్ పక్కనే ఒక బస్తి ఉంటుంది. దాదాపు ఆ అపార్ట్మెంట్ని ఆనుకొనే ఉంటుంది అది. ఇంకా చెప్పాలంటే అక్కడి సగం బస్తీని ఆక్రమించి, అక్కడి జనాన్ని తరిమికొట్టి కట్టిన అపార్ట్మెంట్ అది.
కిషోర్ లోకల్ బస్సులో అతను ఉండే ఏరియాకి చేరుకున్నాడు. సమయం రాత్రి ఏడు గంటలు కావొస్తోంది. అతను బస్సు దిగ్గానే చిన్నగా వర్షం మొదలైంది. వెళ్ళేవాడు అక్కడే ఆగి వర్షం తగ్గాక వెళ్దాం అని బస్టాప్‌లో నించున్నాడు.
—
”రోజు బిర్యానిలు, పిజ్జాలు అంటే నేను ఎక్కడి నుండి తెచ్చేది.. నాకేమైనా వేలకు వేలు జీతం వస్తుందా… అయినా నిన్న మీకు అవి తెచ్చి ఇచ్చాను చూడు నాది బుద్ధి తక్కువ.” చిన్న గుడిసె లాంటి రేకుల ఇంట్లోంచి పెద్దగా కేకలు వేస్తోంది జ్యోతి.
జ్యోతి నిరుపేద అమ్మాయి. రెండేళ్ల క్రితం భర్త తాగి తాగి మద్యానికి బానిస అయి ఆర్నెళ్ళు మంచాన పడి చివరికి ఒకరోజు కన్ను మూసాడు. జ్యోతికి ఇద్దరు పిల్లలు. తన భర్త ఉన్నప్పుడు తనకి సుఖం లేదు, ఇప్పుడు అంతకన్నా లేదు. తన కడుపు మాడ్చుకొని పిల్లల కడుపు నింపిన రోజులు ఎన్నో. చిన్న వయసులో పెళ్లి, పిల్లలు అనే అతి పెద్ద బాధ్యత తనకి ఇప్పుడు భారంగా సాగుతోంది.
జ్యోతి తను ఉండే బస్తీ పక్కనే ఉన్న అపార్ట్మెంట్లో పని చేస్తూ ఉంటుంది. ఆ అపార్ట్మెంట్ లోనే కిశోర్ ఉంటున్నాడు. ఇండ్లల్లో పనులు చేస్తూ, అక్కడ మిగిలిపోయినవి ఏవైనా ఉంటే తెచ్చి పిల్లకిచ్చేది. పిల్లలను అక్కడే దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో వేసింది.
—
వర్షం కాస్త తగ్గడంతో మెల్లిగా తన ఫ్లాట్ వైపుగా అడుగులు వేశాడు కిషోర్. అపార్ట్మెంట్‌కి వెళ్ళాలంటే కిషోర్, జ్యోతి ఇళ్ళు దాటే వెళ్ళాలి.
కిషోర్ నడుస్తూ జ్యోతి ఉండే ఇంటి దగ్గరికి చేరుకోగానే జ్యోతి మాటలు వినిపించసాగాయి. జ్యోతి అంటే కిషోర్‌కి చెప్పలేనంత ఇష్టం. ఆ విషయం అతనికి తప్ప ఇంకెవరికి తెలీదు, అతనూ ఎవరికి చెప్పలేదు. చెప్పడానికి ఇష్ట పడలేదు.
జ్యోతి చాలా అందంగా ఉంటుంది. చామంచాయ రంగులో ఎప్పుడు మెరిసిపోయే మొఖం, నడుము కింది దాక వాలు జడ. పేదింటి మిస్ యూనివర్స్‌లా ఉంటుంది తను.
కిషోర్, జ్యోతిని మొదటిసారిగా చూసింది అక్కడే. ఆ బస్తీ లోనే. ఒకసారి ఎప్పుడో జ్యోతితో అన్నాడు కిషోర్, ”చూస్తుంటే వయసులో చాలా చిన్న పిల్లలా ఉన్నావు, చదుకోవచ్చుగా, ఎందుకు నీకు ఈ పనులు.” అని
దానికి జ్యోతి నవ్వి ”స్కూల్‌కి వెళ్ళే పిల్లలు ఉండగా నేను ఇప్పుడు మళ్ళీ స్కూల్ కి వెళ్తే చూడ్డానికి అంత బాగోదేమో.” అంది.
”పిల్లలా?” కిషోర్ మొహంలో ఆశ్చర్యం.
”ఇద్దరు.” అంది జ్యోతి.
”మీకు పెళ్ళి అయిందా?” నీకు అనే ఏకవచనం నుండి మీకు అనేశాడు కిషోర్ తనకి తెలీకుండానే.
”పెళ్లి కాకుండా పిల్లలు ఎలా పుడతారు, మతుండే మాట్లాడుతున్నారా?” ముఖంలో చిరాకు.
”అయ్యో నా ఉద్దేశం…” అంటూ ఏదో చెప్పబోయి చెప్పకుండానే ‘సారీ’ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కిషోర్.
అప్పటిదాక తనని, తనకు తెలియకుండానే ప్రేమిస్తూ సరైన సిట్యువేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్న కిషోర్‌కి ఒకేసారి పెద్ద బండ రాయి గుండెల మీద పడ్డట్టుగా అనిపించింది.
పెళ్లి అయింది అనేదే ఆశ్చర్యం అంటే పిల్లలు కూడా ఉన్నారని అన్నప్పుడు ఆశ్చర్యంతో పాటు తన మీద తనకే చిరాకు వేసింది. ‘మంచిదే ఇంకా విషయం చెప్పలేదు.’ అని తనలో తానే అనుకొని ఆ ప్రేమని మద్యలోనే వదిలేయడానికి సిద్ధపడ్డాడు.’ కానీ వదిలేసుకోడానికి అదేమైనా వ్యామోహమా? ప్రేమ. అలా ఎలా వదిలేస్తారు ఎవరైనా? అంత తేలిక’ తనకు తానే మళ్ళీ ప్రశ్నించుకున్నాడు. బుర్ర లోంచి జ్యోతిని మర్చిపోడానికి ప్రయత్నించాడు కానీ మనసులోంచి ఆ పేరుని, ఆ అమ్మాయిని తీయలేకపోయాడు.
—
తెలీకుండానే ఏదో ఆలోచిస్తూ తన ఫ్లాట్‌కి చేరుకున్నాడు కిషోర్.
మరుసటి రోజు జ్యోతి ఎప్పటిలాగే అపార్ట్‌మెంట్లో పని చేయడానికి వచ్చింది.
”కిషోర్ బాబు.. కిషోర్ బాబు…” గట్టిగా అరుస్తూ తలుపు తట్టింది జ్యోతి.
హఠాత్తుగా నిద్రలేచి పరుగున వెళ్ళి తలుపు తీసాడు కిషోర్.
”ఏంటి బాబు, పది గంటలు కావొస్తోంది ఇంకా పడుకునే ఉన్నారు. ఇవ్వాళ ఆఫీస్‌కి వెళ్ళడం లేదా..” లోపలికి వస్తూ అంది జ్యోతి.
”ఇవ్వాళ శనివారం.” చెప్పాడు కిషోర్.
”అయ్యో, అవునుకదూ.” సరిదిద్దుకుంది జ్యోతి.
”అవును రాకేష్ ఎక్కడీ కనిపించట్లేదు.” బకెట్‌లో నీళ్ళు పోసుకొని వచ్చి ఇల్లు తుడుస్తూ అడిగింది.
”నిన్న రాత్రి వాళ్ళ ఊరికి వెళ్ళాడు ఏదో పనుందని!” బదులిచ్చాడు కిషోర్.
”అవునా..!” అంటూ తన పని తాను చేసుకుపోతుంది జ్యోతి.
మనసులో జ్యోతికి ఎప్పుడో గుడి కట్టేసుకున్నాడు కిషోర్. దాదాపు సంవత్సరం నుంచి తనని ప్రేమిస్తున్నాడు కానీ ఎప్పుడూ తన ప్రేమ విషయం జ్యోతికి చెప్పలేదు. రోజు తనని చూస్తూ ఉండేవాడు అంతే. ప్రేమ ఇంకా పెరిగిపోయింది. ఎలాగైనా ఈరోజు తన ప్రేమ విషయం జ్యోతికి చెప్పాలి అని నిశ్చయించుకున్నాడు. ‘కానీ, ఎలా?’ అనే ప్రశ్న అడ్డొస్తోంది. చెప్పనివ్వకుండా అడ్డు పడుతుంది. ధైర్యం తెచ్చుకుని చెప్పడం మొదలెట్టాడు.
”జ్యోతి..” సన్నటి గొంతుతో పిలిచాడు కిషోర్.
”ఏంటి బాబు?” పని చేసుకుంటూనే అంది జ్యోతి.
”నీకు… నీకు.. ఒక విషయం చెప్పాలి..” తడబడ్డాడు.
”ఏంటి బాబు?” అడిగింది జ్యోతి, కిషోర్ వైపు చూస్తూ.
”నాకు నువ్వంటే ఇష్టం జ్యోతి. చాలా రోజులనుండి నిన్ను ప్రేమిస్తున్నాను. నీ మనసు, మంచితనం, అమాయకత్వం, నీ రూపం నన్ను నీకు దాసోహం చేసుకున్నాయి.”
”నేను నిన్ను ప్రేమిస్తున్నాను జ్యోతి, నిన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. మనం పెళ్లి చేసుకుందామా?” ధైర్యం తెచ్చుకొని తన ప్రేమ విషయం చెప్పాడు కిశోర్.
కిషోర్ మాటలు విన్న జ్యోతి క్షణం పాటు మనిషి కాలేకపోయింది. కాసేపటి వరకు అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్ధం కాలేదు.
”ఏంటి మీరనేది..?” ఆశ్చర్యపోతూ అడిగింది.
”అవును జ్యోతి, నువ్వంటే నాకు చాలా ఇష్టం నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను!”
”కానీ బాబు మీరెక్కడ. నేనెక్కడ! అయినా నాకు పెళ్ళి అయ్యి మొగుడు చచ్చి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయం మీక్కూడా తెలుసు, ఆట పట్టించట్లేదు కదా నన్ను?” జ్యోతి కాస్త భయపడింది.
”పిల్లల్ని కూడా నేను బాగా చూసుకుంటాను.. మంచి కాన్వెంట్‌లో చేర్పించి చదివిద్దాం!” కిశోర్ మద్యలో కలుగచేసుకున్నాడు.
”మన ఇద్దరం ఇలా మాట్లాడుకుంది ఎవరైనా వింటే పది మంది పది రకాలుగా అనుకుంటారు! ఇంక ఈ విషయం ఇక్కడే మర్చిపోండి.” తేల్చేసింది జ్యోతి.
”నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను జ్యోతి. ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం! నాకు నువ్వు. నువ్వే ముఖ్యం. కేవలం నీ అభిప్రాయం చెప్పు చాలు!” అన్నాడు కిషోర్.
”నాకు ఏం చెప్పాలో అర్ధం కావడం లేదు.” టెన్షన్ పడుతూ అంది జ్యోతి. ఒళ్ళంతా చెమటతో తడిచిపోయింది.
”సమాజం గురించి వదిలెరు జ్యోతి, ఇంకా మా అమ్మాన్నాన్న అంటావా వాళ్ళని నేను ఒప్పిస్తాను! నువ్వు ఒప్పుకుంటే చాలు!”
చాలా సేపటి దీర్ఘాలోచన తరువాత జ్యోతి ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఆమె ముఖ కవళికలు చెప్పకుండానే చెప్పాయి.
”నాకు చిన్నతనంలో ఆ తాగుబోతు ఎదవకి ఇచ్చి పెళ్ళి చేసారు. పెళ్లి అయెప్పుడు నాకు పదహారేళ్లు. కట్నం ఇచ్చే స్థోమత లేక నన్ను ఆ ఎదవకి ఇచ్చి కట్టబెట్టాడు మా నాన్న.”
”ఇన్నిరోజులు నువ్వు అందంగా ఉంటావు అంటూ వెంటపడేవాళ్ళనే చూసాను కానీ మొదటిసారిగా నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటావా అని అడిగేవాళ్ళని ఇప్పుడే చూస్తున్నా!” కన్నీళ్ళు చెంపలమీదుగా కిందకి జారాయి.
”నాకు తెలుసు జ్యోతి నువ్వు ఎంత బాధపడుతున్నావో. అయినా పెళ్లి అంటే రెండు మనసులు కలవాలి. అంతస్తు, చదువు, కులం ఇంకేవో కాదు.”
”నాకు నువ్వంటే చాలా ఇష్టం, ఎంతగానో ట్రై చేశాను.. నిన్ను మర్చిపోడానికి. కానీ నావల్ల అస్సలు కాలేదు.”
చీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ కిషోర్ వైపు తలెత్తి చూసింది జ్యోతి. చనువు తీసుకొని దగ్గరికి వచ్చి జ్యోతిని తన చేతులతో ఇంకాస్త దగ్గరకి చేర్చుకోబోయాడు కిషోర్.
”నేనింకా నా అభిప్రాయం చెప్పలేదు.” అంది జ్యోతి కిషోర్ తన దగ్గరికి రావడం చూసి.
”అప్పుడప్పుడు కళ్ళు కూడా మనతో మాట్లాడతాయి జ్యోతి. నువ్వు చెప్పకపోతేనేం? నీ కళ్ళు స్పష్టంగా చెప్తుంటే.” ఆమె కళ్ళని తీక్షణంగా చూస్తూ అన్నాడు కిషోర్.
ఆ క్షణం ఆమె ముఖం జ్యోతిర్మయంగా వెలిగిపోయింది. నవ్వి, కిషోర్నీ కౌగిలించుకుని అతని ఒడిలో ఒదిగిపోయింది.
రాజు యెదుగిరి, 9963485370



