సమస్యల నెలవుగా అలహాబాద్ వర్సిటీ
దేశంలో ఉద్యోగావకాశాల కొరత
పడిపోతున్న విద్యార్హతల ప్రమాణాలు
ప్రయాగ్‌రాజ్ ‘ఛాత్రౌం కీ గూంజ్’ సభలో రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ : భారత్‌కు అత్యంత గొప్పశక్తి ఈ దేశంలోని యువతే అని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. వారి శక్తి సామర్ధ్యాలు ప్రపంచంలోని మరే దేశ యువతకు సాటిరావని అన్నారు. అటువంటి యువతకు ఉద్యోగావకాశాల కొరత నేపథ్యంలో నేడు విద్యార్హతల విలువపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ప్రయాగ్‌రాజ్‌లో ‘ఛాత్రౌం కీ గూంజ్’ (విద్యార్థుల గళం) కార్యక్రమంలో రాహుల్ ప్రసంగించారు. అలహాబాద్ వర్సిటీ సమస్యల నెలవుగా మారిందని ఆయన చెప్పారు. ఈ వేదిక వద్ద పరిస్థితులు సరిగా లేనప్పటికీ పెద్ద సంఖ్యలో విద్యార్ధులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్ధులు హాజరయ్యారు. ‘‘మీరే భారత్‌కు శక్తి, గర్వకారణం’’ అని వారినుద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ దేశంలోని ప్రతి ఒక్క భారతీయ పౌరుడి గురించి తాను మాట్లాడుతున్నానని అన్నారు. ‘‘దర్ద్ (నొప్పి, బాధ), డేటా, దౌలత్ (సంపద) గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నా’’ అని అన్నారు. దేశంలో ప్రస్తుతం 40 కోట్ల మంది యువత ఉన్నారని, భారతదేశంలోని యువత మరెవరికీ సాటి రారని తరచుగా అమెరికా, చైనా, రష్యాలు మాట్లాడుతునే ఉంటాయని చెప్పారు. దేశంలో విద్యార్హతల ప్రమాణాలు పడిపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. నేడు భారత్‌లో విద్యా సర్టిఫికెట్లకు ఎలాంటి విలువా లేదని, ఆ కాగితాలతో వారికెలాంటి ఉద్యోగమూ రావడం లేదని అన్నారు.
తయారీ రంగం క్షీణిస్తోందని, రుణాల రావడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పరీక్షా పత్రాలు లీకవుతున్నాయని, కృత్రిమ మేథతో ఉద్యోగాలు పోతున్నాయని ఇవన్నీ కలిసి యువత అవకాశాలను దెబ్బ తీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే విద్వేషం, హింసలకు పాల్పడరాదని ఆయన వారికి సూచించారు. ప్రేమాభిమానాలతో వ్యవస్థను మార్చడానికి ప్రయత్నించాలని సూచించారు. ప్రతి వెయ్యి మందిలో 12 మందికే పర్మినెంట్ ఉద్యోగం వస్తోందన్నారు. 21వ శతాబ్దంలో దేశ పురోగతి యువతకున్న శక్తి సామర్ధ్యాలు, వారు సృష్టించే డేటా అనే రెండు అంశాలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అలహాబాద్ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను రాహుల్ వివరించారు. వర్శిటీలో ఫీజులను గతంలో కంటే 400 శాతం అధికంగా పెంచారని, హాస్టల్ ఫీజులు కూడా భారీ పెంచేశారని తెలిపారు. గ్రంథాలయం 8 గంటలే తెరిచివుంచుతున్నారని, వర్షాల సమయంలో నీళ్లతో నిండిపోతోందని తెలిపారు. గ్రంథాలయాన్ని 24 గంటలూ తెరిచివుంచాలని కోరితే..‘‘ఏం? ఎక్కువ చదివేసి..కలెక్టరు అయిపోదామనే’’ అంటూ అక్కడి సిబ్బంది విద్యార్థులను ఎగతాళి చేసి మాట్లాడుతున్నారని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్సిటీలో నీళ్లు మంచిగా లేవని విద్యార్థులు ఫిర్యాదు చేస్తే.. వర్సిటీ అనేది మంచి నీళ్ల కేంద్రం కాదంటూ అధికారులు బదులిస్తున్నారని ఆయన వాపోయారు. ‘‘అందుకనే ఇక్కడ మీ స్వరాన్ని వినేందుకు, వాటిపై అధికారులను నిలదీసేందుకు వచ్చాను. వాళ్లు మన మీద కేసులు పెడితే పెట్టుకోనీ.. భయపడేది లేదు’’ అని విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ అన్నారు.



