ట్రంప్ ముందు మోకరిల్లుతున్న ఇండియా
పొరుగు దేశాలతో పెరుగుతున్న శత్రుత్వం
అమెరికా- ఇరాన్ యుద్ధం…ఇండియాపై ప్రభావం సదస్సులో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అంతర్జాతీయ దౌత్య సంబంధాల్లో కేంద్రంలోని మోడీ సర్కార్ పూర్తిగా విఫమైందని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ సర్కార్ అనుసరిస్తున్న దౌత్య విధానాల వల్ల బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, మాల్దీవులు తదితర పొరుగు దేశాలు సైతం భారత్‌కు దూరమయ్యాయని అన్నారు. ‘యూఎస్‌ఏ వార్ ఎగెనెస్ట్ ఇరాన్-ఇంపాక్ట్ ఆన్ ఇండియా’ అనే ఆంశంపై ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్చరల్ కో ఆపరేషన్ అండ్ ఫ్రెండ్‌షిప్(ఇస్‌కఫ్) ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని అమృత ఎస్టేట్‌లో పార్లమెంట్ మాజీ సభ్యులు అజీజ్ పాషా అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ఇంధన, ఆర్థిక, వ్యూహాత్మకంగా తీవ్రమైన ప్రభావం భారత్‌పై పడుతోందన్నారు. గాజాపై ఇజ్రాయిల్ మారణ హోమం, అమెరికాతో కలిసి ఇరాన్‌పై సాగిస్తున్న యుద్ధం, వెనిజులా అధ్యక్షులు చావోజ్ అపహరణ లాంటి చర్యలను ఇండియా ఖండించకపోవడం వల్ల ప్రపంచ దేశాల్లో ఒంటరిగా మారుతోందన్నారు. అంతర్జాతీయంగా అనుసరిస్తున్న ముస్లీం వ్యతిరేక విధానం యొక్క పర్యవసానాలు భవిష్యత్‌లో భారత్‌పై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించారు.
ఈ క్రమంలోనే పాకిస్తాన్ టర్కీ, సౌది అరేబియాతో కలిసి మినీ నాటోలాంటి కూటమిని ఏర్పాటు చేసిందన్నారు. అమెరికా యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధి మూసివేయడంతో చమురు ధరలు పెరిగి, దిగుమతి భారం పెరిగిందన్నారు. అలాగే గల్ఫ్ దేశాల నుంచి వలస కార్మికుల రాక, దౌత్యపరమైన సవాళ్లు భారత్ ఎదుర్కొంటోందని గుర్తు చేశారు. చమురు దిగుమతిలో ఏర్పడిన ప్రతిష్టంభన వల్ల రవాణా ఖర్చులు పెరిగాయన్నారు. ఫలితంగా దేశంలో నిత్యావసరాల ధరలు పెరిగే ప్రమాదం ఏర్పడిందని గుర్తు చేశారు. అమెరికా-ఇరాన్ యుద్ధం విషయంలో ఏ ఒక్క పక్షం వైపు మొగ్గు చూపకుండా వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని పాటిస్తూ అన్ని దేశాలతో దౌత్య సంబంధాలను సమతుల్యం చేసుకునే ప్రయత్నం చేస్తున్నామనే ప్రధాని మోడీ ప్రచారం పచ్చి అబద్ధమని విమర్శించారు. సీపీఐ రాష్ర్ట కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ నెహ్రూ హయాంలోని నాన్ ఎలైన్ విధానానికి మోడీ సర్కార్ తూట్లు పొడిచిందన్నారు. ఇండియాపై ట్రంప్ టారిఫ్‌ల వార్ ప్రకటిస్తూ మన ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నా… జై ట్రంప్, జైజై ట్రంప్…అంటూ మోడీ కాళ్ల బేరానికి వెళుతున్నారని విమర్శించారు. గాల్వాన్ ఉగ్రదాడితో పాటు అనేక అమానుష సంఘటనలను అమెరికా ఎనాడు ఖండించలేదని గుర్తు చేశారు.
మొదటి నుంచి అమెరికా భారత్ వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నదని విమర్శించారు. అభివృద్ధి, సాంకేతికత వైపు ప్రపంచం వేగంగా దూసుకు పోతుంటే ఇండియా మాత్రం కులం, మతం, హిందూ జాతీయత అంటూ తిరోగమనం వైపు పయనిస్తోందని ఎద్దేవా చేశారు. మంగోలియా మాజీ రాయబారి టి.సురేశ్ మాట్లాడుతూ అమెరికా ప్రపంచ పోలీస్‌గా వ్యవహరిస్తూ గుత్తాధిపత్యం సాధించేందుకు యుద్ధాలను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. రాబోయే రోజుల్లో ఏఐ, సైబర్ వార్, డ్రోన్ వార్ లాంటి యుద్ధాలు జరిగే ప్రమాదమున్న నేపథ్యంలో ఇండియా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్చరల్ కో ఆపరేషన్ అండ్ ఫ్రెండ్‌షిప్ జాతీయ కార్యదర్శి బిజయ్ కుమార్ పదిహరి, రాష్ర్ట అధ్యక్ష, కార్యదర్శులు కడారు ప్రభాకర్ రావు, జి. గోపాల్ తదితరులు పాల్గొన్నారు.



