మంత్రి దనసరి అనసూయ సీతక్క పిలుపు
అశ్వారావుపేటలో ఘనంగా
కొమురం భీమ్ విగ్రహావిష్కరణ
నవతెలంగాణ–అశ్వారావుపేట
కొమురం భీం ఆశయాలతో ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవాన్ని కాపాడుకుందామని మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్మించిన కొమురం భీం విగ్రహాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ ఆవిష్కరించారు. జిల్లాకు విచ్చేసిన మంత్రికి ఆదివాసీ సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి సీతక్క, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్ తదితరులు ఆదివాసీ ప్రజలతో కలిసి భారీ ర్యాలీగా ప్రధాన కూడలికి చేరుకున్నారు. అక్కడ కొమురం భీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కొమురం భీం హక్కులు, ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సమానత్వం కోసం చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. సమ్మక్క–సారలమ్మ, అల్లూరి సీతారామరాజు, కొమురం భీం వంటి మహనీయుల పోరాటాలు ఆదివాసీ సమాజానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అడవిపై హక్కులు, భూమిపై హక్కులు, విద్య, ఉపాధి, గృహాలు వంటి ప్రాథమిక అవసరాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోం దన్నారు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలను అధికారులు గౌరవంగా చూడాలని, వారి సమస్యలను ఓపికగా విని పరిష్కరించాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు సుమారు రూ.1,200 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించినట్టు వెల్లడించారు. స్కిల్ డెవలప్మెం ట్, గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాల శాఖల ద్వారా మరిన్ని అభివృద్ధి పనులకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. కొమరం భీమ్ ఇచ్చిన ‘జల్–జంగల్–జమీన్’ నినాదాన్ని మంత్రి గుర్తు చేశారు. ఆదివాసీ యువతకు ప్రభుత్వం కల్పిస్తున్న విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివాసీల భాష, సంస్కృతి, సంప్రదాయ ాలు, జీవన విధానమే వారి అస్థిత్వమని, ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా తమ మూలాలను, మాతృభాషను మరచిపోవద్దని సూచించారు.
విద్యాభివృద్ధికి నిరంతరం కృషి
ఆదివాసీ సమాజంలో ఐక్యత, చైతన్యం, విద్యాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొమరం భీమ్ పేరుతో ఏర్పాటు చేయనున్న అర్బన్ పార్కును అభివృద్ధి చేసి, అందులో గిరిజన మ్యూజియం, గిరిజన విద్యా వికాస భవనం ఏర్పాటు చేసేందుకు సహకరించాలని మంత్రి సీతక్కను కోరారు. జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ.. ఆదివాసీల భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు విద్య, వైద్యం, మౌలిక వసతులు, ఉపాధి రంగాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ విద్యా చందన, జెడ్పీ సీఈవో నాగలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఆత్మ (బీఎఫ్ఏసీ) చైర్మన్ సుంకవల్లి వీరభద్ర రావు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ జూపల్లి రమేష్ బాబు, కాంగ్రెస్ జిల్లా నాయకులు తుమ్మ రాంబాబు, మండల నాయకులు చిన్నం శెట్టి సత్యనారాయణ, ఆదివాసీ జేఏసీ నాయకులు, వివిధ గిరిజన సంఘాల ప్రతినిధులు, ఆదివాసీ ప్రజలు పాల్గొన్నారు.
ఆదివాసీల హక్కులు కాపాడుకుందాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



