మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
‘న్యూస’ ఆధ్వర్యంలో
దళిత విద్యార్థులకు ప్రతిభా అవార్డుల ప్రదానం
నవతెలంగాణ-సిద్దిపేట, చిన్నకోడూరు
చిన్నకోడూరు మండలం మేడిపల్లిలో ఓ రైతు ఆయిల్ పామ్ తోటను పరిశీలన డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ లాంటి మహనీయులు కల్పించిన రిజర్వేషన్ల వల్లే మనమంతా చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉన్నామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. నవజీవన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన ప్రతిభ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరై.. పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన దళిత విద్యార్థులకు అవార్డులు అందజేశారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఆ రిజర్వేషన్ల ఫలాలతో గౌరవంగా బతుకుతున్న మనం, తిరిగి సమాజానికి ఏదో ఒకటి చేయాలనే బాధ్యతను పదేండ్ల కింద గుర్తించి సిద్దిపేటలో మాదిగ సామాజిక వర్గం ఉద్యోగులంతా కలిసి ‘న్యూస’ సొసైటీని స్థాపించడం అభినందనీయమన్నారు. ఉద్యోగులు తమ వేతనం నుంచి ప్రతినెలా వెయ్యి రూపాయలు పక్కనపెట్టి రూ.10 లక్షల నిధిని ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. ఫీజులు కట్టలేని పేద విద్యార్థులకు అండగా నిలబడుతూ, ప్రతీయేడు స్కాలర్‌షిప్ ఇవ్వడం రాష్ట్రానికే ఆదర్శమన్నారు.
ఐదేండ్ల కింద ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్న హౌసింగ్ బోర్డుకు చెందిన రోహిత్ అనే అబ్బాయికి తాను సాయం చేశానని.. ఇప్పుడు ఆ అబ్బాయికి ఏడాదికి రూ.6 లక్షల జీతం వస్తోందన్నారు. తన తొలి ఏడాది సంపాదించిన రూ.6 లక్షలను తిరిగి పేద విద్యార్థుల కోసం ఖర్చు చేయమని నాకే ఇచ్చాడనీ.. ఆ అబ్బాయి ఆలోచనా విధానం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. శ్రీజ అనే దళిత విద్యార్థినికి ఎంబీబీఎస్ సీటు వస్తే ఫీజు తాను చెల్లించానన్నారు. న్యూస్ సొసైటీకి ఈ యేడు కూడా రూ. లక్ష ఆర్థికసాయం అందజేస్తున్నట్టు తెలిపారు. కేసీఆర్ హయాంలో దళిత విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు, ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ తెచ్చామనీ, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్, దళిత బంధు లాంటి అద్భుతమైన కార్యక్రమాలు చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌కు బడ్జెట్‌లో రూ.5,403 కోట్లు కేటాయించి.. 74 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందన్నారు. అవి కూడా జీతాలు, కరెంట్ బిల్లులకే సరిపోయాయన్నారు.
దళితబంధు కింద రూ.12 లక్షలు ఇస్తామని చెప్పి, బడ్జెట్‌లో రూ.2000 కోట్లు పెట్టి.. ఏ ఒక్కరికైనా ఒక్క రూపాయి సహాయం చేశారా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం 2024-25లో 33వేల కోట్లు ఎస్సీ నిధి కింద చూపి కేవలం 14 వేల కోట్లే ఖర్చు చేసిందనీ, అందులో పెన్షన్లు అన్నీ కలిపి ఖర్చుగా చూపిస్తున్నారన్నారు. మాదిగ, మాల, ఏకలవ్య, సేవాలాల్, కొమురం భీమ్, బీసీ కార్పొరేషన్లు అని పేర్లు పెట్టి కాగితాలకే పరిమితం చేశారు తప్పా.. ఆ కార్పొరేషన్లకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. విద్యార్థులు బాగా చదవాలనీ, చదువుకు పేదరికం, కులం అడ్డుకాదనీ, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని, నాలుగైదేండ్లు క్రమశిక్షణతో కష్టపడితే భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యూస్ అధ్యక్షులు మొలుగు బాలరాజు, ప్రధాన కార్యదర్శి కర్రే స్వామి, ట్రెజరర్ ఏటి నవీన్, సభ్యులు ఎస్ కనకయ్య, పి రాజయ్య, పి మల్లేశం, పి బాలకిషన్, లింగం, గంగాధర్, బెజ్గం శివయ్య, తదితరులు పాల్గొన్నారు.
కాళేశ్వరం జలాలతో తేమ పెరిగింది..
ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమైంది
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మేడిపల్లి గ్రామంలో రైతు ముక్కిస పాపిరెడ్డికి చెందిన ఆయిల్ పామ్ తోటను హరీశ్‌రావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బడిద సదానందం అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం జలాల వల్ల మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, చెక్ డ్యామ్‌లు నిండి గాలిలో తేమ పెరగడమే సిద్దిపేటలో ఆయిల్ పామ్ సాగుకు ప్రాణాధారంగా మారిందన్నారు.
వరి పంటతో పోలిస్తే ఆయిల్ పామ్ ద్వారా రైతులు నెలకు రూ.50 వేల నుంచి లక్ష వరకు నికర ఆదాయం పొందుతున్నారన్నారు. 10 ఎకరాల్లో పాపిరెడ్డికి ఆరు నెలల్లోనే రూ.26 లక్షల ఆదాయం వచ్చిందని, నియోజకవర్గంలో ప్రస్తుతం 5,322 ఎకరాల్లో సాగు జరుగుతుండగా, భవిష్యత్తులో 50 వేల ఎకరాలకు విస్తరించడమే లక్ష్యమని తెలిపారు. సిద్దిపేటలోనే ప్రభుత్వ రంగంలో తొలి ఆయిల్ పామ్ రిఫైనరీ మరో 3-4 నెలల్లో ప్రారంభం కానుందని, ఇక్కడి నుంచే నేరుగా వంటనూనె ప్యాకెట్లు మార్కెట్‌కు సరఫరా అవుతాయన్నారు. ఆయిల్ పామ్ తోటల వల్ల ప్రాంతీయ ఉష్ణోగ్రత 2 డిగ్రీలు తగ్గుతుందని, కోతుల బెడద, వడగళ్ల వానల ముప్పు లేని సురక్షితమైన పంటని తెలిపారు. దేశం ఏటా రూ. లక్ష కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని నూనెల దిగుమతిపై ఖర్చు చేస్తోందని, ఆ బడ్జెట్‌ను ఆదా చేయడంలో సిద్దిపేట రైతులు భాగస్వాములు కావడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ముక్కిస సత్యనారాయణ రెడ్డి, వేలేటి రాధాకృష్ణ శర్మ, మండల స్థాయి నాయకులు ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.


