భారీగా పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు
పౌష్టికాహారలోపంలో పేద ప్రజలు గతంలో సబ్సిడీపై 9 రకాలు
కేరళంలో రేషన్‌షాపుల ద్వారా 14 రకాల వస్తువులు
గుడిగ రఘు
రాష్ర్టంలో అర్హులైన పేదలందరికీ 1.05 కోట్ల లామినేటెడ్ తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ కార్డుల మీద సన్న బియ్యం తప్ప ఇంకేం నిత్యవసరవస్తువులు ఇవ్వట్లేదు. కొన్ని రకాల సంక్షేమ పథకాలకు తెల్ల రేషన్‌కార్డును ప్రామాణికంగా పరిగణిస్తున్నారు. కానీ రాష్ర్టంలో పేదలకు బియ్యం ఉచితంగా ఇచ్చి, ఉప్పు, పప్పు, నూనెలు సహా అన్నింటి ధరలు ఆకాశానికి పెంచేసి, కష్టంచేసి సంపాదించుకున్న కొద్దిపాటి సొమ్మును ‘లూటీ’ చేసేస్తున్నారు. పేదలు ‘పొదుపు’ అనే మాటనే మర్చిపోయేలా జీవన స్థితిగతులు మారిపోయాయి. ప్రజలకు కావల్సింది ఇప్పటికే ఉన్న తెల్ల రేషన్‌కార్డుల స్థానంలో లామినేషన్ కార్డులు కాదు… అదే తెల్లకార్డుపై అదనంగా సబ్సిడీపై మిగతా నిత్యవసరవస్తువులు ఇవ్వడం అవసరం. ఇదే విషయాన్ని సీపీఐ(ఎం) రాష్ర్ట కార్యదర్శి జాన్‌వెస్లీ చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. మిగిలిన వామపక్షపార్టీలు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి. రాష్ర్ట ప్రభుత్వం లామినేట్ చేసి ఇస్తామని చెప్తున్న 1.05 కోట్ల తెల్ల రేషన్‌కార్డుల్లో 3.24 కోట్ల మంది కుటుంబసభ్యులు ఉన్నారు. కుటుంబసభ్యులు అందరూ కష్టపడితే నెలరోజులు గడవడం కష్టంగా మారింది. బహిరంగమార్కెట్లో అన్నింటి ధరలు తీవ్రంగా పెరగడమే దీనికి కారణం. ధరలు పెంచడానికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా, ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధాన్ని కంపెనీలు కారణాలుగా చూపుతున్నాయి. అదే సమయంలో పేదల నెలవారీ వేతనాలు, రోజువారీ కూలీల రేట్లు మాత్రం పెరగట్లేదు. ఫలితంగా జీవన వ్యయం పెరిగి, కుటుంబాల నిర్వహణ భారంగా మారుతున్నది. కుటుంబాల్లో పౌష్టికాహార లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. పిల్లల్లో ఎదుగుదల నిలిచిపోతున్నది. స్ర్తీ, పురుషుల్లో రక్తహీనత సహా అనేక రకాల ఆరోగ్యసమస్యలు చుట్టు ముడుతున్నాయి. ఈ విషయాలను జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-2026 నిర్థారిస్తున్నది.
గతంలో…
ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా ఒక్క రూపాయికి కిలోబియ్యం ఇస్తూ, దానితోపాటు ప్రతి రేషన్‌కార్డుదారుడికి ‘అమ్మహస్తం’ పేరుతో కిలో కందిపప్పు, కిలో గోధుమపిండి, కిలో గోధుమలు, లీటర్ పామాయిల్, కిలో అయోడైజ్డ్ సాల్ట్, అరకిలో చక్కెర, అరకిలో చింతపండు, పావుకిలో కారం, వందగ్రాముల పసుపుతో కలిపి 9 రకాల నిత్యవసరవస్తువులను ఒకే సంచిలో పెట్టి ఇచ్చేవారు. కిరోసిన్ కూడా రేషన్‌షాపుల ద్వారానే ఇచ్చేవారు. ఆ తర్వాత రాష్ర్ట విభజన జరగడం, అప్పటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వీటన్నింటినీ అటకెక్కించేశారు. రేషన్‌కార్డు అంటే కేవలం దొడ్డు బియ్యం ఇవ్వడానికే పరిమితం చేశారు. 2023లో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదే కార్డుపై దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం ఇస్తున్నారు. అంతకుమించి చౌకధరల దుకాణాల ద్వారా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.
పోషకాహార లోపం
రాష్ర్టంలోని ప్రజల్లో పోషకాహారలోపం ఆందోళన కలిగిస్తున్నది. ముఖ్యంగా చిన్నారులు, స్ర్తీ, పురుషుల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–6 (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్–6) తెలిపింది. పిల్లల్లో 16,9 శాతం మంది ఎత్తుకు తగ్గ బరువు లేకుండా ఉన్నారు. 27.8 శాతం మంది వయసుకు తగ్గ బరువు లేరు. మరో 27 శాతం మంది వయసుకు తగ్గ ఎత్తు లేరు. అంటే ప్రతి 100 మంది చిన్నారుల్లో సుమారు 27 మంది ఎదుగుదల లోపంతో, 28 మంది తక్కువ బరువుతో, 17 మంది తీవ్రమైన పోషకాహార లోపంతో ఉంటున్నారు. అలాగే మహిళలు, పురుషుల్లో 15–49 ఏళ్ల వయసులో శరీర ద్రవ్యరాశి సూచీ (బీఎంఐ) 18.5 కంటే తక్కువగా ఉంది. వారిలో మహిళలు – 17.7 శాతం, పురుషులు – 14.9 శాతం ఉన్నారు. ఇక రక్తహీనతలో ఐదేండ్ల పిల్లలు – 70 శాతం, 15–49 ఏండ్ల మధ్య మహిళలు – 57.6 శాతం, పురుషులు – 15.3 శాతం, గర్భిణులు – 53.2 శాతం మంది ఉన్నారని ఎన్‌ఎఫ్‌మెచ్‌ఎస్ సర్వే స్పష్టం చేసింది.
పోషకాహార లోపంతో వచ్చే ప్రధాన సమస్యలు
పోషకాహార లోపం వల్ల రక్తహీనత ఏర్పడి రోగనిరోధక శక్తి తగ్గుతుంది. తరచూ ఇన్ఫెక్షన్లు, పిల్లల్లో శారీరక–మానసిక ఎదుగుదల మందగిస్తుంది. తక్కువ బరువుతో పిల్లలు పుడతారు. దీర్ఘకాలంలో మధుమేహం, అధిక రక్తపోటు వంటి జీవనశైలి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.
పెరిగిన నిత్యావసరాలు
బహిరంగమార్కెట్లో లీటరు పామాయిల్ ప్యాకెట్ రూ.120 నుంచి రూ.135 వరకు ఉంది. రిఫైండ్ ఆయిల్ రూ.165 నుంచి 185 వరకు ఉంది. కిలో ఉప్పు రూ.24 కి పెరిగింది. కందిపప్పు కిలో రూ.130 నుంచి రూ.150 వరకు పెరిగింది. ఏ నిత్యవసరవస్తువు కొనాలన్నా కిలో ధర వంద రూపాయలుకంటే ఎక్కువగానే ఉన్నాయి. సబ్సులు, పేస్టులు, హార్లిక్స్, బూస్ట్ సహా అన్నింటి రేట్లు
ఆకాశాన్నే తాకుతున్నాయి. ధరలు పెరగడంతో కంపెనీలు క్వాంటిటీని (పరిమాణం) తగ్గించి, చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నాయి. కానీ ధరలు మాత్రం తగ్గట్లేదు. హోల్‌సేల్ రేట్లు, భారీ డిస్కౌంట్లు అని చెప్పబడే డీమార్ట్ వంటి స్టోర్లలో చిన్న కుటుంబం నిత్యవసర వస్తువులు కొనేందుకు వెళ్తే కనీసం రూ.4 వేల నుంచి రూ.6వేల వరకు అవుతుంది. బియ్యం ఒక్కటే రేషన్‌షాపుల్లో ఇస్తే, మరి ఈ ఆర్థికభారాల్ని సామాన్యులు ఎలా మోయాలనేదే ప్రధాన ప్రశ్న.
కేరళంలో…
కేరళం రాష్ర్టంలో అప్పటి కమ్యూనిస్టు ప్రభుత్వం రేషన్‌షాపుల ద్వారా పేదలకోసం 14 రకాల వస్తువులను సరఫరా చేసి దేశానికి ఆదర్శంగా నిలిచింది. మరికొన్ని నిత్యవసరాలను సబ్సిడీపై అదే రేషన్‌షాపుల్లో ప్రజలకు అందుబాటులో పెట్టింది. ఇప్పుడు అక్కడ వామపక్షపార్టీల ప్రభుత్వం అధికారం కోల్పోయినా, అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని కొనసాగించక తప్పనిసరి అయ్యింది. తెలంగాణ లో కూడా అదే తరహాలో రేషన్‌షాపుల ద్వారా 14 రకాల వస్తువులు ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ర్ట కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేస్తున్నారు.
బియ్యం మినహా అన్నీ మాయం
రేషన్ దుకాణాల్లో చక్కెర ఇవ్వడం క్రమంగా తగ్గిపోయింది. గోధుమల సరఫరా చేస్తున్నప్పటికీ అరకొరగానే ఇస్తున్నారు. రాష్ట్రంలో గ్యాస్ కనెక్షన్లు పెరగడంతో కిరోసిన్ సరఫరా పూర్తిగా ఆగిపోయింది. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజలకు ఇచ్చే సబ్సిడీలను కుదించేసింది. దీనితో రాష్ట్ర ప్రభుత్వం చేతులేత్తేసింది. ఫలితంగా రేషన్ షాపుల ద్వారా కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారు.
పేదలపై భారం
రాష్ట్రంలో ఆహార భద్రత కార్డు కింద ప్రతి వ్యక్తికి నెలకు ఆరుకిలోల చొప్పున సన్న బియ్యాన్ని సరఫరా చేస్తున్నది. అంత్యోదయ కార్డు ఉన్న వారికి 35 కేజీలు ఇస్తున్నది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 7,366 కోట్లు కేటాయించింది. అందులో సబ్సిడీ రూ. 1,879 కోట్లు ఇస్తున్నది. కానీ పేదల అదాయంలో పెరుగుదల ఏమాత్రం లేకపోవడం గమనార్హం. ఫలితంగా వారు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తోంది.



