రెండు ఇసుక ట్రాక్టర్లపై కేసు నమోదు
నవతెలంగాణ-మిడ్జిల్
మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలోని దుందిబి వాగు నుండి అర్ధరాత్రి అక్రమంగా ఇసుక మాఫియా బరితెగించి అనుమతి లేకుండా మండలంలోని మిడ్జిల్, వాడియాల్ , కొత్తూరు, మున్నూరు, కొత్తపల్లి గ్రామాల శివారు నుండి ఇసుకను ఇతర జిల్లాలకు తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు దుందిబి వాగులో కాపాలా కాశి పట్టిస్తే కానీ పట్టుకోరా అని పోలీసులు తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్, రెవెన్యూ అధికారులు సహకారంతో పగులు, రాత్రి అనే తేడా లేకుండా ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. అడ్డుకోబోయే రైతులపై దాడికి తెగబడుతున్నారు. స్థానికులకు ఇండ్లు నిర్మించుకోవడానికి ఇసుక దొరకక ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. దూర ప్రాంతాలకు ఇసుకను తరలించి ఇసుక మాఫి భారీగా డబ్బులు సంపాదిస్తూ, విచ్చలవిడిగా మద్యం సేవిస్తూ.. ఇసుక ట్రాక్టర్లు నడుపుతున్నారని, ట్రాక్టర్లను అడ్డుకోవడానికి వెళితే, ట్రాక్టర్లతో తొక్కేస్తామని బెదిరిస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు.
రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత కేసు నమోదు
మండలంలోని మిడ్జిల్ వాడియాల్ దుందిబి వాగు నుండి సోమవారం అర్ధరాత్రి ఇసుకను తరలిస్తుండగా రైతులు వెళ్లి ట్రాక్టర్లను పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. అనంతరం ఇసుక ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలించి ట్రాక్టర్ల యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. అనుమతి లేకుండా దుందిబి వాగు నుండి ఇసుక తరలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఇసుక మాఫియాను హెచ్చరించారు.



