నాడు మావోయిస్టుల కంచుకోట
ఆపరేషన్ కగార్ ద్వారా మావోయిస్టుల ఏరివేత
700 మంది మావోయిస్టులు లొంగుబాటు.. మిగిలింది ఇద్దరే.. : రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్
దండకారణ్యంలో రాష్ట్ర పోలీస్ బాస్
ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దు తడపాల వద్ద పావురం ఎగురవేత
పామునూరు గిరిజనులతో మాటామంతి
నవతెలంగాణ-వెంకటాపురం
”కర్రెగుట్టలు 50 దశాబ్దాలు మావోయిస్టు పార్టీ కంచుకోట, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుల అడ్డాగా ఉన్నాయి.. నేడు సీఆర్పీఎఫ్ ఔట్ పోస్టులు ఏర్పాటు చేసి సుందరవంతమైన టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేస్తున్నాం” అని తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం దట్టమైన అడవుల్లో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతం కర్రెగుట్టల్లో మంగళవారం డీజీపీ పర్యటించారు. పామునూరు బేస్ క్యాంపును పరిశీలించారు. సరిహద్దుల్లోని తడపాల సీఆర్పీఎఫ్ 196వ బెటాలియన్ బేస్ క్యాంపును పరిశీలించారు. తడపాల బేస్ క్యాంపు వద్ద శాంతికి చిహ్నంగా పావురాలను ఎగరవేశారు. జాతీయ జెండాను ఎగరవేశారు.
అనంతరం డీజీపీ విలేకరులతో మాట్లాడుతూ.. ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న కర్రెగుటల్లో.. సీఆర్పీఎఫ్, గ్రేహౌండ్స్, కోబ్రా, తెలంగాణ పోలీసులు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పోలీసుల సమన్వయంతో వారిని ఇక్కడి నుంచి పారదోలి పోలీసుల అవుట్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పామునూరు నుంచి ఛత్తీస్‌గఢ్ సరిహద్దు వరకు బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయిందన్నారు. మావోయిస్టుల ఆధీనంలో ఉన్న కర్రెగుట్టలను పామునూరు, డోలి అటవీ ప్రాంతాల్లో పోలీస్ అవుట్ పోస్టులు ఏర్పాటు చేసి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్టు తెలిపారు. మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా రోడ్డుగా ఆధునీకరిస్తామన్నారు. కర్రెగుటల్లో ఎన్నో సుందరమైన ప్రాంతాలు ఉన్నాయన్నారు. ఆపరేషన్ కగార్ ద్వారా మావోయిస్టుల శకం ముగిసిందని చెప్పారు. ఎన్‌కౌంటర్లలో కీలక నేతలు మృతిచెందినట్టు తెలిపారు. ఒడిశా, గడ్చిరోలి, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన మావోయిస్టులు, కీలక నేతలు 700మందికి పైగా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారని గుర్తు చేశారు. సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రెటరీ ముప్పాల లక్ష్మణరావు ఎలియాస్ గణపతి, ఆయన భార్య తదితర ఒకరిద్దరు మావోయిస్టులు మాత్రమే మిగిలారని తెలిపారు. జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులను, వారి కుటుంబాలను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. వారికి ఇండ్లు, వ్యవసాయ భూములు, వారి పేరుపై ఉన్న రివార్డులను ప్రభుత్వం వారికే అందిస్తుందని చెప్పారు.
గిరిజనులకు నిత్యావసర వస్తువులు
పామునూరు గుట్టల్లో నివాసం ఉంటున్న ఏడు గిరిజన కుటుంబాలకు దుప్పట్లు, బియ్యం నిత్యావసర వస్తువులను డీజీపీ అందజేశారు. వారితో మాట్లాడారు. డీజీపీ వెంట సీఆర్పీఎఫ్ అధికారులు, జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేక తదితరులు ఉన్నారు.
టూరిజం స్పాట్‌గా కర్రెగుట్టలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



