Tuesday, August 11, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంశాంతి ప్రణాళికను అంగీకరించం

శాంతి ప్రణాళికను అంగీకరించం

- Advertisement -

ఆయుధాల అప్పగింత తర్వాతే సేనల ఉపసంహరణ
ట్రంప్‌ నెత్తిన బాంబు పేల్చిన నెతన్యాహూ
టెల్‌ అవీవ్‌ :
గాజా శాంతి ప్రణాళికను అంగీకరించే ప్రశ్నే లేదని ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ స్పష్టం చేశారు. గాజాలో కాల్పుల విరమణ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదిహేను సూత్రాల ప్రణాళికను రూపొందించిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన ఇజ్రాయిల్‌ క్యాబినెట్‌ సమావేశంలో నెతన్యాహూ ప్రసంగిస్తూ ‘నేను ఓ విషయాన్ని స్పష్టంగా చెప్పదలచుకున్నాను. పదిహేను సూత్రాల పత్రాన్ని ఇజ్రాయిల్‌ అంగీకరించదు’ అని అన్నారు. ఆయన రెండోసారి కూడా ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టారు. ‘నేను అలా చెప్పలేదని కొందరు అనడం విన్నాను. అందుకే ఇప్పుడు మరోసారి చెబుతున్నా. గాజా శాంతి ప్రణాళికను ఇజ్రాయిల్‌ అంగీకరించబోదు’ అని చెప్పారు. కాగా నెతన్యాహూ నిర్ణయం ట్రంప్‌ను అసహనానికి గురి చేసే అవకాశం ఉన్నదని పరిశీలకులు అభిప్రాయపడ్డారు.

వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరలించేందుకే…
ఇరాన్‌ విషయంలో ఎదురు దెబ్బలు తగిలిన నేపథ్యంలో దాని నుంచి ప్రజల దృష్టిని మరలించేందుకు పది రోజుల క్రితం ట్రంప్‌ ఓ ప్రకటన చేశారు. హమాస్‌కు, తాను ఏర్పాటు చేసిన శాంతి బోర్డుకు మధ్య చారిత్రక ఒప్పందం కుదిరిందని తెలిపారు. దీని ప్రకారం హమాస్‌ తన వద్ద ఉన్న ఆయుధాలను పూర్తిగా విడనాడుతుందని చెప్పారు. అదే సమయంలో శాంతి బోర్డు ప్రతినిధి నికోలే మ్లాడెనోవ్‌ మరో అడుగు ముందుకు వేసి గాజా నుంచి ఇజ్రాయిల్‌ దళాలు కూడా వైదొలుతాయని అన్నారు. హమాస్‌ తన వద్ద ఉన్న ఆయుధాలను అప్పగిస్తున్న సమయంలోనే ఇజ్రాయిల్‌ రక్షణ దళాలు గాజాలోని తమ స్థానాల నుంచి దశల వారీగా వెనక్కి తగ్గుతాయని వివరించారు.

ఆయుధాలను పూర్తిగా విడనాడితేనే దళాల ఉపసంహరణ
గాజా నుంచి దళాల ఉపసంహరణకు ఇజ్రాయిల్‌ను ఒప్పించగలమన్న అమెరికా ఆశలు నెతన్యాహూ తాజా ప్రకటనతో అడియాసలయ్యాయి. ‘హమాస్‌ తన వద్ద ఉన్న ఆయుధాలను పూర్తిగా అప్పగించే వరకూ ఇజ్రాయిల్‌ రక్షణ దళాల ఉపసంహరణ జరగదు. హమాస్‌ను నిరాయుధీకరించడం అంటే దాని వద్ద భారీ ఆయుధాలు, తేలికపాటి ఆయుధాలు సహా అన్ని రకాల ఆయుధాలు లేకుండా చేయడమే. మనం మాట్లాడుతున్నది నిజమైన నిరాయుధీకరణ గురించి. కల్పితమైన దాని గురించి కాదు’ అని క్యాబినెట్‌ భేటీలో నెతన్యాహూ తేల్చి చెప్పారు. కాగా నెతన్యాహూ ప్రకటనపై హమాస్‌ ఆచితూచి స్పందించింది. కార్యాచరణ ప్రణాళికకు తాము కట్టుబడి ఉన్నామని, ఇజ్రాయిల్‌ కూడా ఇదే వైఖరిని అవలంబించేలా నెతన్యాహూపై శాంతి బోర్డు ఒత్తిడి తెస్తుందని ఆశిస్తున్నామని తెలిపింది.

అతివాద మిత్రుల నుంచి అవరోధాలు
ఇజ్రాయిల్‌లో సుమారు మూడు నెలల వ్యవధిలో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ ఎన్నికలలో నెతన్యాహూకు ఎదురు దెబ్బలు తప్పవని పలు పోల్స్‌ సూచిస్తున్నాయి. ఇజ్రాయిల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నెతన్యాహూ కొన్ని పార్టీలతో కూటమిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల తర్వాత కూటమిని ఏర్పాటు చేసే కంటే ముందుగానే దానికి ఓ రూపం ఇచ్చి బరిలో దిగడం మంచిదని ఆయన భావిస్తున్నారు. ఫలితాలు వెలువడిన తర్వాత అధికారంలో కొనసాగే అవకాశం ఏ మాత్రం ఉన్నప్పటికీ ఆయనకు అతివాద మిత్రుల మద్దతు తప్పనిసరి అవుతుంది. అయితే గాజా కార్యాచరణ ప్రణాళికలపై అతివాదులు ఇప్పటికే బహిరంగ విమర్శలు చేశారు. అంతేకాదు…గాజాలో ఓ చిన్న పైలట్‌ ప్రాజెక్టులో భద్రతను పర్యవేక్షించడానికి అంతర్జాతీయ స్థిరీకరణ దళాలను మోహరించాలంటూ క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని కూడా వారు డిమాండ్‌ చేస్తున్నారు. పైలట్‌ ప్రాంతంలో పునర్నిర్మాణ పనులను ప్రారంభించడానికి నెతన్యాహూ రహస్యంగా ఆమోదం తెలిపారని, ఇది మరింత బలహీనమైన చర్య అని ఆర్మీ రేడియో వ్యాఖ్యానించింది.

ఎవరికీ పట్టని నిర్వాసితులు
ఇజ్రాయిల్‌లో మెజారిటీ ఓటర్లు ట్రంప్‌ను సమర్ధిస్తున్నారు. అయితే గాజాలో ఇజ్రాయిల్‌ తన ఇష్టానుసారం నడుచుకునే స్వేచ్ఛకు కళ్లెం వేయాలని ట్రంప్‌ భావిస్తే అది పెద్ద పొరబాటే అవుతుందని వారు కరాఖండీగా చెబుతున్నారు. ఏదేమైనా గాజాలో నివసిస్తున్న ఇరవై లక్షల మంది నిర్వా సితులకు మాత్రం శాంతి ప్రణాళిక ఏ మాత్రం ఊరట ఇవ్వడం లేదు. తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోలేని నిస్సహాయ స్థితిలో వారు ఉండి పోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే వారిని పట్టించుకునే నాథుడే లేడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -