Wednesday, August 12, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంకంటెయినర్‌లో ట్రంప్‌


కంటెయినర్‌లో ట్రంప్‌


- Advertisement -

బ్రిటన్‌ పర్యటనలో బయటపడిన ట్రంప్‌ మేకపోతు గాంభీర్యం
ఇరాన్‌ పేరు చెబితేనే వణుకు !
క్యాటరింగ్‌ కంటెయినర్‌లో దాచి రహస్య విమానంలో పంపిన అధికారులు

వాషింగ్టన్‌ : ‘ఇరాన్‌ను నామరూపాలు లేకుండా చేస్తాను’, ‘ఇక ఇరాన్‌పై భీకర యుద్ధమే’, ‘రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఇంతటి తీవ్రమైన పోరు ఎన్నడూ చూసి ఉండరు’…అంటూ గతంలో ఎన్నో సందర్భాలలో బీరాలు పలికిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వాస్తవానికి టెహ్రాన్‌ పేరు చెబితేనే వణికిపోతారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ, శత్రు దుర్బేధ్యమైన ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానంలో ప్రయాణించే ట్రంప్‌నకు ఇరాన్‌ భయం పట్టుకుందంటే ఆశ్చర్యం కలుగుతోంది కదూ…అసలు ఏం జరిగిందంటే గత నెలలో టర్కీ నుంచి బ్రిటన్‌కు ఆయన ప్రయాణించాల్సి వచ్చింది. తనను హతమారుస్తానంటూ ఇరాన్‌ చేసిన హెచ్చరికలకు భీతిల్లిన ట్రంప్‌ మహాశయుడిని విమానాశ్రయంలోని క్యాటరింగ్‌ కంటెయినర్‌లో దాచి పెట్టి ‘రహస్య విమానం’లో పంపారు.

ఏం జరిగింది?
వాషింగ్టన్‌ పోస్ట్‌, న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికల కథనం ప్రకారం… నాటో శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు ట్రంప్‌ అంకారాలో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. టెలివిజన్‌ కెమేరాల ఎదుటే ఆయన పాత ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ జంబో జెట్‌ ఎక్కారు. ఆ తర్వాత కొద్ది నిమిషాలకు అంటే విమానం బయలుదేరడానికి ముందు భోజనం, ఇతర సామగ్రిని లోడ్‌ చేయడానికి ఉపయోగించే విమానాశ్రయ క్యాటరింగ్‌ ట్రక్కులో ఆయనను ఉంచి రహస్యంగా ఓ చిన్న విమానంలోకి పం పారు. అసలు ట్రంప్‌ ఎక్కడ ఉన్నారో పాత్రికేయులకు, కొంతమంది అధ్యక్ష భవనం అధికారులకు కూడా చెప్పలేదు. ట్రంప్‌నకు ఇరాన్‌ నుంచి ఎదురైన ముప్పు కారణంగానే ఈ ‘ఆపరేషన్‌’ చేపట్టాల్సి వచ్చిందని ఓ అధికారి చెప్పారు. పాత ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో ట్రంప్‌తో పాటే ప్రయాణి స్తున్నామని అనుకుంటున్న పాత్రికేయులకు ప్రెస్‌ క్యాబిన్‌లోని కిటికీ తెరలను మూసి ఉంచాలని అధికారులు సూచించారు. కొంతమంది అధ్యక్ష భవనం సిబ్బంది కూడా ట్రంప్‌ ఆ విమానంలోనే ఉన్నారని నమ్మారు.

ప్రమాదాన్ని ఎదుర్కోవడానికే…
మూడో విమానంలో ట్రంప్‌ చేసిన రహస్య ప్రయాణం గురించి వైట్‌హౌస్‌ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ స్టీవ్‌ చెంగ్‌ ఓ ప్రకటన చేశారు. అమెరికాను చాలామంది శత్రువులు లక్ష్యంగా చేసుకున్నారని, ఆ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి అందుబాటులో ఉన్న ప్రతి సాధనాన్నీ ఉపయోగిస్తామని ఆయన తెలిపారు.

చెప్పిందొకటి… చేసిందొకటి
ట్రంప్‌ జూలై 8న అప్పటి ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానంలో టర్కీ నుంచి బయలుదేరారని ప్రభుత్వం గతంలో చెప్పింది. ఖతార్‌ బహుకరించిన కొత్త బోయింగ్‌ 747-8 విమానాన్ని కాకుండా తన ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానాన్నే ఉపయోగిస్తానని ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌ పోస్టులో కూడా రాశారు. టర్కీకి సరిహద్దున ఉన్న ఇరాన్‌తో శత్రుత్వం తీవ్రమవుతున్న సమయంలో నాటో సదస్సుకు హాజరయ్యేందుకు ట్రంప్‌ తొలిసారిగా కొత్త విమానంలో అంతర్జాతీయ ప్రయాణం చేశారు. అంకారా నుంచి బయలుదేరే ముందు ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌లో ఓ పోస్ట్‌ పెడుతూ బ్రిటన్‌లోని ఆర్‌ఏఎఫ్‌ మిల్డెన్‌హాల్‌ స్థావరానికి చేరుకునేందుకు పాత జ్ఞాపకాలకు గుర్తుగా లేత నీలి రంగు ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌నే ఉపయోగిస్తా నని, అదే సమయంలో ఆ స్థావరంలో అమెరికా సైనికులు చూసేందుకు వీలుగా కొత్త విమానం కూడా ఆగుతుందని రాశారు.

2000లో కూడా…
2000వ సంవత్సరంలో కూడా ఇలాంటి ఆపరేషనే జరిగింది. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ అందరినీ మభ్యపెట్టేందుకు ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానాన్ని పంపి తాను మాత్రం ఎగ్జిక్యూటివ్‌ జెట్‌లో ప్రయాణించి పాకిస్తాన్‌ చేరారు.

ట్రంప్‌ ఏం చేశారంటే…
విమాన ప్రయాణంలో కిటికీ తెరలను ఎందుకు మూసి ఉంచుకోవాల్సి వచ్చిందని విలేకరులు ఆ తర్వాత అడిగిన ప్రశ్నకు ట్రంప్‌ బదులిస్తూ ప్రమాదకరమైన విమానంలో ప్రయాణిస్తున్నారు కాబట్టే అలా చేశామని చెప్పారు. ‘నేను వెళితే మీరూ వెళ్లాలి కదా?’ అని అన్నారు. ట్రంప్‌ను తీసుకొని వెళ్లిన సీ-32ఏ విమానం స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10.20 గంటలకు బ్రిటన్‌ చేరుకుంది. ఆ తర్వాత కొద్ది నిమిషాలకు పాత ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానం, మీడియా అక్కడికి చేరుకున్నాయి. ట్రంప్‌ తాను ప్రయాణించిన మూడో విమానం నుంచి ఓ వాహనంలో పాత ఎయిర్‌ ఫోర్స్‌ విమానం వద్దకు చేరుకున్నారు. వేరొక ప్రవేశం ద్వారా దానిలోకి ప్రవేశించి ఎప్పటి మాదిరిగానే పై ఎడమ వైపు తలుపు నుంచి మెట్లు దిగి నడిచారు. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10.56 గంటలకు విలేకరులకు శాంతి చిహ్నాన్ని చూపించారు. కానీ వారితో ముచ్చటించలేదు. తర్వాత ఖతార్‌ ఇచ్చిన విమానం వైపు నడవడానికి ముందు కొద్దిసేపు సైనికులను పలకరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -