Wednesday, August 12, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుపాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలి

పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలి

- Advertisement -

​వీలైనంత త్వరగా టెండర్ ప్రక్రియ ప్రారంభించాలి
మెట్రో రద్దీకి అనుగుణంగా కొత్త కోచ్ లు కొనుగోలు చేయాలి : అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్ మెట్రోరైలు రెండో దశలో భాగంగా పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్)కు సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు మంగళవారం సీఎం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల పొడవునా రోడ్డు విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కారిడార్ లో మెట్రో పనులకు
సంబంధించి టెండర్ ప్రక్రియను మొదలు పెట్టాలని సూచించారు. మెట్రో విస్తరణకు సంబంధించి పెండింగ్ లో ఉన్న భూ సేకరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అన్నారు. హైదరాబాద్ మెట్రోకు రోజురోజుకు రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రయాణికుల రద్దీకి తగినట్టుగా మెట్రో రైల్ కు అదనపు బోగీలను జత చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించి మెట్రో రైల్ కోచ్ లను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మెట్రో ఫేజ్-2 లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల కారిడార్ కోసం ప్రస్తుత టెక్నాలజీపై ఢిల్లీ మెట్రోను సంప్రదించి అవసరమైన సలహాలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు.

​డిసెంబర్ లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్
డిసెంబర్ లో నిర్వహించ తలపెట్టిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. వ్యాపార రంగంలో వివిధ సెక్టార్లలో గుర్తింపు పొందిన ప్రముఖులను సమ్మిట్ లో సన్మానించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ముఖ్యంగా తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో సమ్మిట్ ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. గతేడాది నిర్వహించిన సమ్మిట్ లో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పురోగతికి సంబంధించి పూర్తి వివరాలను నివేదించాలని ఆదేశించారు. పెట్టుబడుల్లో మరింత పురోగతి సాధించేందుకు అవసరమైన ప్రణాళికలను తయారు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, ప్రభుత్వ సలహాదారులు రామకృష్ణారావు, ఎన్వీఎస్ రెడ్డి, మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు ఎండీ అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -