Wednesday, August 12, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు15న సంగారెడ్డిలో లక్ష మందితో భారీ బహిరంగ సభ

15న సంగారెడ్డిలో లక్ష మందితో భారీ బహిరంగ సభ

- Advertisement -

జనసమీకరణ, భద్రత, వేదిక ఏర్పాట్లపై ఫోకస్‌
3.43 కోట్ల మందికి స్మార్ట్‌ ‌రేషన్‌ ‌కార్డులు
ప్రారంభించనున్న సీఎం రేవంత్‌‌రెడ్డి
ఏర్పాట్లపై మంత్రి ఉత్తమ్ సమీక్ష

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
పంద్రాగస్టు రోజు సంగారెడ్డి పట్టణంలో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జనసమీకరణ, భద్రత, వేదిక తదితరాంశాలపై ఫోకస్‌ ‌పెట్టింది. ఇదే అంశంపై మంగళవారం హైదరాబాద్‌‌లోని సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్, నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి, సెట్విన్ చైర్మెన్‌ గిరిధర్ రెడ్డితోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లతోనూ మంత్రి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వైరల్ ఫీవర్‌తో బాధపడుతుండటం వల్ల ఈ సమావేశానికి హాజరుకాలేకపోయారు. మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి మాట్లాడుతూ ‌ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సంగారెడ్డి బహిరంగ సభను జయప్రదం చేసేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. జన సమీకరణ, భద్రత, ఇతర ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 1.06 కోట్ల కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో లాంఛనంగా ప్రారంభించనున్నట్టు తెలిపారు.

అదే రోజు ఏకకాలంలో అన్ని జిల్లాల్లో కార్డులను పంపిణీ చేయాలని ఆదేశించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 నియోజకవర్గాల నుంచి మొత్తం పది మంది లబ్దిదారులకు సీఎం స్వయంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తారని తెలిపారు. ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ప్రతీక్ జైన్‌ను ఆదేశించారు. స్మార్ట్‌ ‌రేషన్‌ ‌కార్డుల వల్ల రాష్ట్రంలోని 3.42 కోట్ల మంది అర్హులైన లబ్దిదారులు ప్రయోజనం పొందనున్నారని చెప్పారు. ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా ప్రతి అర్హుడికి ప్రతి నెలా ఆరు కిలోల నాణ్యమైన సన్నబియ్యాన్ని ఉచితంగా ప్రభుత్వం పంపిణీ చేస్తున్నదని తెలిపారు. సుమారు 2.16 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని ఇందుకోసం సరఫరా చేస్తోందని చెప్పారు. స్మార్ట్‌ ‌కార్డుల ద్వారా రాష్ట్రంలో ఆహార భద్రతను మరింత బలోపేతం చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అర్హత కలిగిన ప్రతీ కుటుంబానికి ఆహార భద్రతను కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు జిల్లా కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు, సంబంధిత అన్ని విభాగాలు పరస్పర సమన్వయంతో పని చేయాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -