Wednesday, August 12, 2026
E-PAPER
Homeజాతీయంగ్రామీణ ఉపాధికి గండి

గ్రామీణ ఉపాధికి గండి

- Advertisement -

కొత్త చట్టం ‘వీబీ-గ్రామ్‌ ‌జీ’తో షాక్‌
50 శాతం పడిపోయిన పనిదినాలు
ఉపాధి పొందిన కుటుంబాల సంఖ్యా సగానికి తగ్గుదల
తొలి నెలలోనే ఆందోళనకర గణాంకాలు
వ్యవసాయ కూలీలు, పేద కుటుంబాలకు భారీ దెబ్బ

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ)లో గాంధీ పేరు తొలగించి ‘వీబీ-గ్రామ్‌ ‌జీ’ అనే కొత్త పేరుతో పథకాన్ని తీసుకొస్తే గ్రామీణ జీవనోపాధి మెరుగుపడుతుందని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రచారం చేసింది. కానీ పథకం అమలు ప్రారంభమైన తొలి నెలలోనే పనిదినాలు, ఉపాధి పొందిన కుటుంబాల సంఖ్య దాదాపు సగానికి పడిపోయాయి. దీంతో కేంద్రం చేసిన ఆ ప్రచారానికి భిన్నమైన వాస్తవం బయటపడినట్టయ్యింది. దేశవ్యాప్తంగా కరువు పరిస్థితుల్లో గ్రామీణ పేదలు, వ్యవసాయ కూలీలకు భరోసా ఇవ్వాల్సిన సమయంలో ‘ఉపాధి’ అవకాశాలు క్షీణించడం మోడీ ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) స్థానంలో గతనెల 1 నుంచి అమలు చేస్తున్న వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ) (వీబీ- గ్రామ్‌ ‌జీ) తొలి నెలలోనే నిరాశాజనక ఫలితాలు ఇచ్చింది. అధికారిక గణాంకాల ప్రకారం జులైలో 7.67 కోట్ల పనిదినాలు మాత్రమే నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ కింద నమోదైన 15.33 కోట్ల పనిదినాలతో పోలిస్తే ఇది 49.94 శాతం తగ్గుదల కావడం గమనార్హం. ఇటు ఉపాధి పొందిన కుటుంబాల సంఖ్య కూడా 1.42 కోట్ల నుంచి 68.94 లక్షలకు పడిపోయింది. అంటే 51.4 శాతం తగ్గుదల నమోదైంది. దీంతో ఇలాంటి పరిస్థితులు దేశంలో గ్రామీణ ఉపాధి హామీ అమలుపై సందేహాలు రేకెత్తిస్తున్నాయి.

​ఐదేండ్ల కనిష్ఠ స్థాయికి
కొత్త పథకం అమలైన తొలి నెలలో నమోదైన గణాంకాలు గత ఐదేండ్లలో అత్యల్ప స్థాయిలో ఉన్నాయి. గత నాలుగేండ్లలో సగటున 1.72 కోట్ల కుటుంబాలు ఉపాధి పొందగా.. ఈసారి 68.94 లక్షల కుటుంబాలకే పని లభించింది. అలాగే గత నాలుగేండ్ల సగటు 21.56 కోట్ల పనిదినాలతో పోలిస్తే ఈసారి నమోదైన పనిదినాలు 35 శాతమే కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

​కరువు వేళ ఉపాధికీ కోత
ఈ ఏడాది దేశంలో వర్షాలు సరిగా లేకపోవడంతో దేశవ్యాప్తంగా 741 జిల్లాల్లో 50 శాతం జిల్లాలు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని ఐఎండీ తెలిపింది. మరోపక్క ఖరీఫ్‌ ‌సాగు తగ్గింది. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం… ఈ ఏడాది జులై 31 నాటికి నాటికి 894.22 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ పంటలు సాగు అయ్యాయి. గతేడాది ఇదే సమయానికి 920.72 లక్షల హెక్టార్లు సాగు అయ్యాయి. అంటే 26.5 లక్షల హెక్టార్ల మేర సాగు విస్తీర్ణం తగ్గింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో గ్రామీణ కూలీలకు ఉపాధి హామీ చట్టం రక్షణ కవచంలా పనిచేయాల్సి ఉండగా.. పనిదినాలే భారీగా తగ్గిపోవడం గ్రామీణ కుటుంబాలను మరింత సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉందని మేధావులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

​ప్రభుత్వ ప్రకటనలకు 
విరుద్ధంగా వాస్తవ గణాంకాలు
పాత ఉపాధి స్కీం స్థానంలో కొత్త పథకం తీసుకొచ్చినప్పుడు కూలీ రేట్లు పెంచామని, 100 రోజుల స్థానంలో 125 రోజుల ఉపాధి కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే వాస్తవానికి పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. హామీలు పెరిగినా ఉపాధి మాత్రం తగ్గిపోవడంతో మోడీ సర్కారు చేసిన ప్రకటనలు, వాస్తవ గణాంకాల మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది.

​కేంద్ర ప్రభుత్వం ఏమంటోంది?
కేంద్రం గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం… వీబీ-గ్రామ్‌ ‌జీకి 2026–27 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.95,692 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఇది గ్రామీణ ఉపాధి కార్యక్రమాలకు ఇప్పటివరకు కేటాయించిన అత్యధిక నిధులని పేర్కొంది. ఉపాధి కోరిన గ్రామీణ కుటుంబాల్లో 98 శాతం మందికి పని కల్పించామని వివరించింది. జులైలో దాదాపు 9 కోట్ల వ్యక్తి-పని దినాలు సృష్టించామని పేర్కొంది. అయితే వెబ్‌‌సైట్‌ ‌డ్యాష్‌‌బోర్డులో మాత్రం ఈ సంఖ్య 7.67 కోట్లుగా మాత్రమే కనిపిస్తుండటం గమనార్హం. 1.33 కోట్ల మంది గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించామనీ, దేశవ్యాప్తంగా తొమ్మిది లక్షలకు పైగా పనులు కొనసాగుతున్నాయని తెలిపింది. మహిళల భాగస్వామ్యం కూడా 63 శాతానికి చేరిందని వివరించింది.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఆందోళన
​గ్రామీణ ఉపాధి తగ్గడం అంటే కూలీల ఆదాయం తగ్గడం మాత్రమే కాదు. గ్రామీణ మార్కెట్లలో కొనుగోలు శక్తి క్షీణించడం, వ్యవసాయ ఆధారిత చిన్న వ్యాపారాలు దెబ్బతినడం, స్థానిక ఆర్థిక వ్యవస్థ మందగించడం వంటి పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వర్షాభావం, సాగు విస్తీర్ణం తగ్గడం వంటి సమస్యలతో సతమతమవుతున్న గ్రామీణ భారతానికి కొత్త ఉపాధి పథకం ఆశించిన భరోసా ఇవ్వలేకపోవడం మోడీ ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి విధానాలపై మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -