బీఆర్‌ఎస్‌ది ముగిసిన అధ్యాయం ఎన్నడూలేనట్టుగా యువతకు ఉద్యోగాలు
మూడు ట్రిలియన్ల ఆర్ధికశక్తిగా తెలంగాణ
ధరణి అక్రమాలను నిగ్గుతేలుస్తాం
బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు
నవతెలంగాణతో
సమాచార, రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి
‘ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తాం.. పనులు, పథకాలు ఆ దిశగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాం..2047 నాటికి మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ర్టం.. భూముల సర్వే సాధ్యమే.. ఆరోగ్యం కోసమే ఆస్పత్రులు.. ఎన్నికల హామీలను అమలుచేస్తున్నాం..ఉచిత విద్యుత్‌ను కొనసాగిస్తాం..15 నుంచి రేషన్‌కార్డుల జారీ.. ధరణి అక్రమాలను నిగ్గుతేలుస్తాం.. ప్రత్యేక కమిటీ వేశాం.. బీఆర్‌ఎస్‌ది ముగిసిన అధ్యాయం.. సంస్కరణలు కొనసాగుతాయి’ అని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నవతెలంగాణ 11వ వార్షికోత్సవం సందర్భంగా నవతెలంగాణ ప్రతినిధికి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోని ముఖ్యాంశాలు ఇలా..
బి. బసవపున్నయ్య
ప్రశ్న : రైతులకు మద్దతు ధర,
ఉచిత విద్యుత్ సరఫరా జరుగుతోందా?
జవాబు: ఈ ఏడాది వానాకాలంలో యాసంగి సీజన్‌లో 8 వేల కొనుగోలు కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధరకు రూ. 28 వేల కోట్ల విలువ చేసే 1. 22 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతు ఖాతాలో నగదు జమ చేస్తున్నాం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌లో భాగంగా 29 లక్షల పంప్ సెట్లకు ఉచితంగా విద్యుత్ ను అందిస్తున్నాం. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగరాసి దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో రెండున్నర సంవత్సరాలలో అన్నదాతల సంక్షేమానికి రూ. లక్షా 13వేల కోట్లు ఖర్చుచేసింది. పదేండ్లపాటు ఈ రాష్ట్రాన్ని పాలించిన గత పాలకులు మహా అద్భుతాలు చేశామనీ, ఎన్నో ప్రాజెక్ట్‌లు నిర్మించామని గొప్పలు చెప్పుకున్నారు. కానీ వాస్తవానికి రీడిజైన్ పేరుతో ఆర్ధిక దోపిడీకి పాల్పడ్డారు. దీనికి కాళేశ్వరం ప్రాజెక్టే చక్కటి నిదర్శనం.
ప్రశ్న:- రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు చేస్తున్న కృషి ఏమిటి?
జవాబు: రాష్ట్రాన్ని దేశంతోపాటు ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ -2047 విజన్‌తో ముందుకు సాగుతోంది. 2035 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్ధను ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల లక్ష్యం సాధించాలనుకుంటున్నాం. ఇందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. బలమైన ఆర్థిక శక్తిగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025ను హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో విజయవంతంగా నిర్వహించాం. ఈ ఏడాది కూడా నిర్వహించబోతున్నాం.
ప్రశ్న: ఎన్నికల హామీల అమలు ఎలా ఉంది ?
జవాబు : ఎన్నికల హామీల్లో దాదాపు 80 శాతం అమలు చేశాం. ప్రకటించని పలు పథకాలను ప్రవేశపెట్టాం. నాటి పీసీసీ అధ్యక్షులు నేటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అప్పట్లో పాదయాత్రల్లో ఇచ్చిన హామీలను అమల్లోకి తెచ్చాం. అందులో ప్రధానమైనది రైతులు, ప్రజలను ఇబ్బంది పెట్టేలా రూపొందించిన ధరణి పోర్టల్‌ను రద్దు చేశాం. అన్నివర్గాల అభిప్రాయాలతో భూభారతి చట్టాన్ని తీసుకువచ్చాం. అక్రమాలను నిగ్గుతేలుస్తాం. చట్టప్రకారం చర్యలు తప్పవు.
ప్రశ్న:- రెవెన్యూ శాఖలో తెచ్చిన సంస్కరణలేంటి ?
జవాబు:- రైతులకు పారదర్శకంగా సులభతరమైన సేవలు అందించడానికి ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్‌ను రూపొందించాం. గతంలో మాదిరిగా రైతులు తమ భూ సేవల కోసం మీసేవా కేంద్రాలకు వెళ్లే పని లేకుండా తమ ఇంటినుంచే భూసేవలు పొందేలా పోర్టల్‌ను తయారుచేశాం. భూభారతి చట్టంలో పేర్కొన్న విధంగా వ్యవసాయ భూములకు సంబంధించి క్రయవిక్రయ దారులకు ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్‌ను జత పరిచే నిబంధనను అమలు చేస్తున్నాం. ప్రతి సర్వే మ్యాప్ ( ఎల్‌పీఎం)కు యూనిక్ నెంబర్, ప్రతి సర్వే నెంబర్‌కు ఆధార్ నెంబర్ మాదిరిగానే భూధార్ నెంబర్‌ను కూడా కేటాయిస్తున్నాం. ఇదే విధానాన్ని దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం.
ప్రశ్న:- భూముల రీసర్వే సాధ్యమేనా ?
జవాబు:- చిత్తశుద్ధి ఉంటే, చేయాలన్న తపన ఉంటే ఏదైనా సాధ్యమే. మా ప్రభుత్వం ఏ విషయంలోనూ తొందర పడదలచు కోలేదు. కీలక నిర్ణయాలు అమలు చేసేముందు పైలట్ ప్రాజెక్ట్ లు నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో 478 గ్రామాల్లో నిజాం కాలం నుంచి నక్షాలు లేవు. మేం పైలట్ ప్రాజెక్ట్‌ను ఐదు గ్రామాల్లో చేపట్టాం. ఇప్పుడు జిల్లాకు 70 గ్రామాల్లో రీసర్వేకు శ్రీకారం చుట్టాం. రీసర్వే ద్వారా రాష్ట్రంలో భూవివాదాలకు శాశ్వతపరిష్కారం చూపాలన్నదే మా ప్రభుత్వ అంతిమ లక్ష్యం.
ప్రశ్న:- ఆరు గ్యారంటీలు అమలైనట్టేనా ?
జవాబు:- దశల వారీగా ఆరుగ్యారంటీలను అమలు చేస్తున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిగులు నిధులు కలిగిన తెలంగాణను రూ. 8.22 లక్షల కోట్లకు పైగా అప్పుల్లోకి నెట్టింది. మేం నెలకు దాదాపు రూ.6500 కోట్లు వడ్డీ కింద చెల్లిస్తున్నాం. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అందిస్తున్నాం. కర్నాటక తర్వాత ఆయా సౌకర్యాలతో మహిళలకు ఉచిత బస్సు పథకం అందించిన రెండవ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణే. మా తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తమిళనాడు, కేరళం, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ర్టాలు ఈ ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్నాయి.
ప్రశ్న:- విద్యారంగ లోపాలను సవరించే ప్రయత్నం ఉందా ?
జవాబు: విద్యతోనే దేశానికి భవిష్యత్తు. నాణ్యమైన, నైపుణ్యం కలిగిన చదువును అందించాలనే సంకల్పంతో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను మంజూరు చేశాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ విద్యార్థులు ఒకే చోట చదువుకునేందుకు వీలుగా అధునాతన వసతులతో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తున్నాం. ఇప్పటికే 79 స్కూళ్ళు మంజూరు చేశాం. ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి 33 జిల్లాల్లో 1,362 ప్రీ-ప్రైమరీ విభాగాలను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాం. రాష్ట్రంలో ఉన్న 57 ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేశాం. యువతకు భవిష్యత్ లో ఉద్యోగావకాశాలు కల్పించడానికి, ఎంటర్ ప్రెన్యూర్లుగా ఎదగడానికి వీలుగా 2026–27 విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్ కళాశాలల్లో 15 కొత్త కోర్సులు ప్రారంభిస్తున్నాం.
ప్రశ్న:- రేషన్ కార్డులకు సన్నబియ్యం సరఫరా ఎలా సాగుతోంది?
జవాబు :- నిరుపేదలు సైతం సంపన్నులతో సమానంగా సన్న బువ్వ తినాలన్న లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 17వేల రేషన్ షాపుల ద్వారా మూడు కోట్లా 36 లక్షల మంది పేదలకు ప్రతినెలా రెండు లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని ఉచితంగా సరఫరా చేస్తున్నారు. ఈనెల 15 నుంచి కోటికిపైగా కొత్త రేషన్‌కార్డులు ఇస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది.
ప్రశ్న: ధరణి అక్రమాలపై చర్యలు తీసుకుంటారా ?
జవాబు: తప్పకుండా. బీఆర్‌ఎస్ సర్కారు తెచ్చిన ధరణితో ప్రజలు, రైతులు చాలా కష్టాలు పడ్డారు. అక్రమాలపై అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఆరంభం శూరత్వం ఉండదు. క్రియాశీలంగా పనిచేస్తాం. ఇది ప్రజాప్రభుత్వం గ్యారంటీ.
ప్రశ్న: సామాజిక న్యాయం పరిస్థితేంటి ?
జవాబు: మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం జరిగిన పోరాటాలకు మా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపించింది. సంక్షేమంతోపాటు సామాజిక న్యాయంలో సైతం తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేస్తున్నది. దేశంలోనే ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని చెప్పడానికి గర్వపడుతున్నాం.
ప్రశ్న:- ప్రజారోగ్యం కోసం తీసుకుంటున్న చర్యలేంటి ?
జవాబు:- ఆరోగ్యశ్రీ అంటేనే కాంగ్రెస్ బ్రాండ్ స్కీమ్. గత పదేండ్లలో మసకబారిన ఈ పథకానికి పూర్వవైభవం తీసుకువచ్చాం. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. రాష్ట్రవ్యాప్తంగా 1402 ఆస్పత్రుల్లో సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల మరో108 ఆస్పత్రులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాం. ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు సుమారు 12 లక్షల మందికి చికిత్స అందించాం. ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో ఆస్పత్రులకు రూ.1600 కోట్లను చెల్లించాం. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని అనాథ పిల్లలు ఏ విధమైన అనారోగ్యానికి గురైనా కార్పొరేట్ ఆస్పత్రిలో రూ. 10 లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు పొందే అవకాశాన్ని కల్పిస్తున్నాం.
ప్రశ్న: అత్యంత ప్రజాదరణ పొందిన పథకమేది ?
జవాబు : రాష్ట్రంలో దాదాపు 100 వరకు సరికొత్త పథకాలను వివిధ శాఖలు అమలు చేస్తున్నాయి. వీటిలో ఇందిరమ్మ ఇండ్ల పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. కనీసం ఇల్లులేని నిరుపేదలను గుర్తించి ఇంటి స్థలం ఉన్న వారికి రూ.5 లక్షలు అందించి వారే పక్కా ఇల్లు కట్టుకునేలా ప్రొత్సహిస్తున్నాం. ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం లేదు. కేంద్రం సహకరించకపోయినా మేమే నిధులు ఇస్తున్నాం. తొలి ఏడాదిలోనే 4.50 లక్షల ఇండ్లను మంజూరు చేశాం. నిధులిచ్చాం. మలివిడత 2.50 లక్షల ఇండ్ల మంజూరును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇవిగాక హైదరాబాద్ కేంద్రంగా క్యూర్ పరిధిలో లక్ష ఇండ్లకు అనుమతులిచ్చాం. రెండున్నరేండ్ల కాలంలో 8లక్షల ఇండ్లు మంజూరు కాగా, ఇప్పటికే దాదాపు 3 లక్షల గృహాప్రవేశాలు జరిగాయి.
ప్రశ్న:- నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలేవీ ?
జవాబు:- ప్రజాప్రభుత్వం వచ్చాక 70 వేల మందికి ఉద్యోగాలిచ్చాం. అంతేగాక గ్రామస్థాయి వరకు రెవెన్యూ సేవలను అందిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం. రాష్ట్రంలోని 10,954 రెవెన్యూ గ్రామాలను క్లస్టర్ల వారీగా విభజించి గ్రామపాలనాధికారులను (జీపీవో) నియమించాం. అదేవిధంగా 5,520 లైసెన్సుడ్ సర్వేయర్లు తమ సేవలను అందిస్తున్నారు. పోలీసు శాఖతో సహా వివిధ శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నాం. రెండులక్షల ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉన్నాం. గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించలేక, పరీక్షాపత్రాలు లీక్ కావడంతో రాజ్యాంగబద్ధ సంస్థ టీజీపీఎస్సీ నవ్వులపాలైంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఎందరో నిరుద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. ఉద్యోగ నియామకాలకు పదేండ్ల పాటు అంటే ఉద్యోగుల గరిష్ట వయోపరిమితిని 34 ఏండ్ల నుంచి 44 ఏండ్లకు పెంచాం. ప్రశ్న: మళ్లీ అధికారంలోకి వస్తారా ?
జవాబు: సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోగాని ఆ తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఉప ఎన్నికల్లోగానీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజానీకం మాకు ఘన విజయాన్ని సాధించిపెట్టింది. బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్న కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. భవిష్యత్తులో కూడా ఇవే ఫలితాలు పునరావృతమవుతాయి. రెండున్నరేండ్ల తర్వాత అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ పగటి కలలు కంటున్నది. రాష్ట్రంలో ఆ పార్టీది ముగిసిన అధ్యాయం.



