Wednesday, August 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగడువులోగా ఉప్పల్‌ ఎలివేటర్‌ కారిడార్‌ పూర్తికావాల్సిందే

గడువులోగా ఉప్పల్‌ ఎలివేటర్‌ కారిడార్‌ పూర్తికావాల్సిందే

- Advertisement -

ప్రజలకు మాటిచ్చాం…అలసత్వాన్ని సహించం
మూడు షిప్టుల్లోనూ పనులు చేయాలి
కారిడార్ కింద బీటీ రోడ్డు పనులు నెలాఖరుకు పూర్తి చేయాల్సిందే : 
సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

దసరా నాటికల్లా ఉప్పల్‌ ఎలివేటర్‌ ‌కారిడార్‌ను పూర్తిచేయాలని అధికారులను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి ఆదేశించారు. ప్రతిరోజూ మూడు షిఫ్టుల్లోనూ పనులు చేయించాలనీ, అలసత్వం వహిస్తే సహించబోమని హెచ్చరించారు. కారిడార్ కింద 6.25కిలోమీటర్ల బీటీ రోడ్డు పనులు ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌‌లోని డాక్టర్‌ ‌బీఆర్‌ అంబేద్కర్‌ ‌తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. అందులో ఆర్అండ్‌‌బీ సీఈ ధర్మారెడ్డి, పలువురు ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ఆ రోడ్డుపై ఏండ్ల తరబడి ప్రయాణం నరకప్రాయంగా మారిందనీ, అందుకోసమే 2026 దసరా నాటికి పూర్తి చేస్తామని ప్రజలకు మాటిచ్చామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం పూర్తి జవాబుదారీగా వ్యవహరిస్తుందనీ, ఏండ్ల తరబడి అవస్థ పడుతున్న ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సురక్షిత ప్రయాణం అందించేలా చేద్దామనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నదని చెప్పారు. ప్రతి పది రోజులకు ఒకసారి తానే స్వయంగా క్షేత్రస్థాయి పనుల పురోగతి సమీక్షిస్తాననీ, అందుకు తగ్గట్టుగా రోజువారీ వర్క్ ప్రోగ్రెస్ అధికారులు సమీక్షించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు 60 శాతం పూర్తయ్యాయనీ, మరో 40శాతం పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు,వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు వివరించారు. సైట్లో సెగ్మెంట్ తయారీకి నాలుగు బెడ్లు, నాలుగు గ్యాంట్రీస్ తో 300మంది కార్మికులు రెండు షిఫ్టుల్లో పనిచేస్తున్నారని మంత్రికి చెప్పారు.ఉప్పల్‌ ‌వైపు నుంచి ఇప్పటికే ఒక స్లాబ్ పూర్తయిందనీ, రెండో స్లాబ్ పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు వివరించారు. నెలకు ఆరు స్లాబుల చొప్పున పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థ మంత్రికి హామీనిచ్చింది. అటు నారపల్లి వైపు నుంచి, ఇటు ఉప్పల్ వైపు నుంచి ఇరువైపులా లాంచింగ్ గడ్డర్లతో పనుల్లో వేగం పెంచాలని మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. ఉప్పల్ వైపు నుంచి జరుగుతున్న పనుల పురోగతిపై ఆరా తీశారు. 2026 అక్టోబర్ 31 నాటికి అందుబాటులోకి తెస్తామని ఇప్పటికే డెడ్ లైన్ పెట్టుకున్నామనీ, ప్రజల ట్రాఫిక్ ఇబ్బందులు గురించి ఆలోచించాలని సూచించారు. దానికి అనుసంధానంగా జీహెచ్‌ఎంసీ నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులపై ఆరా తీశారు. జీహెచ్‌ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులు సమాంతరంగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -