Wednesday, August 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకూరగాయల సాగుకు ప్రణాళిక

కూరగాయల సాగుకు ప్రణాళిక

- Advertisement -

20 లక్షలా 50 వేల మంది విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్
22లోగా కార్యాచరణ ప్రణాళిక : ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్‌ ‌చిన్నారెడ్డి ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలోని 39 సెంట్రలైజ్డ్‌ ‌కిచెన్ల పరిధిలో కూరగాయల సాగుకు ప్రణాళిక ఏర్పాటు చేయనున్నట్టు ప్రణాళికా సంఘం వైస్‌ ‌చైర్మెన్‌, వ్యవసాయ రంగం నిపుణుల కమిటీ చైర్మెన్‌ ‌డాక్టర్‌ ‌జి చిన్నారెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌‌లోని ప్రజాభవన్‌‌లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్, డైరెక్టర్ గోపి, అదనపు డైరెక్టర్ విజయ్ కుమార్, విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, హార్టికల్చర్ జాయింట్ డైరెక్టర్ రామలక్ష్మి, సెర్ప్ అధికారి రజిత, హరే కృష్ణ మిషన్, మన్నా ఫౌండేషన్, అక్షయ పాత్ర ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల 50 వేల మంది పాఠశాలల, ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అందుకోసం ప్రతి రోజు ఒక లక్ష 20 వేల కిలోల కూరగాయలు అవసరం ఉంటుందని అంచనా వేశారు. వ్యవసాయం, ఉద్యానవనం, గ్రామీణ పేదరిక నిర్మూలన, విద్యాశాఖల సమన్వయంతో నిర్వహించిన ఈ సమావేశంలో గ్రామీణ పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న ఆహార కార్యక్రమానికి అవసరమైన కూరగాయలను స్థానిక రైతుల నుంచి నేరుగా సేకరించే అంశంపై ప్రధానంగా చర్చించారు.
ప్రస్తుతం గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు హరేకృష్ణ మిషన్, మన్న ట్రస్ట్, అక్షయపాత్ర వంటి సంస్థల సహకారంతో కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆ సంస్థలకు అవసరమైన కూరగాయలను రైతుల నుంచి నేరుగా సేకరించే వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా మధ్య వర్తుల ప్రమేయాన్ని తగ్గించి రైతులకు మెరుగైన ధర కల్పించవచ్చని అభిప్రాయపడ్డారు. దీంతో కూర గాయలు పండించే రైతులకు స్థిరమైన మార్కెట్‌, మంచి ధర లభిస్తుందని తెలిపారు. గ్రామీణ మహిళా సంఘా లకు ఉపాధి, ఆదాయ అవకాశాలు పెరుగుతాయన్నారు.
​17 నుంచి 20 వరకు క్షేత్రస్థాయి పరిశీలన
ఈ నెల 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వ్యవసాయ, ఉద్యానవన, గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కూరగాయలు సాగు చేస్తున్న రైతులు, మహిళా రైతులు, మహిళా సంఘాలతో సమావేశాలు నిర్వహించనున్నారు.
​జిల్లా స్థాయిలో సమగ్ర నివేదిక
క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని జిల్లా స్థాయిలో జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా ఉద్యానవన అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి సమన్వయంతో క్రోడీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు.ఈ వివరాలను ఈ నెల 22వ తేదీలోగా రాష్ట్రస్థాయికి పంపించాలని సమావేశంలో నిర్ణయించారు. క్షేత్రస్థాయి నుంచి అందే సమాచారాన్ని సమగ్రంగా పరిశీలించిన అనంతరం ఈ నెల 22వ తేదీన నిపుణుల కమిటీ మరోసారి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -