Thursday, August 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణ ప్రాజెక్టులపై కుట్రలు ఆపాలి

తెలంగాణ ప్రాజెక్టులపై కుట్రలు ఆపాలి

- Advertisement -

జీఆర్ఎమ్‌‌బీ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టుల రద్దు అంశాన్ని తొలగించాలి : మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి

తెలంగాణ ప్రాజెక్టులపై కుట్రలు ఆపాలని, ఈ నెల 18న హైదరాబాద్‌లో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (జీఆర్ఎమ్ బీ) సమావేశ ఎజెండాలో ఏడు ప్రాజెక్టుల అనుమతుల రద్దు అంశాన్ని చేర్చడంపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపాదన మేరకు ఈ అంశాన్ని ఎజెండాలో పెట్టడం సరికాదన్నారు. కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు రాబోయే సమావేశ ఎజెండాపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అన్ని చట్టబద్ధమైన అనుమతుల తోనే ఈ ప్రాజెక్టులను నిర్మించామని స్పష్టం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన ఏర్పాటైన తెలంగాణ హక్కులను కాలరాసేలా ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు లేఖ రాయడం, దాన్ని బోర్డు ఎజెండాలో పెట్టడం ఎంతమాత్రమూ సరికాదని అన్నారు.రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగే ప్రమాదం ఉన్నప్పటికీ, తెలంగాణ నుంచి గెలిచిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండటం సిగ్గుచేటని వినోద్‌ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ అంశంపై తమ స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఎంపీలందరూ తక్షణమే ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలవాలని, పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆ ప్రతిపాదనలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒకవేళ ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేస్తే రాష్ట్రంలో తీవ్ర విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు.

ఈ నెల 18వ తేదీలోగా జీఆర్ఎమ్ బీ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టుల రద్దు అంశాన్ని తొలగించని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -