వ్యవసాయంలో కీలక భూమిక పోషిస్తున్న మహిళలు
ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం కరువు
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
వ్యవసాయంలో మహిళా రైతుల పాత్ర ఎనలేనిది. పాలకుల అనాలోచిత నిర్ణయాలు.. పెరిగిన పెట్టుబడులు, పంటలకు మద్దతు ధరలు లేక సాగు దినదినం కష్టాలనెదుర్కొంటోంది. మరోవైపు వ్యవసాయాన్ని విదేశీ, స్వదేశీ కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారు. గతంలో రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ఉన్న అవకాశాలను కూడా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో రైతాంగాన్ని రక్షించుకుందాం.. దేశాన్ని కాపాడుకుందాం.. అనే నినాదంతో మంగళవారం (ఈనెల 31న) తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో యాదాద్రి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో మహిళా రైతు రాష్ట్ర సదస్సు జరగనుంది.
ప్రముఖుల రాక..
రైతు సంఘం ఆధ్వర్యంలో జరగనున్న మహిళా రైతు రాష్ట్ర సదస్సుకు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, సీనియర్ నాయకులు బొంతల చంద్రారెడ్డి, యాదాద్రి జిల్లా అధ్యక్షులు మేక అశోక్‌రెడ్డి, కార్యదర్శి మాటూరి బాలరాజుగౌడ్, రాష్ట్ర కమిటీ సభ్యులు చీరిక అలివేలు, బూరుగు క్రిష్ణారెడ్డి తదితరులు హాజరు కానున్నారు.
వ్యవసాయంలో మహిళల పాత్ర
వ్యవసాయం భారత దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక లాంటిది. గ్రామీణ ప్రాంత పేదరిక నిర్మూలనకు ఒక పట్టుకొమ్మ లాంటిది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ 90 శాతం వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నది. దీనిలో మహిళలే ప్రధాన భాగస్వాములుగా ఉంటున్నారు. తాజా గణాంకాల ప్రకారం.. దేశంలో దాదాపు 84శాతం మంది మహిళలు వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు. అందులో 33శాతం మంది రైతులు కాగా, 47శాతం మంది రైతు కూలీలుగా పనిచేస్తున్నారు. వ్యవసాయంలో కీలకంగా పని చేస్తున్నా.. మహిళలకు భూమిపై ఎలాంటి హక్కులూ ఉండటం లేదు. జాయింట్ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ అమలు కావడం లేదు.
మహిళా రైతులకు రుణాలు అందించాలి
పాలు, పండ్లు, కూరగాయలు, చేపల పెంపకం, కోళ్ల పెంపకంలో మహిళల పాత్ర కీలకంగా మారింది. వీటిలో కూడా మహిళలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికలు రూపొందించి అమలు చేయాల్సిన అవసరం ఉంది. యాంత్రీకరణ పెరుగుతున్నప్పటికీ మహిళలకు పని భారాన్ని తగ్గించే యంత్రాల రూపకల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రైతుల ఆత్మహత్యల్లో మహిళా రైతుల ఆత్మహత్యలు కూడా గణనీయంగా నమోదవుతుండటం ఆందోళనకరం. వీరికి పెట్టుబడి కోసం జాయింట్ లయబుల్ గ్రూపులను ఏర్పాటు చేసి రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ మహిళల సంఖ్య పెరుగుతోంది.
-మహిళా రైతుల రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల



