గూడెందొడ్డి పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుపై కన్సల్టెన్సీ నియామకం
ప్రాజెక్టుల పరిహారం.. పునరావాసం వేగవంతం
గరిష్ట స్థాయిలో గోదావరి జలాల వినియోగం..నీటి పారుదల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనల మేరకే సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల్లో నీటి నిల్వ చేయడంతో పాటు పునరుద్ధరణ పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మూడు బ్యారేజీల్లో తేలిన సాంకేతిక లోపాలు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు సీఎంకు వివరించిన సందర్భంలో సీఎం మాట్లాడుతూ.. సొంత నిర్ణయాలు తీసుకుకోకుండా నిపుణుల సలహా మేరకే ముందుకెళ్లాలని వారికి సూచించారు. ఎల్లంపల్లితో పాటు దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి సాధ్యమైనంత మేరకు ఎత్తిపోతలు చేపట్టాలన్నారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి నీటి పారుదల శాఖపై బుధవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హె చ్ఆర్‌డీ)లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో అందుబాటులో ఉన్న గోదావరి జలాలను గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలని ఆదేశించారు. దేవాదుల నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా 9 పంపులతో ఎత్తిపోతలు చేపట్టామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్బంగా తెలిపారు. దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి ఎత్తిపోతలకు సంబంధించి ఏవైనా చిన్న చిన్న సమస్యలుంటే వాటి పరిష్కారంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించాలని సీఎం సూచించారు. గోదావరి జలాలు సముద్రంలో కలవకుండా సాధ్యమైనంత వరకు ఎత్తి పోసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ ఏడాది సాగు, తాగు నీరుకు ఇబ్బందులు లేకుండా నీటి పారుదల శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికతో ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టాలన్నారు. రాష్ర్టంలో చివరి దశలో ఉన్న పలు ప్రాజెక్టుల కింద కొన్ని గ్రామాలు, కొద్ది పాటి వ్యవసాయ భూములకు పరిహారం చెల్లింపు అంశాలు పెండింగ్‌లో ఉన్నాయనీ, వాటిని వెంటనే చెల్లించేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. భూములు కోల్పోయిన రైతులు, ఆస్తులు కోల్పోయిన ప్రజలకు పరిహారం చెల్లింపులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నీటి పారుదల, రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ముంపు గ్రామాలు వాస్తవ పరిస్థితి, పరిహారం, పునరావాసానికి సంబంధించి నివేదిక రూపొందించాలన్నారు. తక్షణ ప్రభావం పడే గ్రామాలకు వెంటనే పరిహారం చెల్లించాలని సూచించారు. హుస్నాబాద్ నియోజక వర్గంలోని బస్వాపూర్, గౌరవెల్లి ప్రాజెక్టులకు సంబంధించి మిగిలిన చిన్న చిన్న పనులు పూర్తి చేస్తే నీరు నింపే అవకాశం ఉంటుందని సీఎం తెలిపారు. ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గట్టు, గూడెందొడ్డి ఎత్తిపోతల పథకం సామర్థ్యం పెంపునకు సంబంధించి సమగ్ర అధ్యయనం చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సేకరించాల్సిన భూమి, పరిహారం, ఇతర అంశాలపై నివేదిక రూపొందించాలన్నారు. గూడెందొడ్డి పంప్డ్‌స్టోరేజీ ప్రాజెక్టుకు సంబంధించి కన్సల్టెంట్ ను నియమించాలని ఆదేశించారు. కన్సెల్టెంట్ నియామకంలో నైపుణ్యం, గత చరిత్రను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేయాలన్నారు. గోదావరి, కృష్ణా బేసిన్లలోని ఆయకట్టు కింద ఉన్న రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షలో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి వి.శేషాద్రి, సెక్రటరీ మాణిక్ రాజ్, రాష్ట్ర నీటి పారుదల శాఖ కార్యదర్శి ఈ.శ్రీధర్, ఆర్అండ్ఆర్ కమిషనర్ శివ కుమార్ నాయుడు ఇతర అధికారులు పాల్గొన్నారు.



