పౌష్టికాహార లోపానికి చెక్..
నవతెలంగాణ – మల్హర్ రావు
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు బ్రేక్ఫాస్ట్ అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలిముద్ద పేరిట చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఇటీవల ప్రారంభించారు. మండలంలో ఆరు నెలల పైబడిన చిన్నారులు చాలా మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు.ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం వంటి సమస్యలను చూస్తూనే ఉన్నాం. ఈ లోపాన్ని అధిగమించేందుకు ఈ పథకం దోహ దపడనుంది. మండలంలో మొత్తం అంగన్ వాడిలు 38 ఉండగా ఇందులో 6 నెలల నుంచి 3 ఏళ్లలోపు చిన్నారులు 695,3 నుంచి 6 ఏళ్ళలోపు చిన్నారులు 499 ఉన్నారు.
అల్పాహారం ఇలా..
ప్రస్తుతం ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు చిన్నారులకు బాలామృతం, నెలకు 16 కోడిగుడ్లు ఇస్తు న్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు ప్రతిరోజు ఉడికించిన గుడ్డు, ఒక పూట భోజనం పెడుతున్నారు. ఆకుకూరలు,కూరగాయలు,సాంబర్ వడ్డిస్తున్నారు.వీరితో పాటు గర్భిణులు, బాలింతలకు ఈ కార్యక్రమం అమలవుతుంది. అయితే మధ్యాహ్నం తర్వాత చిన్నారులకు భోజనంతో వారు నీరసించిపోతున్నారు. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం చిన్నారులకు కిచిడి ఉప్మా తదితర అల్పా హారం అందించే ఏర్పాట్లు చేస్తుంది.
పోషకాహారం అందించడమే లక్ష్యంగా..
చిన్నారులకు పోషకాహారం అందించడమే లక్ష్యం గా ప్రభుత్వం తొలిముద్ద కార్యక్రమాన్ని చేపడుతోంది.అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చాలా మంది చిన్నారుల తల్లిదండ్రులు కూలీ, వ్యవసాయ పనులకు వెళ్తుంటారు. ఉదయం పూట చిన్నారులు ఇంట్లో తినితినకుండానే కేంద్రాలకు వెళ్లడంతో అక్కడ నీరసించిపోతున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో వీరికి భోజనం పెడ తారు. అప్పటివరకు నిరీక్షించాల్సిందే.ఈ క్రమంలో చాలా మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. బక్కచిక్కిపోవడంతో పాటు వివిధ రుగ్మతలు వెంటాడుతున్నాయి. పౌష్టికాహారం అందించడంతో వారిలో ఎదుగుదలతో పాటు కేంద్రానికి వచ్చే చిన్నారుల సంఖ్య సైతం పెరగనుంది.చాలా మంది చిన్నారులు 10 గంటలు దాటితే కానీ కేంద్రాలకు రావడం లేదు. ఉదయం 9 నుంచి సాయం త్రం 4 గంటల వరకు కేంద్రాలు నడుస్తుండగా, చాలా కేంద్రాల్లో చిన్నారుల గైర్హాజరు కనిపిస్తోంది.



