నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మున్సిపల్ మైనారిటీ కోఆప్షన్ (క్రిస్టియన్) సభ్యురాలిగా కాతా అలియాస్ మారుపాక గ్లోరినా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్ దండి లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య ప్రత్యేక సమావేశంలో 14 మంది కాంగ్రెస్ కౌన్సిలర్ల మద్దతుతో ఎన్నికైనట్లు మున్సిపల్ కమిషనర్ టి. మల్లికార్జున్ ప్రకటించారు. గత మే నెలలో మొత్తం నలుగురు కోఆప్షన్ సభ్యులకుగాను ముగ్గురిని ఎన్నుకోగా.. ఒక మైనారిటీ కోఆప్షన్ సభ్యుడి ఎన్నిక వాయిదా పడింది. కౌన్సిలర్ల ఏకాభిప్రాయంతో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కాతా గ్లోరినాను మైనారిటీ కోఆప్షన్ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
తన ఎన్నికకు సహకరించి మద్దతు తెలిపిన మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు, మంత్రి పొన్నం ప్రభాకర్, హుస్నాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్డేపల్లి వెంకటరమణకు గ్లోరినా కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ పాలకవర్గ సభ్యులతో కలిసి మైనారిటీల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు చెన్నబోయిన అనూష, బూరుగులత, పిల్లి తిరుపతి, బొలిశెట్టి రాజు, భూక్య సంపత్ నాయక్, గడిపే సతీష్‌కుమార్, సావుల మంజుల, పూదరి వరప్రసాద్ మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.



