Thursday, April 2, 2026
E-PAPER
Homeజాతీయంపౌర, మానవ హక్కుల సంస్థలే లక్ష్యంగా ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ

పౌర, మానవ హక్కుల సంస్థలే లక్ష్యంగా ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ

- Advertisement -

ఎర్నాకులంలో ‘మీట్‌ ది లీడర్‌’ కార్యక్రమంలో సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి ఎంఏ బేబీ
కొచ్చి : ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం మతపరమైన మైనారిటీలను మాత్రమే కాకుండా, పౌర హక్కులు, మానవ హక్కుల సంస్థలను కూడా లక్ష్యంగా చేసుకుంటోందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ పేర్కొన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యకలాపాలను బట్టబయలు చేసేవారిని అణచివేయడమే దీని వెనుక ఉన్న లక్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు. వృద్ధాశ్రమాలు, విద్యా కార్యకలాపాలు, సేవా కార్యక్రమాలను నిర్వహించే వివిధ స్వచ్ఛంద సంస్థల (ఎన్జీఓ) ఆస్తులన్నింటినీ జప్తు చేసే అధికారాన్ని ఈ సవరణ కేంద్ర ప్రభుత్వానికి కల్పిస్తుందని అన్నారు. ఎర్నాకులం ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన ‘మీట్‌ ది లీడర్‌’ కార్యక్రమంలో బేబీ మాట్లాడుతూ మత ఘర్షణలు, రక్తపాతాన్ని ప్రేరేపించే ఆర్‌ఎస్‌ఎస్‌ను మాత్రం ఈ చట్ట పరిధి నుంచి మినహాయించారని వివరించారు.

ఎమర్జెన్సీ సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం ఈ చట్టాన్ని ప్రవేశపెట్టి, కక్షపూరిత ధోరణితో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టినది నాటి ప్రధాని ఇందిరా గాంధీయేనని చెప్పారు. అప్పట్లో కూడా ఈ చట్ట పరిధి నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ను మినహాయించారన్నారు. మహాత్మా గాంధీ హత్య తర్వాత విధించిన నిషేధాన్ని ఎత్తివేసినప్పుడు, ఆర్‌ఎస్‌ఎస్‌ను ఒక ”సాంస్కృతిక సంస్థ” అని చూపిన సమర్థననే ఇందిరా గాంధీ కూడా ఉపయోగించుకున్నారని తెలిపారు. ఇందిరా గాంధీ హయాంలోనే కాంగ్రెస్‌-ఆర్‌ఎస్‌ఎస్‌ ఒప్పందం మొదలైందని, ఇందిరా గాంధీ ద్వారా కాంగ్రెస్‌ ఆర్‌ఎస్‌ఎస్‌తో ప్రారంభించిన ఈ ”ఒప్పందం”, రాజీవ్‌ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో అయోధ్యలో ‘శిలాన్యాస్‌’ (శంకుస్థాపన)కు అవకాశం కల్పించడంతో మరింత బలపడిందని అన్నారు.

ప్రధాని నరసింహారావు హయాంలో.. ఈ ఒప్పందం బాబ్రీ మసీదు కూల్చివేత వరకు విస్తరించిందని, తదనంతరం కాంగ్రెస్‌ , బీజేపీ మధ్య ఉన్న సరిహద్దులు చెరిగిపోయాయని చెప్పారు. అందుకే ఇప్పుడు ఏ కాంగ్రెస్‌ సభ్యుడైనా సులభంగా బీజేపీలోకి మారిపోగలుగుతున్నారన్నారు. ఆర్థిక , సామాజిక వ్యవస్థలలో మార్పులు తీసుకురావడానికి, ప్రజల పక్షం వహించి పనిచేసేవారే వామపక్షవాదులని తెలిపారు. కేరళలో అసలు ”వామపక్షం” అనేదే లేదని రాహుల్‌ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు, ఆయనకు ఈ విషయాలపై తగినంత లోతైన అవగాహన లేకపోవడం వల్లేనని బేబీ అభిప్రాయపడ్డారు.

మతతత్వ ధోరణులు కలిగినవారితో గానీ, అటువంటి పనితీరును ప్రదర్శించేవారితో గానీ సీపీఐ(ఎం) , ఎల్డీఎఫ్‌ ఎప్పటికీ సహకరించని స్పష్టం చేశారు. అటువంటి వ్యక్తులు తమ సొంత నిర్ణయాల ఆధారంగా కొన్ని ప్రకటనలు చేసినప్పటికీ, వారితో చర్చలు జరపడానికో లేదా ఒక అవగాహనకు రావడానికో సీపీఐ(ఎం) గానీ, ఎల్డీఎఫ్‌ గానీ ఎటువంటి ప్రయత్నం చేయవని అన్నారు. కేరళలో మతతత్వ శక్తులతో, మత మౌఢ్యవాదులతో బహిరంగ పొత్తులు పెట్టుకున్నది కాంగ్రెస్‌, యూడీఎఫ్‌ కూటములేనని విమర్శించారు. కాంగ్రెస్‌, బీజేపీలు ప్రస్తుతం తమ ఎన్నికల మ్యానిఫెస్టోల ద్వారా ప్రజలకు తప్పుడు హామీలు ఇవ్వడంలో పోటీ పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -